కాబూల్‌లో గురి తప్పిన అమెరికా క్షిపణి, పౌరుల మృతి

ఫొటో సోర్స్, EPA
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో క్షిపణి అదుపు తప్పడంతో పలువురు పౌరులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ కాబూల్ పర్యటన కోసం వచ్చిన కొద్దిసేపటికి కాబూల్ విమానాశ్రయంపై కొందరు మిలిటెంట్లు దాడి చేశారు. వారితో పోరాడుతున్న అఫ్ఘాన్ సైనికులకు మద్దతుగా అమెరికా బలగాలు వైమానిక దాడులు చేపట్టాయి.
‘‘విషాదకరంగా క్షిపణి అదుపు తప్పింది. దానివల్ల పలువురు పౌరులు చనిపోయారు‘‘ అని అఫ్ఘాన్‌లో నాటో మిషన్ రిసల్యూట్ సపోర్ట్ ఒక ప్రకటనలో పేర్కొంది.
‘‘పౌరులకు జరిగిన హాని పట్ల రిసల్యూట్ సపోర్ట్ తీవ్రంగా విచారిస్తోంది. ఈ దాడి, ఆయుధాలు అదుపు తప్పడం మీద దర్యాప్తు చేస్తున్నాం’’ అని చెప్పింది.
అయితే మొత్తం ఎంత మంది పౌరులు చనిపోయారనేది స్పష్టం కాలేదు.
ఇదిలావుంటే, అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ విమానం లక్ష్యంగా కాబూల్ విమానాశ్రయం మీద జరిగిన రాకెట్ దాడి తమ పనేనంటూ ఇటు తాలిబాన్, అటు ఇస్లామిక్ స్టేట్ రెండూ ప్రకటించాయి.

ఫొటో సోర్స్, EPA
అష్రాఫ్‌తో మాటిస్ చర్చలు
అఫ్ఘానిస్తాన్ సైన్యాన్ని బలోపేతం చేసే అంశంపై నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీలతో జనరల్ మాటిస్ చర్చలు జరిపారు.
అఫ్ఘానిస్తాన్‌కు మరో 3,000 మంది సైనికులను అదనంగా పంపుతామని అమెరికా ఇటీవలే ప్రకటించింది.
అమెరికా సారథ్యంలోని నాటో బలగాల మద్దతు అఫ్ఘాన్ సైన్యానికి ‘‘యుద్ధరంగంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా గణనీయమైన బలాన్నిస్తాయి’’ అని జనరల్ మాటిస్ చెప్పారు.
‘‘ఒక క్రూరమైన శత్రువు అధికారం కోసం చంపుకుంటూ వెళ్లడాన్ని అమెరికా అనుమతించదు’’ అని ఆయన పేర్కొన్నారు.
తాలిబాన్‌కు వ్యతిరేకంగా అమెరికా యుద్ధ చర్యలు అధికారికంగా 2014లోనే ముగిశాయి. కానీ అఫ్ఘాన్ సైన్యానికి మద్దతుగా 8,000 మందికి పైగా అమెరికా ప్రత్యేక సైనికులు ఇంకా అఫ్ఘాన్‌లోనే ఉన్నారు.
అమెరికా సారథ్యంలో అఫ్ఘాన్‌పై ఆక్రమణ జరిగిన పదహారేళ్ల తర్వాత కూడా ఆ దేశ భూభాగంలో 60 శాతం మాత్రమే అఫ్ఘాన్ సర్కారు నియంత్రణలో ఉంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)








