సోనియా గాంధీ: ‘రైతుల విషయంలో కేంద్రం అహంకార ధోరణితో వ్యవహరించింది’ - Newsreel

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Pti

రైతుల విషయంలో ఏమాత్రం దయ లేకుండా వ్యవహరిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శలు చేశారు.

రైతులతో చర్చల సమయంలోనూ అహంకారపూరిత ధోరణితో వ్యవహరించిందని ఆమె ఆరోపించారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆమె.. మూడు వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదించడం ద్వారా ఆ చట్టాల వల్ల రైతులపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది పరిశీలించే అవకాశం లేకుండా చేశారన్నారు.

వ్యవసాయ చట్టాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి స్పష్టమైన విధానంతో ఉందని, ఆహార భద్రతకు మూలాలైన కనీస మద్దతు ధర, ధాన్యం సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థలను నాశనం చేసే ఆ చట్టాలను పార్టీ మొదటి నుంచి తిరస్కరిస్తూ వచ్చిందని ఆమె గుర్తుచేశారు.

వర్చువల్‌గా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలపైనా చర్చిస్తారు. పార్టీ తదుపరి అధ్యక్షులను ఎన్నుకునే విషయంపైనా నిర్ణయం తీసుకుంటారు.

కర్ణాటకలోని శివమొగ్గలో పేలిన ట్రక్కు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కర్ణాటకలోని శివమొగ్గలో పేలిన ట్రక్కు

కర్ణాటక శివమొగ్గ జిల్లాలో భారీ పేలుడు... 8 మంది మృతి

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జిలెటిన్‌ స్టిక్స్‌ లోడుతో ఉన్న ఓ ట్రక్కు పేలిపోయిన ఘటనలో 8మంది మరణించారని జిల్లా కలెక్టర్‌ కేబీ శివకుమార్‌ వెల్లడించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

శివమొగ్గ జిల్లాలోని హుణసోడు అనే గ్రామంలో ఉన్న క్రషింగ్‌ సైట్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. పేలుగు జరిగిన సమయంలో ట్రక్కులో పలువురు కార్మికులు ఉన్నారు.

రాత్రి 10.20 గంటల సమయంలో పేలుడు సంభవించింది. పొరుగున ఉన్న చిక్‌మగళూరు జిల్లా వరకు ఈ శబ్దాలు వినిపించాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మొదట్లో ఈ శబ్దాలు, వాటివల్ల కలిగిన ప్రకంపనలను భూకంపంగా భావించి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చాలా ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి.

ప్రమాద ఘటనపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ట్వీట్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

బగ్ధాద్‌లో పేలుడు జరిగిన ప్రాంతం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, బగ్ధాద్‌లో పేలుడు జరిగిన ప్రాంతం

బగ్దాద్‌ మారణహోమం మా పనే - ఇస్లామిక్‌ స్టేట్‌

ఇరాక్‌ రాజధాని బగ్దాద్‌లో జరిగిన జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్) ప్రకటించింది. గురువారంనాటి ఈ దాడిలో 32 మంది మరణించారు.100మందికి పైగా గాయపడ్డారు.

షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు ఐఎస్‌కు చెందిన న్యూస్‌ ఏజెన్సీ అమాక్‌ తెలిపింది. గురువారంనాడు తైరాన్‌ స్క్వేర్‌లోని ఓ దుస్తుల మార్కెట్‌లో ఆత్మాహుతి దళాలు తమను తాము పేల్చుకున్నాయి. మూడేళ్ల తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా దీనిని చెబుతున్నారు.

మొదటి ఆత్మాహుతి దాడిలో గాయపడిన వారికి సహాయం చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని దుండుగులు రెండో దాడికి పాల్పడ్డారని ఇరాక్‌ హోంశాఖ వెల్లడించింది.

2017లో ఈ ప్రాంతంపై సైన్యం పట్టు పెంచుకున్నాక, ఐఎస్‌ ఆత్మాహుతి దాడులు తగ్గుముఖం పట్టాయి. యుద్దంలో ఓడిపోయినా, ఇరాక్, సిరియాలలో 10వేలమందికి పైగా ఐఎస్ కార్యకర్తలు యాక్టివ్‌గా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

"దేశాన్ని అస్థిరపరిచే ఈ దుష్టుల ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు'' అని ఇరాక్ అధ్యక్షుడు బర్హామ్ సలే అన్నారు.

బగ్దాద్‌లో 2018 జనవరిలో ఇదే ప్రాంతంలో చివరిసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 35 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)