India vs England: రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం.. ఇషాన్, కోహ్లీ హాఫ్ సెంచరీలు

ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, SURJEET YADAV/GETTY

భారత్- ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు విజయం సాధించింది.

ఈ విజయంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లూ 1-1తో సమంగా నిలిచాయి.

కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్‌ల హాఫ్ సెంచరీలతో భారత్ జట్టు ఇంగ్లండ్ ఇచ్చిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ సున్నా పరుగులకే అవుటైనప్పటికీ రెండో వికెట్‌కు ఇషాన్ కిషన్, కోహ్లీలు పటిష్టమైన భాగస్వామ్యం అందించడంతో భారత్ విజయం అందుకుంది.

ఇషాన్ కిషన్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి 32 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు.

కోహ్లీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 73 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Surjeet Yadav/getty images

ఫొటో క్యాప్షన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ

తడబడుతూ ప్రారంభించి

భారత్ జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగి ఒక్క పరుగు కూడా చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది.

ఓపెనర్ కేఎల్ రాహుల్ 6 బంతులు ఆడి సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. శామ్ కరన్ బౌలింగ్‌లో జాస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ అవుటయ్యాడు.

ఆ తరువాత కోహ్లీ, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. ఇషాన్ 28 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతో బంతుల్లో 50 పరుగులు పూర్తిచేశాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.

అయితే, హాఫ్ సెంచరీ చేసిన కొద్దిసేపటికే రషీద్ వేసిన పదో ఓవర్ చివరి బందికి ఎల్‌బీడబ్ల్యూగా అవుటయ్యాడు.

ఇషాన్ 32 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

అనంతరం 14వ ఓవర్లో రిషబ్ పంత్ క్రిష్ జోర్డాన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. పంత్ 13 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేశాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ ధాటిగా ఆడుతూ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ కలిసి మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. చివరి వరకూ కెప్టెన్‌కు అండగా నిలిచిన అయ్యర్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇషాన్ కిషన్

ఫొటో సోర్స్, TWITTER/@ISHANKISHAN51

ఫొటో క్యాప్షన్, ఓపెనర్ ఇషాన్ కిషన్

మ్యాచ్ సాగిందిలా..

6 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది.

7 ఓవర్లు ముగిసేటప్పటికి భారత్ 67 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో ఇషాన్ రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి.

9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 80 పరుగులు చేసింది.

భారత్ 10వ ఓవర్ ముగిసేటప్పటికి రెండు వికెట్టు కోల్పోయి 94 పరుగులు చేసింది.

15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది.

17 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.

17.5 ఓవర్లలో 166 పరుగులు చేసి విజయం దక్కించుకున్నారు.

కోహ్లీ టీమ్

ఫొటో సోర్స్, Surjeet Yadav/getty images

ఇంగ్లండ్ ఇన్నింగ్స్

అంతకుముందు టాస్ గెలిచిన భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.

భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లోనే బట్లర్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. బట్లర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

దీంతో ఇంగ్లండ్ ఒక పరుగు చేసి మొదటి వికెట్ కోల్పోయింది.

అనంతరం డేవిడ్ మలాన్, జేసన్ రాయ్‌లు క్రీజులో నిలబడ్డారు.

9వ ఓవర్లో యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో మలాన్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మలాన్ 22 బంతులు ఆడి 24 పరుగులు చేశాడు.

11వ ఓవర్లో జేసన్ రాయ్.. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రాయ్ 46 పరుగులు చేశాడు.

18వ ఓవర్లో మోర్గాన్ అవుటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

20వ ఓవర్లో స్టోక్స్.. శార్దూల్ ఠాకూర్ బౌలింగులోనే హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

20 ఓవర్లు ముగిసేటప్పటికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.

వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్

భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

భువనేశ్వర్, యజువేంద్ర చాహల్‌లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌కు భారత్ రెండు మార్పులు చేసింది. సూర్యకుమార్ యాదవ్, ఇషాంత్ కిషన్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.

ఇంగ్లండ్ జట్టులో టామ్ కరన్‌ను ఈ మ్యాచ్‌కు తీసుకున్నారు.

భారత క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Reuters

మొదటి టీ20లో..

ఇంతకుముందు శుక్రవారం జరిగిన మొదటి టీ20లో భారత్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 124 పరుగులే చేయగా, ఇంగ్లండ్ లక్ష్యాన్ని 27 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది.

జట్టులో శ్రేయస్ అయ్యర్(67), రిషబ్ పంత్(21), హార్దిక్ పాండ్య(19) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

ఓపెనర్ కేఎల్.రాహుల్ 1, శిఖర్ ధవన్ 4 పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.

ఇంగ్లండ్ జట్టు

ఫొటో సోర్స్, Reuters

ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా, అదిల్ రషీద్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్, బెన్ స్టోక్స్‌కు ఒక్కో వికెట్ దక్కింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.

ఓపెనర్ జాసన్ రాయ్(49), జాస్ బట్లర్(28) పరుగులు చేసి అవుటవగా, డేవిడ్ మలన్(24), జానీ బెయిర్‌ స్టో(26) జట్టును విజయం వైపు నడిపించారు.

తొలి మ్యాచ్‌లో విజయంతో మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంతో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)