హుజూరాబాద్ ఎన్నిక... 306 పోలింగ్ కేంద్రాలు రెడీ

- రచయిత, బళ్ల సతీష్, కే నవీన్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం సాయంత్రం ఏడు గంటల నుంచి హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో అన్ని రకాల సమావేశాలూ నిషేధించారు.
అక్టోబర్ 30వ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది.
పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు కూడా హుజూరాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.

ఉప ఎన్నిక ఎందుకొచ్చింది
దాదాపు ఏడాది నుంచి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని అప్పుడప్పుడూ అయినా ప్రశ్నిస్తూ వచ్చారు.
2021 మే మొదటి వారంలో ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయన్న కారణంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నుంచి తొలగించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
తరువాత, జూన్ రెండవ వారంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే దిల్లీ వెళ్ళి బీజేపీలో చేరారు.
అనంతరం, తన నియోజకవర్గంలో 'ప్రజా దీవెన యాత్ర' పేరుతో పాదయాత్ర చేశారు.
ఆయన రాజీనామా చేసిన దగ్గర నుంచి క్రమంగా హుజూరాబాద్‌లో ఎన్నికల వాతావరణం నెలకొంది.
అదే నియోజకవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. శ్రీనివాస్ ఆ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేశారు.
ఇక కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా బల్మూరి వెంకట నరసింగ రావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. వెంకట్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో పనిచేశారు.
వీరు ముగ్గురూ కాకుండా మరో 27 మంది అంటే మొత్తం 30 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.
అన్యాయంగా పార్టీ నుంచి గెంటేశారని, తనది ఆత్మగౌరవ పోరాటం అంటూ ఈటల ఎన్నికల ప్రచారం సాగింది.
ఈటల వెన్నుపోటు పొడిచారంటూ టీఆర్ఎస్ ప్రచారం సాగింది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్లు వేయడంతో సహా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను కోట్లాది రూపాయల ఖర్చుతో చకచకా పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం.
బీజేపీ, టీఆర్ఎస్ పెద్దలు, కాంగ్రెస్ ప్రముఖులు అందరూ చురుగ్గా ప్రచారంలో పాల్గొన్నారు.
స్థానిక పరిస్థితులను బట్టి ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. పార్టీలు ప్రచారం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి.
ఇక కరీంనగర్, హుజూరాబాద్ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రాబల్యం ఎక్కువే. 2004 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీదే గెలుపు.
అదే సమయంలో బీజేపీ క్రమంగా తన ఉనికిని చాటుకుంటూ వచ్చింది.
మరి, ఈ సారి హుజూరాబాద్ ఓటర్లు ఏం తీర్పునిస్తారో చూడాలి.

పోలింగ్ ఏర్పాట్లు
మరోవైపు, పోలింగ్ ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్. వి. కర్ణన్ ప్రకటించారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బుధవారం వెనక్కి వెళ్లిపోవాల్సి ఉంటుంది. 28వ తేదీ ఉదయం నుంచి పోలింగ్ ముగిసే వరకూ మద్యం అమ్మకూడదు.
కౌంటింగ్ జరిగే రోజు అంటే నవంబర్ 2వ తేదీన కరీంనగర్ పట్టణంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు.
మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 2,36,873 మందికి సాధారణ ఓటు హక్కు ఉంది. వారిలో 1, 17, 779 మంది పురుషులు, 1, 19, 993 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ వ్యక్తి ఉన్నారు.
వీరిలో పాటు 149 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 14 మంది ఎన్ఆర్ఐలను కలుపుకుంటే మొత్తం 2, 37, 36 మందికి ఓటు హక్కు ఉంది.
హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఈవీఎంలను తరలిస్తారు. ఎన్నికలు పూర్తయ్యాక కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీకి ఈవీఎంలను తరలిస్తారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 306 కంట్రోల్ యూనిట్‌లూ, 612 బ్యాలెట్ యూనిట్లూ వాడుతున్నారు. అదనంగా మరో 279 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేసుకున్నారు.
ఇక పీవో, ఏపీవోలు 12 వందల 24 మంది, రిజర్వు పీవో, ఏపీవోలు 491 మంది కలపి మొత్తం 1,715 మంది పోలింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
కేంద్ర బలగాల నుంచి 1, 520 మంది పోలీసులు, రాష్ట్ర రిజర్వు పోలీసు నుంచి 174 మంది, కరీంనగర్ జిల్లా నుంచి 700 మంది పోలీసులు, ఇతర జిల్లా నుంచి 1, 471 మంది పోలీసులు కలపి మొత్తం 3, 865 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాలలో హెల్త్ డెస్క్ పెట్టారు. ఓటర్లందరూ మాస్కులు పెట్టుకోవాలి. అదనంగా బూత్‌ల దగ్గర కూడా కొన్ని మాస్కులు ఉంచుతున్నారు. శానిటైజర్లు పెడుతున్నారు. ఓటర్ల జ్వరం కూడా చూస్తారు.
ఈవీఎం బటన్ నొక్కడం కోసం ఒక చేతికి డిస్పోజబుల్ గ్లౌస్ ఇస్తారు. క్యూలలో భౌతిక దూరం పాటించాలి. పోలింగ్ స్టేషన్లను శానిటైజ్ చేశారు.
బాగా జ్వరం ఉన్న వారు, కోవిడ్ పాజిటివ్ ఉన్న వారు చివరి గంటలో అంటే సాయంత్రం ఆరు, ఏడు గంటల మధ్య ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
కోవిడ్ అనుమానితులు, పాజిటివ్ వచ్చిన వారికి మాత్రం పీపీఈ కిట్లు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈటల రాజేందర్: 'కేసీఆర్‌తో ఎక్కడ బెడిసికొట్టిందంటే...' -బీజేపీ నేతతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ
- ‘రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా ఆపినట్లు ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ ఆపగలరా’
- తెలంగాణ, ఏపీ ఉపఎన్నికలు: ఆ రెండు నియోజకవర్గాల్లో అధికారపార్టీ వ్యూహాలేంటి, ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి?
- తెలంగాణ: 'శాసనసభ అర్థవంతమైన చర్చలకు వేదిక కావాలి... కుస్తీ పోటీలకు కాదు' - కేసీఆర్
- అమిత్ షా ‘రజాకార్ కార్డు’ తెలంగాణలో బీజేపీకి ఓట్లు తెచ్చిపెడుతుందా?
- ‘దిల్లీలో తెలంగాణ భవన్‌కు భూమి ఇవ్వండి’.. మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్రం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- ఎకో ఫ్రెండ్లీ సెక్స్.. ఏమిటీ కొత్త కాన్సెప్ట్
- ‘హిందువుల మధ్య రిజ్వాన్ నమాజ్ చేయడం నచ్చింది’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై వకార్ యూనిస్ క్షమాపణ
- తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే కంటెంట్‌ను కంట్రోల్ చేయడంలో ఫేస్‌బుక్ చేతులెత్తేసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








