యోగి ఆదిత్యనాథ్: మోదీ, అమిత్ షాలను సవాల్ చేస్తున్నారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
- హోదా, బీబీసీ కోసం
ఒకవైపు ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు గత రెండు వారాలుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, రాష్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల మధ్య జరుగుతున్న సమావేశాలు ప్రకంపనలు రేపుతున్నాయి.
ఈ చర్చల నడుమ ప్రభుత్వం, సంస్థాగత మార్పులతోపాటు, నాయకత్వం మార్పు గురించి పెద్ద ఎత్తున ఊహాగానాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ ఊహాగానాలలో ఏదీ నిజం కాలేదు.
ఈ వదంతులకు ప్రచారాలకు ప్రధాన కారణం ఓ వ్యక్తి. ఆయన పేరు అరవింద్ కుమార్ శర్మ. మాజీ బ్యూరోక్రాట్. ప్రధాని నరేంద్ర మోదీకి చాలా సన్నిహితుడిగా చెబుతుంటారు.
పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు ఈ ఏడాది జనవరిలో శర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఆయన బీజేపీలో చేరారు. వచ్చీ రాగానే శాసన మండలికి పంపింది బీజేపీ అధిష్ఠానం.
ఒకదాని వెంట ఒకటిగా పార్టీ అత్యంగా వేగంగా తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పు జరగబోతోందన్న ఊహాగానాలకు కారణమయ్యాయి.
అరవింద్ శర్మను ముఖ్యమంత్రిగా చేయవచ్చని కొందరు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. లేదంటే, ఆయనకు డిప్యూటీ సీఎం, లేదా హోం శాఖ వంటి ముఖ్యమైన పోర్ట్ ఫోలియోతో కేబినెట్‌లోకి తీసుకుంటారని కూడా ప్రచారం నడిచింది.
అరవింద్ శర్మకు ఇంత ప్రాధాన్యమివ్వడం వెనక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభావాన్ని తగ్గించాలన్న ప్రయత్నాలు ఉన్నాయని బహిరంగంగానే బీజేపీ నేతలు చర్చించుకున్నారు.
కానీ, నాలుగు నెలలు గడిచినా అరవింద్ శర్మకు కేబినెట్‌లో స్థానంగానీ, మరే ఇతర ముఖ్యమైన బాధ్యత గానీ ఇవ్వలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నరేంద్ర మోదీనియోగి సవాలు చేశారా?
"అరవింద్ శర్మను కేబినెట్‌లోకి తీసుకోవడం కష్టమని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. హోం శాఖతోపాటు ఏ ముఖ్య శాఖను ఆయనకు ఇవ్వడానికి సిద్ధంగా లేమని యోగి తేల్చారు.'' అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బీజేపీ సీనియర్ నేత అన్నారు.
ఇది ఒక రకంగా మోదీ నిర్ణయాన్ని సవాలు చేయడంగానే చాలామంది చూశారు. అయితే, దిల్లీలో మాత్రం యోగికి పలుకుబడి బాగానే ఉందని బీజేపీ నేతలు అంటున్నారు.
''పార్టీ అధినాయకత్వం తరచూ యోగీ ఆదిత్యానాథ్‌ను గుర్తు చేసుకుంటుంది. ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశించి రాలేదు. తనకు పదవి కావాలని ఏనాడు చెప్పలేదు. మరోవైపు, ప్రధానమంత్రి మోదీకి ఆయనే ప్రత్యామ్నాయం అనే ప్రచారం కూడా జరుగుతోంది'' అని దిల్లీలో ఓ బీజేపీ నేత అన్నారు.
మోదీకి ప్రత్యామ్నాయంగా కొంతమంది వ్యక్తులు, సంస్థలు తరచుగా ఆదిత్యనాథ్ పేరును సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. యోగికి అత్యంత సన్నిహితులైన కొందరు ప్రోత్సహిస్తున్నారని కూడా బీజేపీ నేతలు అంగీకరిస్తున్నారు.
యోగికి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉందా?
సీనియర్ జర్నలిస్ట్ యోగేశ్ మిశ్రా అభిప్రాయం ప్రకారం యోగికి ఆర్ఎస్ఎస్ నుంచి మద్దతు ఉంది.
''సంఘ్ ఆయన వెనక ఉంది. కొందరు వ్యతిరేకించినప్పటికీ యోగి ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం సంఘ్. పారాచూట్‌లాగా అరవింద్ శర్మను ఇక్కడ దింపడాన్ని సంఘ్ అంగీకరించదు'' అన్నారు మిశ్రా.
ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పదవీ కాలం పూర్తి చేసుకోబోతోంది. కానీ, ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఉంది. గతంలోనూ ఇలాంటి ప్రచారం ఉన్నప్పటికీ , అది అలా పుట్టి ఇలా మాయమయ్యేది.
శాంతి భద్రతల విషయంలో యోగి ప్రభుత్వం మీద బీజేపీలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే నిరసనకు దిగారు.
‘‘గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా పార్టీ పెద్దలు మంత్రులను, ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడుతున్నారు. పార్టీ సమావేశాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.‘‘ అని సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ్ కల్‌హన్స్ అన్నారు.
సిద్ధార్ధ్ అభిప్రాయం ప్రకారం ఈ పరిణామాలు చిన్న విషయం కాదు.
''మాకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఎంపిక చేసిన కొందరు అధికారుల చేతుల మీదుగానే పాలన నడుస్తోందని వారు అంటున్నారు. పాలన ఎలా సాగించాలన్న విషయాన్ని యోగి మర్చిపోయారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీఎం కూడా వాస్తవాలు గ్రహించి ఉంటారు. అయితే, ఇప్పటికిప్పుడు యోగిని పీఠం మీద నుంచి పార్టీ తొలగించలేదు. అలాగని ఆయన నేతృత్వంలో ఎన్నికల్లో పాల్గొనే సాహసం చేయలేదు" అన్నారు సిద్ధార్ధ్.

ఫొటో సోర్స్, Getty Images
యోగిపై అసంతృప్తికి కారణం ఏమిటి?
అరవింద్ శర్మ విషయంలో యోగి ఆదిత్యనాథ్ వైఖరి మీద మాట్లాడటానికి బీజేపీలో ఏ నాయకుడు సిద్ధంగా లేరు. కానీ, పార్టీలో అన్నీ సవ్యంగా లేవన్నది మాత్రం అందరూ అంగీకరిస్తున్నారు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పట్ల తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్త పరిచిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టంగా లేరు. కానీ పేరు బయట పెట్టకూడదు అనే షరతు మీద మాట్లాడుతున్నారు.
"కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై కేంద్ర నాయకత్వం చాలా అసంతృప్తిగా ఉంది. దీన్ని సరి చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. దీని ప్రభావం పంచాయతీ ఎన్నికల ఫలితాలలో కనిపించింది. దీంతో యోగి కాస్త వెనకడుగు వేశారు" అని ఒక యూపీ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
గతవారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేత దత్తాత్రేయ హొసబాలే యూపీలో రాజకీయ నాడిని అంచనా వేయడానికి లఖ్‌నవూకు వచ్చారు.
అంతకు మూడు రోజుల ముందు దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన ఒక కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి బీజేపీ సీనియర్ నేత, యూపీ బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ కూడా హాజరయ్యారు. కానీ, ఇంత కీలకమైన సమావేశానికి సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను గానీ, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌ను గానీ పిలవలేదు.
ఈ సమావేశం విషయంలో యోగి ఆదిత్యనాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
లఖ్‌నవూ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి యోగిని కలవడానికి హొసబాలే ప్రయత్నించినా కుదరలేదు. సీఎంను కలవడానికి తన టూర్‌ను పొడిగించుకున్నాహొసబాలే ఆయనతో సమావేశం కాలేకపోయారు. చివరకు కలవకుండానే ముంబయి వెళ్లిపోయారని ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఓ సీనియర్ కార్యకర్త వెల్లడించారు. ఈ పరిణామాలను కొందరు బీజేపీ నేతలు కూడా ధ్రువీకరించారు.
బీజేపీ కేంద్ర నాయకత్వానికి రబ్బర్ స్టాంప్‌లాగా మిగిలిపోవడానికి తాను సిద్ధంగా లేనని పరోక్షంగా యోగి సంకేతాలిచ్చినట్లు దీని అర్థంగా భావించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఎం యోగి బలమెంత?
కేంద్ర నాయకత్వాన్ని సవాలు చేసే స్థితిలో యోగి లేరని సీనియర్ జర్నలిస్ట్ యోగేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ''ఆయన నామినేట్ అయి వచ్చిన ముఖ్యమంత్రి. ఆయన పేరు మీద ఎన్నికల్లో గెలవలేదు. ఆయన పార్టీ ఆఫీస్ బేరర్ కూడా కాదు. కేంద్ర నాయకత్వానికి యోగి ఎప్పటికీ సవాల్ కాలేరు’’ అని మిశ్రా అన్నారు.
''బీజేపీ అసలు సమస్య ఏంటంటే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే, అది 2024 లోక్‌సభ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపుతుంది. పశ్చిమ బెంగాల్ ఓటమి తర్వాత పార్టీకి ఈ భయం మరింత పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో ఎవరూ రిస్క్ తీసుకోలేరు.'' అని మిశ్రా అభిప్రాయ పడ్డారు.
కొంతమంది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా లేరు. సంఘ్ ప్రతి విషయంలోనూ ఆయనకు అండగా నిలబడే పరిస్థితి లేదు.
యోగిని తొలగించడం వల్ల పార్టీకి నష్టం జరగవచ్చు. అయితే, ఆ నష్టాన్ని ఎలా భర్తీ చేయాలి అన్నదానిపై పార్టీ సమావేశాల్లో చర్చలు జరుగు తున్నాయి.
మరి యోగీ ఆదిత్యానాథ్ బలమేంటి ? ఆయనపై ఎలాంటి వ్యక్తిగత, అవినీతి ఆరోపణలు లేకపోవడమే ఆయన బలమని జర్నలిస్ట్ సిద్ధార్ధ్ కల్‌హన్స్ అన్నారు. ‘‘ఈ బలమే, మిగిలిన అన్ని బలహీనతలను సమాధి చేస్తుంది.’’ అని సిద్ధార్ధ్ కల్‌హన్స్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ యువరాజు దీపేంద్ర రెండు చేతుల్లో తుపాకులు నిప్పులు కక్కినప్పుడు ఏం జరిగింది
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా
- కోవిడ్ సోకితే గర్భిణులు ఏం చేయాలి.. తల్లి నుంచి బిడ్డకు వస్తుందా..
- భారతదేశంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరిందా...కేసులు తగ్గుముఖం పట్టడం దేనికి సూచిక
- బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ మరింత ప్రమాదకరమా.. ఈ వ్యాధి ఎవరికి వస్తుంది..
- కరోనావైరస్: వ్యాక్సీన్లు తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు వస్తే ఏం చేయాలి?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









