కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన విజయశాంతి - BBC Newsreel

అమిత్ షాను కలిసిన విజయశాంతి

ఫొటో సోర్స్, Ani

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి ఆదివారం నాడు దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.

ఆమె సోమవారం నాడు భారతీయ జనతా పార్టీలో లాంఛనంగా చేరుతారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఇంతకుముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఆమె కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు కూడా కొంత కాలంగా వినిపిస్తున్నాయి.

విజయశాంతి మొదట 1998లో బీజేపీతోనే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు తిరిగి బీజేపీలో చేరబోతున్నారు.

line

కరోనావైరస్ వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి భారత్ అనుమతి కోరిన ఫైజర్

ఫైజర్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

భారత్‌లో తమ కోవిడ్ వ్యాక్సీన్‌ను అత్యవసర స్థితిలో ఉపయోగించడానికి అనుమతి కోరుతూ 'ఫైజర్ ఇండియా' భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్‌కు దరఖాస్తు చేసుకుంది.

బ్రిటన్, బహ్రెయిన్ అనుమతులు పొందిన ఫైజర్ భారత్‌లో కూడా తమ కోవిడ్ వ్యాక్సీన్ అమ్మకాలు, పంపిణీ హక్కులు పొందాలని భావిస్తోంది.

డీసీజీఐకు డిసెంబర్ 4న దరఖాస్తు చేసుకున్న ఫైజర్ అందులో వ్యాక్సీన్ అమ్మకాలను, దిగుమతులను అనుమతించాలని కోరింది. 'ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్' కింద తమ టీకా మందుకు ఆమోదం తెలపాలని అభ్యర్థించింది.

ఫైజర్-బయోఎన్‌టెక్ తయారుచేసిన ఈ కోవిడ్ వ్యాక్సీన్‌కు అనుమతి ఇచ్చిన మొదటి దేశం బ్రిటన్.

కోవిడ్-19 నుంచి ఈ టీకా మందు 95 శాతం రక్షణ అందిస్తుందని, ఉపయోగించడానికి ఇది సురక్షితం అని ఫైజర్ చెబుతోంది. ఈ టీకాను రెండు డోసులుగా వేసుకోవాలి.

ఈ వ్యాక్సీన్ అత్యవసర వినియోగంపైజర్ గ్లోబల్ సంస్థ అమెరికా అనుమతులు కోరిందని చెబుతున్నారు. అయితే, ఈ వ్యాక్సీన్ ఎదుట ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

దీనిని మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయడమన్నది వాటిలో ఒకటి. దీనివల్ల భారత్ లాంటి దేశాల్లో వ్యాక్సీన్ డెలివరీ చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా దేశంలోని చిన్న పట్టణాలు లేదా మారుమూల ప్రాంతాల్లో ఈ మందును అతీశీతల స్థితిలో ఉంచడం అధికారులకు సవాలు కానుంది.

line

అర్జెంటీనాలో పేదలను ఆదుకునేందుకు కోటీశ్వరులపై పన్ను

అర్జెంటీనా కరెన్సీ

ఫొటో సోర్స్, Ricardo Ceppi

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఎదురైన పరిస్థితులను ఎదుర్కునేందుకు లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా ఒక కొత్త ఆస్తి చట్టాన్ని అమలుచేసింది.

ఈ చట్టం ప్రకారం దేశంలోని సంపన్నులపై ఒక ప్రత్యేక పన్ను విధిస్తారు. ఈ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని. కరోనా రోగులకు మందులు, అవసరమైన ఇతర వస్తువులు కొనుగోలుకు ఖర్చు చేస్తారని, సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తామని ప్రభుత్వం చెప్పింది.

'కోటీశ్వరులపై టాక్స్' అనే దీనిని సెనేటర్లు శుక్రవారం ఆమోదించారు. ఈ ప్రత్యేక ఆస్తి పన్ను తీర్మానానికి అనుకూలంగా 42 ఓట్లు, వ్యతిరేకంగా 26 ఓట్లు వచ్చాయి.

కొత్తగా అమలైన చట్టం ప్రకారం ఈ పన్నును ఒకేసారి విధిస్తారు. 20 కోట్ల పెసోల(25 లక్షల డాలర్లు)కు పైగా ఆస్తులు ఉన్న వారు ఈ పన్ను చెల్లించాలి.

దేశంలో ఆ పరిధిలో ఉన్న లక్షాధికారులు సుమారు 12 వేల మంది ఉన్నారు. అర్జెంటీనాలో ఇప్పటిరవకూ 15 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వైరస్ వల్ల 40 వేల మంది చనిపోయారు.

నిరుద్యోగం, పేదరికం, ప్రభుత్వ రుణాలతో ఇప్పటికే కష్టాల్లో పడిన దేశ ఆర్థికవ్యవస్థ కరోనాతో మరింత కుదేలైంది. అర్జెంటీనా 2018 నుంచే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది.

"ఈ కొత్త పన్ను ప్రభావం దేశంలో 0.8 శాతం మంది మీద మాత్రమే ఉంటుంది. దీని పరిధిలోకి వచ్చేవారు దేశంలోని ఆస్తులపై 3.5 శాతం, దేశం బయట ఉన్న ఆస్తులపై 5.25 శాతం టాక్సులు చెల్లించాల్సి ఉంటుంద"ని ఈ చట్టాన్ని సమర్థిస్తున్న ఒక మంత్రి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)