కాబూల్‌లో ఆత్మాహుతి దాడి, మిలటరీ కేడెట్ల మృతి

ఫొటో సోర్స్, NASIR BEHZAD, BBC AFGHAN SERVICE
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మిలటరీ కేడెట్లు ప్రయాణిస్తున్న మినీ బస్ మీద శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. తాజా దాడితో ఈ వారంలో అఫ్ఘాన్‌లో వివిధ మిలిటెంట్ గ్రూపుల దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య దాదాపు 200 కి చేరింది.
మార్షల్ ఫహీమ్ మిలిటరీ అకాడమీ నుంచి సైనిక కేడెట్లతో బయలుదేరిన మినీబస్ ప్రధాన ద్వారం దాటుతుండగా.. కాలినడకన వచ్చిన మిలిటెంటు ఆత్మాహుతి దాడి చేసినట్లు రక్షణశాఖ అధికార ప్రతినిధి దావ్లాత్ వజీరీ చెప్పారు. ఈ దాడిలో మరో నలుగురు గాయపడ్డారని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో సోర్స్, Twitter
‘‘తీవ్రవాదులు యుద్ధ రంగంలో గెలవలేరు. వారు నిస్పృహలో ఉన్నారని ఈ దాడి చెప్తోంది’’ అని నాటో రిసల్యూట్ సపోర్ట్ మిషన్ ట్విటర్‌లో వ్యాఖ్యానించింది.
శుక్రవారం నాడు షియా ముస్లిం మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి, కాల్పుల దాడిలో 56 మంది చనిపోయారు. ఆ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది.
సున్నీ ముస్లింలకు చెందిన ఈ తీవ్రవాద సంస్థ ఆ దాడి తమ పనేనని చెప్పడానికి ఆధారాలేమీ చూపలేదు. అయితే ఈ సంస్థ గతంలో షియా మసీదులపై దాడి చేసింది.

ఫొటో సోర్స్, NASIR BEHZAD, BBC AFGHAN SERVICE
శుక్రవారం నాడే ఘోర్ ప్రావిన్స్‌లో సున్నీ ముస్లిం మసీదుపై జరిగిన దాడిలో 20 మంది చనిపోయారు. ఆ దాడి చేసింది ఎవరనే విషయం మీద స్పష్టత లేదు.
ఇటీవలి నెలల్లో అఫ్ఘానిస్తాన్‌లో వరుస వెంట ఆత్మాహుతి, బాంబు దాడులు జరుగుతున్నాయి. దేశంలో తమ కఠిన ఇస్లామిక్ చట్టాలను మళ్లీ స్థాపించాలని కోరుకుంటున్న సున్నీ తీవ్రవాదుల బృందం తాలిబన్ చేతుల్లో అఫ్ఘాన్ సైనిక, పోలీసు బలగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ వారంలో జరిగిన ఇతర దాడులు:
- గురువారం నాడు కాందహార్ ప్రావిన్స్‌లోని ఒక సైనిక స్థావరంపై ఇద్దరు తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు హమ్వీ సైనిక వాహనాలతో చేసిన దాడిలో 43 మంది అఫ్ఘాన్ సైనికులు చనిపోయారు. ఘజ్నీ ప్రావిన్స్‌లో ఇద్దరు పోలీసు అధికారులు కూడా చనిపోయారు.
- మంగళవారం నాడు గార్దెజ్ నగరంలోని ఒక పోలీసు శిక్షణ కేంద్రంపై తాలిబన్ ఆత్మాహుతి బాంబర్లు, సాయుధులు చేసిన దాడిలో 41 మంది మృతిచెందారు.
- మంగళవారం నాడే ఘజ్నీలో జరిగిన కారు బాంబు దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పాయారు.

మే నెలలో కాబూల్‌లో జరిగిన ట్రక్కు బాంబు దాడిలో 150 మంది చనిపోయారు. మరో 400 మంది చనిపోయారు. వారందరిలో అత్యధికులు సాధారణ పౌరులే. ఆ దాడి చేసింది తామేనని ఏ మిలిటెంట్ సంస్థా ప్రకటించలేదు.
అయితే తాలిబన్ అనుబంధ బృందమైన హక్కానీ గ్రూప్ ఆ దాడికి పాల్పడిందని అఫ్ఘాన్ సర్కారు ఆరోపించింది. అఫ్ఘాన్ ప్రభుత్వానికి అమెరికా మద్దతునిస్తున్న విషయం తెలిసిందే.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








