Mehreen Pirzada: మాజీ సీఎం మనవడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - ప్రెస్‌రివ్యూ

మెహ్రీన్

ఫొటో సోర్స్, facebook/mehreen pirzada

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహరీన్ ఫిర్జాదా తనకు హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరగాల్సిన వివాహం రద్దు చేసుకున్నట్లు ప్రకటించారని ‘వెలుగు’ పత్రిక ఒక కథనంలో తెలిపింది.

‘‘ఇద్దరి అభిప్రాయాలు కలవకపోవడంతో కలసి జీవించలేమని నిర్ణయానికి వచ్చి పెళ్లి వద్దనుకున్నామని.. గత మార్చిలో చేసుకున్న నిశ్చితార్ధాన్ని కూడా రద్దు చేసుకున్నామని స్పష్టం చేసింది.

ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుని హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాదించుకుంటున్న తరుణంలో గత మార్చిలో హఠాత్తుగా పెళ్లికి రెడీ కావడం సంచలనం రేపింది.

మార్చి నెలలో కరోనా సెకండ్ వేవ్ ప్రబలడానికి కొద్ది ముందు జైపూర్ లో ఘనంగా నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే.

నాని హీరోగా నటించిన ''కృష్ణగాడి వీరప్రేమ గాధ'' తో తెలుగు సినిమాల్లో మెహరీన్ ఫిర్జాదా అరంగేట్రం చేసింది.

ఆ తరువాత ఆమె నటించిన మహానుభావుడు.. రవితేజతో ''రాజా ది గ్రేట్''లు విడుదలయ్యాయి.

ఎఫ్2 సినిమాలో యంగ్ బ్యూటీ నటతనతోనూ మెప్పించింది. ఇదే ఊపులో ఎఫ్3 లో కూడా నటించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కకముందే ఆమె పెళ్లి కి రెడీ కావడం.. నిశ్చితార్ధం జరిగిపోవడం జరిగిపోయాయి.

తాను బిష్ణోయ్ ఇద్దరం కలసి ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇకపై తనకు బిష్ణోయ్ తో గాని.. అతని కుటుంబ సభ్యులతోగాని ఎలాంటి సంబంధాలుండబోవని స్పష్టం చేసింది.

సినిమా అభిమానులు, మీడియా అందరూ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషయాలను గౌరవించి తన ప్రైవసీకి ఆటంకాలు కలిగించవద్దని కోరింది. పెళ్లి బ్రేకప్ కావడంతో సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నానని వివరించింద’’ని ఆ కథనంలో రాశారు.

షర్మిల

ఫొటో సోర్స్, YS SHARMILA REDDY/FB

YS Sharmila: వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ జెండా వివరాలివే..

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల కొత్తగా ఏర్పాటు చేయనున్న వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ జెండా ఖరారైందని ‘సాక్షి’ పత్రిక రాసింది.

‘‘పార్టీని ఈనెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ జయంతిని పురస్కరించుకుని ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పార్టీ జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో రూపొందించడం గమనార్హం. జెండాలో 80 శాతం మేరకు పాలపిట్ట రంగు, మిగిలిన 20 శాతం నీలం రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా రూపొందించినట్టు శనివారం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ వాడుక రాజగోపాల్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ ఉత్సవాన్ని హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో నిర్వహించడానికి పార్టీ వర్గాలు సమాయత్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లోటస్‌పాండ్‌లోని షర్మిల కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు.

8వ తేదీన నూతన పార్టీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివంగత నేత వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూలతో అలంకరించాలని వైఎస్‌ విగ్రహాల పరిరక్షణ కమిటీ కోఆర్డినేటర్‌ నీలం రమేశ్‌ పిలుపునిచ్చార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

పనస కాయ

ఫొటో సోర్స్, Getty Images

ప్రాణం తీసిన పనస కాయ

పనసకాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు ఒకటి మీదపడడంతో ఓ వ్యక్తి మృతి చెందారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వెంకటేశ్వర కాలనీకి చెందిన మాజీ కౌన్సిలర్, వ్యాపారి మాటూరి నారాయణమూర్తి(66) తన ఇంటి పెరట్లో ఉన్న పనస చెట్లు కాయలు కోయిస్తున్నారు. అవి కింద పడకుండా ఆయన గోనె సంచి పట్టుకున్నారు.

అయితే, ఓ కాయ నారాయణమూర్తి ముఖంపై పడగా ఆయన పట్టు తప్పి వెనక్కు సిమెంటు రోడ్డుపై పడ్డారు.

దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి భీమవరం తరలించేందుకు వాహనం ఎక్కిస్తుండగా చనిపోయారు'' అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)