పాకిస్తాన్ ఎన్నికల్లో హింస.. క్వెట్టాలో బాంబు పేలుడు.. 31 మంది మృతి

ఓటింగ్ కేంద్రం వద్ద తనిఖీలు చేస్తున్న భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఓవైపు సార్వత్రిక ఎన్నికలుకోసం ప్రజలు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరుతుంటే, మరోవైపు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. క్వెట్టా నగరంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇతర ప్రాంతాల్లోనూ చిన్న తరహా బాంబు పేలుళ్లు, వివిధ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఇద్దరు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.

ఈ ఎన్నికలు ప్రధానంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి, నవాజ్ షరీఫ్ పార్టీకి మధ్య పోటీగా మారాయి. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడేందుకు బహిరంగంగానే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం వ్యాఖ్యానించింది.

దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, ఎన్నికల బ్యాలెట్ల భద్రత కోసం 3,70,000 మంది భద్రత సిబ్బందిని రంగంలోకి దించారు. అయినప్పటికీ హింస చోటు చేసుకుంటోంది.

కాగా, సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోని పట్టణమైన క్వెట్టాలో జరిగిన ఈ దాడి పోలింగ్ స్టేషన్ గేటు వద్ద పహారా కాస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడి అని అధికారులు చెప్పారు. పాకిస్తాన్ ఆత్మాహుతి దాడుల్లో అత్యంత దారుణమైన దాడి ఈనెలలోనే జరిగింది. మస్తుంగ్ సమీపంలో జరిగిన ఈ దాడిలో 149 మంది చనిపోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అప్పట్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకుంది.

పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభాలు సర్వసాధారణం. గత కొన్ని నెలలుగా జరుగుతోంది కూడా అదే. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు జైలులో ఉన్నారు. ఒక అవినీతి కుంభకోణం నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, వీడియో: పాకిస్తాన్ ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎక్కడ?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)