అఫ్ఘాన్‌లో ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ కార్యాలయంపై దాడి

సేవ్ ద చిల్డ్రన్ కార్యాలయం గేటు వద్ద ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సేవ్ ద చిల్డ్రన్ కార్యాలయం గేటు వద్ద ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది

అఫ్ఘానిస్తాన్‌లో ’సేవ్ ద చిల్డ్రన్’ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంపై బుధవారం జరిగిన బాంబు దాడిలో 11 మంది గాయపడ్డారు.

జలాలాబాద్‌లోని సంస్థ కార్యాలయం వెలుపల పేలుడు సంభవించిందని, ఆ వెంటనే తుపాకులు ధరించిన సాయుధులు భవనంలోకి ప్రవేశించారని అధికారులు తెలిపారు.

ఒకవైపు తుపాకీ కాల్పుల మోతలు వినిపిస్తుండగా సమీపంలోని ఒక స్కూల్ చిన్నారులు ఆ ప్రాంతం నుంచి పరుగెడుతుండటం కనిపించిందని స్థానిక మీడియా కథనాలు చెప్తున్నాయి.

జలాలాబాద్‌లోని సేవ్ ద చిల్డ్రన్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంపై దాడితో ఎగసిపడుతున్న పొగ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కార్యాలయం ఆవరణ నుంచి పొగ ఎగసిపడుతూ కనిపిస్తోంది

ఈ దాడి చేసింది ఎవరనేది ఇంకా తెలియదు. అయితే జలాలాబాద్‌లో తాలిబాన్ మిలిటెంట్లు తరచుగా దాడులు చేస్తుంటారు.

కాబూల్‌లోని ఒక లగ్జరీ హోటల్ మీద తాలిబాన్ మిలిటెంట్లు దాడి చేసి 22 మందిని (అందులో ఎక్కువ మంది విదేశీయులే) హత్య చేసి రోజులు గడవకముందే జలాలాబాద్‌లో తాజా దాడి జరిగింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:10 గంటలకు ‘సేవ్ ద చిల్డ్రన్’ భవనం ప్రవేశ మార్గం దగ్గర కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేశారని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అతావుల్లా ఖోగ్యానీ పేర్కొన్నారు.

జలాలాబాద్‌లో దాడి జరిగిన ప్రదేశం నుంచి జనం పారిపోతున్న దృశ్యం

ఫొటో సోర్స్, Reuters TV

ఫొటో క్యాప్షన్, జలాలాబాద్‌లో దాడి జరిగిన ప్రదేశం నుంచి జనం పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి

భవనం గేటును సాయుధులు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పీజీ)తో ధ్వంసం చేయటం తాను చూశానని ఆ సమయంలో భవనం ఆవరణలో ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.

ఈ భవనం ఆవరణ నుంచి భారీ స్థాయిలో దట్టమైన నల్లని పొగ ఎగసిపడుతుండటం, ఒక వాహనం దగ్ధమవుతుండటం స్థానిక టీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది.

‘‘ఆ తర్వాత సాయుధుల బృందం ఒకటి కాంపౌండ్‌లోకి జొరబడింది. ఇప్పటివరకూ 11 మందిని ఆస్పత్రికి తీసుకువచ్చారు’’ అని ఖోగ్యానీ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. దాడికి పాల్పడ్డ సాయుధులకూ, భద్రతా సిబ్బందికి మధ్య ఇంకా పోరాటం కొనసాగుతోందని చెప్పారు.

దాడుల నేపథ్యంలో స్థానికులు పరుగులు తీశారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దాడుల నేపథ్యంలో స్థానికులు పరుగులు తీశారు

పాకిస్తాన్ సరిహద్దులో ఉండే నాన్‌గహర్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్. ఈ రాష్ట్రంలో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు 2015 నుంచి క్రియాశీలంగా ఉన్నారు.

అఫ్ఘానిస్తాన్‌లో చిన్నారుల కోసం విద్య, ఆరోగ్యపరిరక్షణ, సంరక్షణ కార్యక్రమాలను ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ నిర్వహిస్తుంటుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)