‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’లో ఏపీకి ఫస్ట్, యూపీకి సెకండ్ ర్యాంక్ ఎలా వచ్చాయి.. ఒడిశా, పంజాబ్‌ల అభ్యంతరాలేమిటి

వైఎస్ జగన్, యోగి ఆదిత్యనాథ్

ఫొటో సోర్స్, facebook/YSJagan/YogiAdityanath

ఫొటో క్యాప్షన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు తొలిస్థానం, ఉత్తర్‌ప్రదేశ్‌కు రెండో స్థానం వచ్చాయి.
    • రచయిత, శుభమ్ కిశోర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సులభతర వాణిజ్య అవకాశాలను కల్పించడంలో ఏయే రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయో తెలియజేస్తూ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్’ను భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు తొలిస్థానం, ఉత్తర్‌ప్రదేశ్‌కు రెండో స్థానం వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్ ఏకంగా పది స్థానాలు పైకొచ్చింది.

ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం దీన్ని తమ ఘనతగా చెప్పుకొంది కూడా.

అయితే, ఈ ర్యాంకింగ్స్‌ ఇచ్చిన తీరుపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒడిశా, పంజాబ్ ప్రభుత్వాలు ఈ ర్యాంకింగ్స్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాయి.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 5న ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో టాప్-10 రాష్ట్రాలు

1. ఆంధ్రప్రదేశ్

2. ఉత్తర్‌ప్రదేశ్

3. తెలంగాణ

4. మధ్యప్రదేశ్

5. ఝార్ఖండ్

6. ఛత్తీస్‌గఢ్

7. హిమాచల్‌ప్రదేశ్

8. రాజస్థాన్

9. పశ్చిమ బెంగాల్

10. గుజరాత్

యోగి ఆదిత్య నాథ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్

ఉత్తర్‌ప్రదేశ్‌కు రెండో స్థానం ఎలా?

ర్యాంకులకు ఆధారంగా తీసుకున్న విభాగాల్లో ఏయే రాష్ట్రాలు ఎలాంటి ఫలితాలు సాధించాయనేది కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు.

ర్యాంకింగ్స్‌కు సంబంధించి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో బిజినెస్ రీఫార్మ్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా 12 రంగాల్లో చేపట్టాల్సిన 180కిపైగా సంస్కరణల గురించి ప్రస్తావించింది. సింగిల్ విండో సిస్టమ్, కార్మికశక్తి, పర్యావరణం, సమాచార లభ్యత వంటి అంశాలకు సంబంధించిన సంస్కరణలు వీటిలో ఉన్నాయి.

ఈ సంస్కరణలకు సంబంధించి వివిధ రాష్ట్రాలు ఎన్ని మార్కులు పొందాయన్నది కేంద్రం వెల్లడించలేదు.

కేంద్రం సూచించిన 187 సంస్కరణల్లో 186 సంస్కరణలను తాము అమలు చేసినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పేర్కొంది.

సింగిల్ విండో పోర్టల్ ‘నివేశ్ మిత్ర్’ది ఇందులో ప్రముఖ పాత్ర అని, గడిచిన రెండేళ్లలో జారీ చేసిన 2.29 లక్షల వాణిజ్య అనుమతుల్లో 94 శాతం ఈ పోర్టల్ ద్వారానే జారీ అయ్యాయని తెలిపింది.

‘‘రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు జిల్లాలవారీగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్ ఇచ్చుకునే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ పెరిగి, పెట్టుబడులను ఆకర్షించేందుకు అవి మరింత కృషి చేస్తాయి’’ అని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

అయితే, ఈ ర్యాంకింగ్స్‌ను చూసి క్షేత్ర స్థాయిలో గొప్ప మార్పులు వచ్చాయని అనుకోలేమని కొందరు నిపుణులు అంటున్నారు.

‘‘కేంద్ర చేసిన సూచనలను అమలు చేయడమే ఈ ర్యాంకింగ్స్‌కు ఆధారం. వచ్చిన పెట్టుడులు, పారిశ్రామికాభివృద్ధితో దీనికి సంబంధం లేదు. వ్యవహారిక (ప్రాక్టికల్) అంశాల కన్నా సైద్ధాంతిక అంశాలకే ఈ ర్యాకింగ్స్‌ ప్రాధాన్యత ఇస్తుంది’’ అని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక లఖ్‌నవూ బ్యూరో చీఫ్ సిద్ధార్థ్ కలహంస్ అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌పై విదేశీ పెట్టుబడిదారుల అభిప్రాయాలు మారిపోయాయని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు.

ఒడిశాకు 29వ ర్యాంకు వచ్చింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఒడిశాకు 29వ ర్యాంకు వచ్చింది

మిగతా రాష్ట్రాల అభ్యంతరాలు ఇవీ...

ఒడిశా, పంజాబ్ ఈ ర్యాంకింగ్స్ విషయమై ఫిర్యాదు చేస్తామని ప్రకటించాయి.

ఈ జాబితాలో పంజాబ్‌కు 19, ఒడిశాకు 29వ ర్యాంకులు వచ్చాయి.

‘‘2018-19లో నిర్ణీత కాలానికి ఈ ర్యాంకులు ఇచ్చారు. గడిచిన రెండేళ్లలో ఒడిశాలో చాలా మార్పులు వచ్చాయి. 2019 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఆ సమయంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో అవి 18 శాతం. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ రాష్ట్రానికి 200కి పైగా ప్రపోజల్స్ అందాయి’’ అని ఒడిశా పరిశ్రమల శాఖ మంత్రి దిబ్య్ శంకర్ మిశ్ర బీబీసీతో చెప్పారు.

కేంద్రం సూచించిన 187 సంస్కరణల్లో ఒడిశా 180 అమలు చేసిందని ఆయన అన్నారు. తమ కన్నా తక్కువ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు ఇచ్చారని, దీనిపై తాము ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ర్యాంకింగ్స్ గురించి పూర్తి వివరాల కోసం వేచిచూస్తున్నామని, ఆ తర్వాత ఫిర్యాదు చేస్తామని పంజాబ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డైరెక్టర్ సిబిన్ సీ బీబీసీతో అన్నారు.

‘‘పంజాబ్‌కు మెరుగైన ర్యాంక్ వస్తుందని మేం ఆశించాం. రంగాలవారీగా ఏయే రాష్ట్రాలు ఎలా పనిచేశాయన్నది కేంద్రం వెల్లడించాలి. ఎలాంటి పరిశ్రమలూ లేని లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతానికి మా కన్నా మెరుగైన ర్యాంక్ వచ్చింది’’ అని చెప్పారు.

ప్రపంచ బ్యాంక్ కూడా ఇదివరకు వివిధ దేశాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఇచ్చేది. అయితే, సమాచార లోపాలు కనిపిస్తుండటంతో వాటిని ఆ సంస్థ నిలిపివేసింది.

‘‘గత 17 ఏళ్లుగా వివిధ దేశాలకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఇస్తూ వస్తున్నాం. కానీ, 2018, 2020 సంవత్సరాలకు సంబంధించిన సమాచారంలో లోపాలు కనిపించాయి. వాటిలో మార్పుల చేర్పులు నిబంధనలకు అనుగుణంగా లేవు. నిష్పాక్షికత, విశ్వసనీయత విషయంలో మేం రాజీపడలేం’’ అని ఆగస్టు 27న ప్రపంచ్ బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ విషయాన్ని సమీక్షిస్తామని, ఆ తర్వాతే దీనిపై నిర్ణయాలు వెల్లడిస్తామని ఆ సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)