ఒడిశాలో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 11 ఏళ్ల బాలిక – Press Review

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఒడిశాలో 11 ఏళ్ల బాలిక 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ తన తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది. ఈ ఘటన ఒడిశాలోని కేంద్రపర జిల్లాలో జరిగింది.

కేంద్రపర జిల్లాలోని ఓ గ్రామంలో నివాసముంటున్న శుశ్రీ అనే 11 ఏళ్ల బాలిక ఆరవ తరగతి చదువుతోంది. ప్రభుత్వం కరోనా నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి డబ్బును నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి, బియ్యాన్ని కూడా ఇంటికే పంపుతోంది.

శుశ్రీకి కూడా తన బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడేవి. అయితే.. ఆ డబ్బును, తనకు వచ్చే బియ్యాన్ని తండ్రి బలవంతంగా తీసుకుంటున్నాడని శుశ్రీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. శుశ్రీ తల్లి చనిపోవడంతో తన తండ్రి రెండో పెళ్లి చేసుకుని తన బాగోగులు చూసుకోవడం లేదని, కానీ.. బ్యాంకు అకౌంట్లో జమ అవుతున్న డబ్బును మాత్రం బలవంతంగా తీసుకుంటున్నాడని, బియ్యాన్ని కూడా తీసుకువెళ్లి పోతున్నాడని శుశ్రీ ఫిర్యాదులో పేర్కొంది.

డబ్బును అడిగితే తన తండ్రి రమేష్ ఇచ్చే వాడు కాదని, తనకు న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో శుశ్రీ కోరింది. ఆమె ఫిర్యాదును పరిశీలించిన కేంద్రపర కలెక్టర్ సమర్థ్ వర్మ మాట్లాడుతూ.. ఆమె అకౌంట్లో డబ్బును జమ చేయాలని డీఈవోకు ఆదేశాలు పంపినట్లు తెలిపారు.

ఆమె తండ్రి తీసుకున్న ఆ డబ్బును, బియ్యాన్ని కూడా శుశ్రీకి అందేలా చూడాలని డీఈవోను కలెక్టర్ ఆదేశించారు.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించినట్లు ఈనాడు తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక.. షెడ్యూలు ఖరారు చేస్తామని ఈసీ పేర్కొంది. ఆ తర్వాతే ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ మంగళవారం ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలకు నాలుగు వారాల ముందునుంచి కోడ్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం భారత రాజ్యాంగంలోని 243కె, 243 జెడ్‌ఏ అధికరణాల ప్రకారం తప్పనిసరన్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి కాబట్టి, ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అవరోధాలు ఏమీ లేవన్నారు.

కోవిడ్‌-19 పరిస్థితులు ఉన్నా దేశంలో ఎక్కడెక్కడ ఎన్నికలు నిర్వహించినదీ ప్రస్తావించారు. రాష్ట్రంలో కేసులు గణనీయంగా తగ్గాయని, ఒకప్పుడు రోజుకు 10 వేల కేసులకు పైగా నమోదైన పరిస్థితి నుంచి, ఇప్పుడు 2 వేల కంటే తక్కువే వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత, రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తెలుసుకున్నాకే, తగిన కోవిడ్‌ రక్షణ చర్యలు చేపడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టు వెల్లడించారు.

తగిన కొవిడ్‌ రక్షణ చర్యలు చేపడుతూ స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి రమేశ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

ఒకప్పుడు కరోనాకిట్ ధర రూ. 4,000 - ఇప్పుడు రూ. 55

కోవిడ్-19

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ పరీక్షల కిట్‌ల ధరలు చాలావరకు తగ్గాయని సాక్షి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

రాష్ట్ర ప్రభుత్వం రోజూ నిర్ధారణ పరీక్షలకు రూ.5 కోట్లు పైనే ఖర్చు చేసేది. ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలంటే రూ.4 వేలు వ్యయం అయ్యేది. ఒక్క ఆర్టీపీసీఆర్‌ కిట్‌ ధర రూ.1000 ఉండేది. అలాంటిది తాజాగా టెండర్లు పిలవగా కిట్ ధర కేవలం రూ.55కు దిగొచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ వచ్చిన కొత్తల్లో పరిస్థితుల మేరకు భారీగా వ్యయం చేయాల్సి వచ్చింది. అనంతరం లభ్యత పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు టెండర్లకు వెళ్లడం కలిసొచ్చింది.

