కోవిడ్: దిల్లీలో స్మశానాలు చాలక పార్కుల్లో శవ దహనాలు

పార్కుల్లోనే శవ దహనాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్కుల్లోనే శవ దహనాలు

దేశ రాజధాని దిల్లీలో కోవిడ్ మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో స్మశాన వాటికల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో తాత్కాలిక స్మశానవాటికలను ఏర్పాటు చేస్తున్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. సోమవారం ఒక్క దిల్లీలోనే 380 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆక్సిజన్, ఐసీయూ పడకలు, మందుల కొరత విపరీతంగా ఉంది.

గత కొద్ది రోజుల్లోనే ఇండియాలో 10 లక్షలకన్నా ఎక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

మంగళవారం కోవిడ్ కేసులు కొద్దిగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అంతకుముందు రోజు 3,52,991 కేసులు నమోదు కాగా.. మంగళవారం 3,23,144కి తగ్గింది.

దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య సుమారు 1.7 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు 1,92,000 మరణాలు సంభవించాయి.

అయితే, వాస్తవంలో కోవిడ్ కేసులు, మరణాలు ఇంతకన్నా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత వారం రోజుల్లో దిల్లీలో కనీసం 1,150 మరణాలను అధికారిక లెక్కల్లో కలుపలేదని ఎన్‌డీ టీవీ చేసిన ఒక పరిశోధనలో తేలింది.

మరికొన్ని ఇతర అధ్యయనాల్లో కూడా కోవిడ్ కేసులు, మరణాల సంఖ్య వాస్తవంలో కన్నా తక్కువగా ఉంటోందని కనుగొన్నారు.

అంత్యక్రియలు

ఫొటో సోర్స్, Getty Images

స్మశానవాటికలకు పెరుగుతున్న డిమాండ్

స్మశాన వాటికల్లో సిబ్బంది పగలనక రాత్రనక దహన సంస్కారాలు చేస్తూనే ఉన్నారు.

బంధువులు తమ వారి మృతదేహాలతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

కొన్ని చోట్ల కట్టెలు పేర్చడంతో సహా దహన సంస్కారాలకు సంబంధించిన ఇతర పనులు మృతుల బంధువులే స్వయంగా చేసుకోవాల్సి వస్తోంది.

ఇప్పుడు దిల్లీలో పార్కుల్లో, కారు పార్కింగ్ ప్రదేశాల్లో, ఖాళీ స్థలాల్లో తాత్కాలిక స్మశానవాటికలను ఏర్పాటు చేస్తున్నారు.

దిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ స్మశానవాటికలో దహన సంస్కారాల కోసం కనీసం 27 కొత్త చితులు ఏర్పాటు చేశారు.

దానికి చుట్టూ ఉన్న పార్క్‌లో 80 చితులు సిద్ధం చేశారు.

మరి కొన్ని తాత్కాలిక స్మశానవాటికలు ఏర్పాటు చేయడం కోసం యమునా నది పక్కన ఖాళీ స్థలాలున్నాయేమోనని మున్సిపల్ అధికారులు పరిశీలిస్తున్నారు.

రోజుకు 22 మందికి మాత్రమే దహన సంస్కారాలు చేయగల సామర్థ్యం ఉన్న ఓ స్మశానంలో రాత్రీపగలూ కూడా మృతదేహాలను దహనం చేస్తున్నామని అక్కడి సిబ్బంది ఒకరు చెప్పారు.

తూర్పు దిల్లీలోని ఘాజియాపుర్ స్మశానవాటిక పార్కింగ్ స్థలంలో కొత్తగా 20 చితులు ఏర్పాటు చేశారు.

"మృతదేహాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కొన్న చితులు పేర్చాల్సి వస్తోంది. బంధువులు మృతదేహాలతో మూడు నాలుగు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కొక్క మృతదేహాన్ని కాల్చడానికి ఆరు గంటలు పడుతోందని" ఒక అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికకు తెలిపారు.

గ్రాఫ్

కొన్ని చోట్ల స్మశాన వాటికలను విస్తరించడానికి కూడా వీలు కావట్లేదని, పరిస్థితి తీవ్రంగా ఉందని సునీల్ కుమార్ అలెడియా బీబీసీతో చెప్పారు.

సునీల్ కుమార్ సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ సమస్థను నడుపుతున్నారు. వీరు కోవిడ్ సమయంలో ఆక్సిజన్, ఆహారం, దహన సంస్కారాలు మొదలైన విషయాల్లో ప్రజలకు సహాయం అందిస్తున్నారు.

స్మశానవాటికలకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సుమారు రెండు కోట్ల జనాభా ఉన్న దిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి.

కనీసం రెండు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

అంబులెన్సుల కొరత అధికంగా ఉంది. బెడ్ దొరికినా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ దొరకట్లేదని కొందరు వాపోతున్నారు. అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు.

సోషల్ మీడియాలో ఆక్సిజన్ కావాలంటూ, బెడ్స్ కావాలంటూ అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.

దిల్లీలో తాత్కాలిక శ్మశానవాటికలను ఏర్పాటు చేస్తున్నారు
ఫొటో క్యాప్షన్, దిల్లీలో తాత్కాలిక శ్మశానవాటికలను ఏర్పాటు చేస్తున్నారు

ప్రపంచ దేశాల సహాయం

ప్రపంచంలో పలు దేశాలు భారతదేశానికి సహాయం అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా, వెంటిలేటర్స్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపిస్తామని హామీ ఇచ్చాయి.

బ్రిటన్ ఇప్పటికే వెంటిలేటర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపడం ప్రారంభించింది.

ఐరోపా సభ్య దేశాలు సాయానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆక్సిజన్ పంపిస్తామని ఫ్రాన్స్ మాటిచ్చింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. ఇండియాకు తమ పూర్తి మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.

ముడి పదార్థాల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని అమెరికా ఎత్తివేస్తోంది. ముడి పదార్థాలు అందితే ఇండియాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ఉత్పత్తి వేగవంతం అవుతుంది.

అలాగే వైద్య పరికరాలను అందించేందుకు కూడా సహాయపడతామని అమెరికా చెప్పింది.

చిన్న దేశమైన భూటాన్ కూడా ఈశాన్య రాష్ట్రం అసోంకు ఆక్సిజన్ సరఫరా అందిస్తామని తెలిపింది.

పక్క దేశమైన పాకిస్తాన్ దిల్లీకి వైద్య పరికరాలను, ఇతర సామగ్రిని అందించేందుకు ముందుకు వచ్చింది.

పాకిస్తాన్‌కు చెందిన ఎధి ఫౌండేషన్ ఇండియాకు 50 అంబులెన్సులు పంపనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)