కోవిడ్-19: కరోనా వ్యాక్సీన్ల పేరుతో నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబుకు టోపీ, లక్ష రూపాయలు కాజేసిన నిందితుడు

నిర్మాత, సురేశ్ ప్రొడక్షన్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబును వ్యాక్సీన్లు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేశారు.

ఫొటో సోర్స్, Facebok/Suresh babu

ఫొటో క్యాప్షన్, దగ్గుబాటి సురేశ్ బాబు
    • రచయిత, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి
    • హోదా, ఎస్. ప్రవీణ్ కుమార్‌, బీబీసీ కోసం

సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబును ఓ వ్యక్తి లక్ష రూపాయలకు మోసం చేశాడు. కోవిడ్ వ్యాక్సీన్లు ఇప్పిస్తానని చెప్పి అకౌంట్‌లో లక్ష రూపాయలు తీసుకుని, తరువాత ఫోన్ స్విచాఫ్ పెట్టాడు.

దీంతో సురేశ్ బాబు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు వేరే కేసుల్లో అదే నిందితుణ్ని పట్టుకున్నారు పోలీసులు.

ప్రస్తుతం దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 406, 420 (మోసం చేయడం) కింద కేసు నమోదు చేశారు. నిర్మాత దగ్గుబాటు సురేశ్ బాబు దగ్గర మేనేజర్‌గా పనిచేస్తోన్న రాజేంద్రప్రసాద్ ఈ ఫిర్యాదు ఇచ్చారు.

జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు మే 31వ తేదీ మధ్యాహ్నం సురేశ్ బాబుకు ఫోన్ చేశాడు. నాగార్జున రెడ్డి పేరుతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. తన దగ్గర 250కి పైగా కోవిడ్ వ్యాక్సీన్లు ఉన్నాయనీ, తాను ఆరోగ్య శాఖలో ఉద్యోగిని అనీ చెప్పారు.

తాను ఆరోగ్యశాఖలో పని చేస్తానని, 250 వ్యాక్సీన్లకు రూ.2.5 లక్షలు అవుతుందని సురేశ్ బాబుకు నిందితుడు చెప్పాడు. నిజమేననుకుని రూ. లక్ష రూపాయలను అతని ఎకౌంట్‌లో వేయించారు. తర్వాత నిందితుడు ఫోన్ స్విచాఫ్ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోవిడ్-19 వ్యాక్సినేషన్

ఆ వ్యాక్సీన్లకు 2.5 లక్షలు అవుతుందనీ, ముందుగా లక్ష రూపాయలు అడ్వాన్స్ కావాలనీ కోరారు. ఇది నిజమేనని నమ్మిన సురేశ్ బాబు తన మేనేజర్ ద్వారా అకౌంట్ నుంచి లక్ష రూపాయలు వేయించారు. ఆ తరువాత వ్యాక్సీన్ల కోసం ప్రయత్నించగా, ఆ నంబర్ స్విచాఫ్ వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఇప్పటికే ఆ నిందితునిపై పలు కేసులు ఉండడంతో అతని కోసం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు వెతుకుతున్నారు. ఆ క్రమంలోనే అతణ్ని జూన్ 21వ తేదీన పట్టుకుని రిమాండుకు తరలించారు. ఇప్పటికే అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది.

పోలీసుల విచారణలో అతను తన నేరాల్ని ఒప్పుకున్నట్టు తెలిసింది.

అయితే అంత పెద్ద మొత్తంలో వ్యాక్సీన్ల కోసం సురేశ్ బాబు కార్యాలయం ఎందుకు ప్రయత్నించింది అన్నది మాత్రం తెలియ లేదు. ఈ విషయంపై సురేశ్ బాబు కార్యాలయం స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)