ఆస్ట్రేలియా చేతిలో భారీ ఓటమి తరువాత భారత హాకీ జట్టు ఏమంటోంది

భారత్, ఆస్ట్రేలియా మధ్య హాకీ మ్యాచ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అరవింద్ ఛాబ్రా
    • హోదా, బీబీసీ న్యూస్

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఆదివారం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

ప్రపంచ నంబర్ 1గా ఉన్న ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను 7-1 తేడాతో ఓడించింది.

అంతకుముందు భారత జట్టు తన మొదటి మ్యాచ్‌లో 3-2 తేడాతో న్యూజీలాండ్‌పై గెలుపొంది ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఆదివారం మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమి పాలైంది.

భారత జట్టులో దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కరే గోల్ సాధించారు.

భారీ తేడాతో ఓటమి పాలైన అనంతరం దిల్‌ప్రీత్ సింగ్ 'బీబీసీ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..

ఆస్ట్రేలియా చేతిలో అవమానకర రీతిలో 7-1 తేడాతో ఓటమి పాలవడం బాధ కలిగించిందని, ఈ ఓటమి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని దిల్‌ప్రీత్ సింగ్ అన్నారు.

జట్టు సభ్యులు ఎవరో ఒకరు చేసిన తప్పులు కాకుండా మొత్తంగా జట్టుగానే తప్పులు చేయడంతో ఓటమి పాలయ్యామని ఆయన విశ్లేషించారు.

''ఇదో పెద్ద గుణపాఠం. మళ్లీ గెలుపు బాట పట్టేందుకు చాలా మార్పులతో వస్తాం'' అన్నారాయన.

భారత హాకీ జట్టు

ఫొటో సోర్స్, HockeyIndia/twitter

ఓటమికి కారణమేంటి.. ఎక్కడ తప్పు జరిగిందన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఆస్ట్రేలియా తమపై ఏమీ అటాకింగ్ గేమ్ ఆడలేదని.. ఈ ఆటకు సంబంధించిన వీడియోలు చూసి తాము ఎక్కడ తప్పు చేశామో తెలుసుకుంటామన్నారు.

బాల్‌ను మరింత బాగా స్ట్రైకింగ్ చేయడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన 21 ఏళ్ల దిల్‌ప్రీత్ అన్నారు.

''ఇంకా మూడు మ్యాచ్‌లున్నాయి. అందులో 9 పాయింట్లు సాధిస్తేనే క్వార్టర్‌ఫైనల్‌కు వెళ్తాం'' అని చెప్పారు దిల్‌ప్రీత్.

ఒలింపిక్స్ విలేజ్‌లో వాతావరణానికి అడ్జస్ట్ అయ్యారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ తాము ట్రైనింగ్ తీసుకున్న బెంగళూరులో ఉన్నట్లే ఇక్కడా ఉందని, ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదన్నారు.

ఆస్ట్రేలియా జట్టు

ఫొటో సోర్స్, Getty Images

నిరాశచెందాం

ఈ ఓటమి అనంతరం కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ జట్టంతా నిరాశకు గురైందన్నారు.

టోర్నీ ఇప్పుడే మొదలైందని.. ఈ ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మిగతా మ్యాచ్‌లపై దృష్టిపెట్టలేమని ఆయన అన్నారు.

ఖాళీగా ఉన్న స్టేడియాలలో ఆడడంపై మన్‌ప్రీత్ మాట్లాడుతూ.. మైదానంలో ప్రేక్షకులు ఉత్తేజపరుస్తుండే ఆడాలనే కోరుకుంటాం. కానీ కోవిడ్ వల్ల ఈ పరిస్థితి తప్పదన్నారు.

ఒలింపిక్స్ విలేజ్‌లో ఆహారం మీకు నప్పుతోందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ భోజనం బాగుందని, అథ్లెట్లకు ఏం కావాలో అలాంటి ఫుడ్ దొరుకుతోందని చెప్పారు.

భోజనంలో ప్రత్యేకించి ఏం నచ్చిందనగా తడుముకోకుండా జపాన్ వంటకం 'సుషి' పేరు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)