ఏ రాష్ట్రంలో చేయని విధంగా తరచూ టెండర్లకు వెళ్లడం వల్ల 80 నుంచి 90 శాతం తగ్గిన ధరలతో కొనుగోలు చేస్తున్నారు.

ఆర్టీపీసీఆర్‌ కిట్‌ను రూ.350తో కొనుగోలు చేస్తుండగా, తాజా టెండర్లలో దీని ధర కేవలం రూ.55కు వచ్చింది. దేశ వ్యాప్తంగా పీపీఈ కిట్‌ల నుంచి, ఆర్టీపీసీఆర్‌ కిట్ల వరకూ లభ్యత పెరగడం, తయారీ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా రావడం వల్ల ధరలు తగ్గాయి.

ఒకప్పుడు సాధారణ సర్జికల్‌ మాస్క్‌ను రూ.13 నుంచి రూ.16 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అది రూ.2.50కి పడిపోయింది.

తాజా పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధరను ప్రభుత్వం రూ.1,900 నుంచి రూ.1,000కి తగ్గించింది.

యాడ్స్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం

కేసీఆర్

ఫొటో సోర్స్, FB/TELANGANA CMO

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రకటనలు మరియు ప్రచారాల కోసం అక్షరాల రూ. 300 కోట్లు ఖర్చుపెట్టినట్లు వెలుగు దినపత్రిక వెల్లడించింది.

సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానంగా ఆర్టీఐ ఈ వివరాలు బహిర్గతం చేసింది.

జూన్ 2014 నుంచి అక్టోబర్ 2018 వరకు కేసీఆర్ ప్రభుత్వం హోర్డింగ్స్, పోస్టర్లు, టీవీ ఛానెళ్లు మరియు రేడియోలలో ప్రచారాల కోసం రూ. 300 కోట్లు ఖర్చుచేసినట్లు తేల్చింది.

తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ మొత్తం ఖర్చులను ఆర్టీఐ రెండు విభాగాలుగా విభజించింది. అవుట్ డోర్ మీడియా సంస్థలకు మరియు టెలివిజన్ ఛానెళ్ల కోసం ఖర్చు చేసినట్లు తెలిపింది. అవుట్ డోర్ మీడియా సంస్థల కోసం సుమారు రూ .177 కోట్లు, టీవీ ఛానెళ్ల కోసం రూ .20 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

ఖర్చుల పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 2014-2015 సంవత్సరంతో పోలిస్తే మిగతా సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం చాలా ఎక్కువ ఖర్చు చేసింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తన ఖర్చులను పెంచుకుంటూ వచ్చింది.

మొదటి సంవత్సరంలో తెలంగాణ అవతరణ దినోత్సవం మరియు సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకార వేడుకల కోసం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసింది. అదేవిధంగా బోనాలు మరియు బతుకమ్మ పండుగల కోసం కూడా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది.

సీఎం కేసీఆర్ 2014లో సీఎన్ఎన్-ఐబిఎన్ చేత ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – పాపులర్ ఛాయిస్ అవార్డును అందుకున్నారు. ఆ అవార్డు ప్రదానం సందర్భంగా ప్రచారం కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రచారం కోసం సుమారు రూ .8.5 కోట్లు ఖర్చు చేశారు. మెట్రో పిల్లర్లకు బోర్డులు, మోడల్ బస్ షెల్టర్ హోర్డింగ్స్, ఫ్లైఓవర్లకు బోర్డులు మొదలైనవి ఏర్పాటు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)