అఫ్ఘానిస్తాన్: రంజాన్ సందర్భంగా మూడు రోజులు తాలిబాన్ కాల్పుల విరమణ

రానున్న రంజాన్ పర్వదినం సందర్భంగా అఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలతో మూడు రోజుల పాటు కాల్పుల విరమణ పాటించనున్నట్టు తాలిబాన్ ప్రకటించింది.
2001లో అఫ్ఘానిస్తాన్‌పై అమెరికా ఆక్రమణ ఫలితంగా అధికారం కోల్పోయిన తాలిబాన్ ఇలా కాల్పుల విరమణ ప్రకటించడం ఇదే తొలిసారి. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ బలగాలు ఏకపక్ష కాల్పుల విరమణ ప్రకటన చేసిన నేపథ్యంలో తాలిబాన్ ఈ ప్రకటన చేసింది.
సెలవు దినాల సందర్భంగా ప్రభుత్వ బలగాలపై ఎలాంటి దాడులకూ పాల్పడబోమని తాలిబాన్ ప్రకటించింది. అయితే విదేశీ సైనిక బలగాల విషయంలో ఈ కాల్పుల విరమణ వర్తించదని పేర్కొంది.
తాలిబాన్ మిలిటెంట్ల చేతిలో దేశవ్యాప్తంగా 60 మంది అఫ్ఘాన్ భద్రతా బలగాలు హతమైన కొద్ది గంటల్లోనే ఈ ప్రకటన వెలువడింది.
తాలిబాన్ స్పందనను అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్వాగతించారు. "తమ హింసాత్మక చర్యల వల్ల అఫ్ఘాన్ ప్రజల హృదయాలను గెల్చుకోవడం కాదు కదా, వారికి మరింత దూరమై పోతున్నామన్న విషయాన్ని మిలిటెంట్లు అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం" అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే అఫ్ఘానిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) వంటి ఇతర మిలిటెంట్ గ్రూపులపై సైనిక చర్యలను ప్రభుత్వ బలగాలు నిలిపివేయడం లేదు.
ఇప్పుడే ఎందుకు?
ఈ వారం ప్రారంభంలో మతపెద్దల సమావేశం ఒకటి జరిగింది. మిలిటెంట్లు సాగిస్తున్న హింస ఇస్లామ్‌కు విరుద్ధమైందని అంటూ ఆ సమావేశంలో ప్రకటన చేసిన నేపథ్యంలో అఫ్ఘాన్ ప్రభుత్వ బలగాలు బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాయి.
ఈ వారంలో కాబూల్‌లో ఒక శాంతి శిబిరాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఎస్ చేసిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయారు. వీరిలో కొందరు మతపెద్దలు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, EPA
కాల్పుల విరమణ చేయాలనే నిర్ణయానికి రావడానికి కారణాలేంటో తాలిబాన్ ప్రకటనలో పేర్కొనలేదు. అయితే తమ వద్ద యుద్ధ బందీలుగా ఉన్న వారిని విడుదల చేయడానికి తాలిబాన్ సుముఖత వ్యక్తం చేసింది.
కానీ తమపై దాడులు జరిగితే "దీటైన పద్ధతుల్లో ఆత్మరక్షణ" చేసుకుంటామని స్పష్టం చేసింది.
తాలిబాన్ కాల్పుల విరమణ ప్రకటన పట్ల అఫ్ఘాన్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తులో శాంతి చర్చలకు దారి తీయగలదని ఆశిస్తున్నట్టు అఫ్ఘానిస్తాన్‌లో ఐరాస ప్రత్యేక ప్రతినిధి తాడామిచి యమామోటో తెలిపారు.
ఇది వాస్తవంగా ఎప్పుడు అమలవుతుంది?
కచ్చితమైన తేదీలను తాలిబాన్ పేర్కొనలేదు. పవిత్ర రంజాన్ మాసం ముగింపులో జరిగే ఈద్-ఉల్-ఫితర్ రోజుల్లో కాల్పుల విరమణ అమలులోకి వస్తుంది.
అఫ్ఘాన్ కేలండర్ ప్రకారం రంజాన్ పర్వదినం జూన్ 15న జరుగుతుంది.
విదేశీ సైన్యాల సంగతేంటి?
అఫ్ఘానిస్తాన్‌లో ఉన్న అమెరికా సైన్యబలగాలు, సంకీర్ణ భాగస్వాములు ఈ "కాల్పుల విరమణను గౌరవిస్తారు" అని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
ప్రస్తుతం అఫ్ఘాన్ గడ్డపై విదేశా బలగాల సంఖ్య 15,000 కు పడిపోయింది.
అయితే విదేశీ సైన్య బలగాలన్నీ దేశం వదిలి వెళ్లిపోతేనే తాము శాంతి చర్చలకు ముందుకు వస్తామని తాలిబాన్ చాలా కాలంగా షరతు విధిస్తూ వస్తోంది.
ఇటీవల జరిగిన తాజా ఘటనలేంటి?
ఓ వైపు కాల్పుల విరమణ ప్రకటనలు జరుగుతున్నప్పటికీ అఫ్ఘానిస్తాన్ అంతటా హింసాత్మక సంఘటనలు ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నాయి. ఒక్క శనివారమే తాలిబాన్ జరిపిన వేర్వేరు దాడుల్లో 60 మంది అఫ్ఘానిస్తాన్ సైనికులు మృతి చెందారు:
- దక్షిణ కందహార్ ప్రావిన్స్‌లో 23 మంది సైనికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. మరోవైపు దేశం పశ్చిమ భాగంలోని హెరాత్‌లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఈశాన్యంలోని కుందుజ్ ప్రావిన్స్‌లో 19 మంది పోలీసు అధికారులు మృతి చెందారు.
- ఉత్తరాన ఉన్న సార్-ఎ-పోల్ ప్రావిన్స్‌లో ఆరుగురు సైనికులు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








