తెలంగాణ: ఆన్‌లైన్ క్లాసులు వినలేకపోతున్నానని, చదువులలో వెనకబడతాననే ఆందోళనతో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ క్లాసులు వినలేకపోతున్నానని, చదువులలో వెనకబడతానన్న ఆందోళనలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మామిడి గూడెంలో ఒక విద్యార్ధిని ఆత్మహత్య చేసుకునట్లు సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
బీఎస్సీ నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్న భవానీ, ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇంటర్నెట్ సిగ్నల్ రావడం లేదని, క్లాసులు వినలేకపోతున్నానని గత కొద్దికాలంగా బాధపడుతోంది.
కిలోమీటర్ దూరం వెళ్లినా సరిగా సిగ్నల్ రాకపోవడంతో క్లాసులు వినలేకపోయింది. దీంతో చదువుల్లో వెనబడతానేమోన్న ఆందోళనలో ఉన్న భవాని గత సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ శనివారంనాడు మరణించినట్లు పోలీసులు చెప్పారని సాక్షి పత్రిక వెల్లడించింది.

కొడుక్కి ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య
కారుణ్య నియామకాల కింద తన భర్త ఉద్యోగం కొడుక్కి వచ్చేలా చేయాలన్న ఉద్దేశంలో ఓ భార్య కొడుకు, కూతురుతో కలిసి భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేసినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది.
మంచిర్యాల జిల్లా పాతబెల్లంపల్లిలో సింగరేణి కార్మికుడు శంకర్‌కు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మనస్పర్ధలతో కొంతకాలంగా భార్య విజయకు, పిల్లలకు శంకర్ దూరంగా ఉంటున్నాడు. కూతురు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను చూడటానికి వచ్చిన శంకర్‌తో భార్య విజయ వాగ్వాదానికి దిగింది. అర్ధరాత్రి శంకర్ నిద్రపోతున్న సమయంలో కూతురు, కొడుకుతో కలిసి భర్త గొంతు నులిమి చంపింది. ఆరోగ్యం బాగా లేక ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు ముగ్గురూ ప్రయత్నం చేశారు. అయితే సింగరేణిలో అమలులో ఉన్న కారుణ్య నియామకాల పథకం కింద భర్త ఉద్యోగం కొడుక్కు వచ్చేలా చేయాలన్న ఉద్దేశంతోనే విజయ ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు గుర్తించారు.

ఫొటో సోర్స్, projecttiger.nic.in
గోదావరి తీరంలో పులి అడుగులు
తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతంలో పులుల జాడను అటవీశాఖ అధికారులు గుర్తించారని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
వరంగల్ అడవుల్లో ఇరవైఏళ్ల తర్వాత మళ్లీ పులి జాడలు కనిపించాయని అధికారులు వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది. భూపాలపల్లి-మహదేవపూర్ అడవుల్లో గత వారం రోజులుగా పెద్ద పులి సంచరిస్తోందన్న సమాచారంతో అధికారులు దాని జాడకనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా ఇక్కడ అటవీ సంపద నాశనం కావడంతో పులులు వలస వెళ్లాయని, ఇప్పుడు మళ్లీ తిరిగి రావడం ఈ అడవుల పూర్వవైభవానికి సంకేతమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో పులులు సంచారం పెరిగిందని, ఇటీవల పశువులపై రెండు పులులు దాడి చేసినట్లు గ్రామస్తులు సమాచారమిచ్చారని అధికారులు పేర్కొంటున్నారు.
పులుల అడుగు జాడలనుబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎటు వెళ్లాయి అన్నదానిపై అధికారులు సమాచారం సేకరించే పనిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మరో 80 రైళ్లకు గ్రీన్ సిగ్నల్
ప్రయాణికులు రైళ్ల పునరుద్ధరణలో భాగంగా మరో 80 రైళ్లలను (40 జతలు) నడిపించాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు ఈనాడు ఒక కథనం ఇచ్చింది. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందిలేదని ఈ కథనం పేర్కొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్‌లకు నాలుగు రైళ్లు ప్రకటిచారు. అలాగే విజయవాడ మీదుగా నాలుగురైళ్లు వెళ్లనున్నాయి. ఇక విశాఖకు రెండు రైళ్లను ప్రకటించారని ఈ కథనం పేర్కొంది. సికింద్రాబాద్, విజయవాడల మీదుగా వెళ్లే రైలు ఒక్కటి కూడా లేదని ఈ కథనం పేర్కొంది.
తమిళనాడుకు ఏకంగా 13రైళ్లను ప్రకటించినట్లు కూడా పేర్కొన్న ఈ కథనం, ఈనెల 12వ తేదీ నుంచి రైళ్లు ప్రారంభమవుతాయని, 10వ తేదీ నుంచి రిజర్వేషన్లు మొదలవుతాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 230 రైళ్లు అందుబాటులో ఉండగా, వాటికి అదనం 80 రైళ్లను జత చేసినట్లు ఈనాడు కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, EPA
అడిగిన వాళ్లందరికీ టెస్ట్
కోవిడ్-19 టెస్టులపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సంస్థ, అడిగిన ప్రతి ఒక్కరికీ టెస్టులు చేయాల్సిందేనని పేర్కొన్నట్లు హిందుస్థాన్ టైమ్స్ పత్రిక రాసింది.
విదేశాలకు వెళ్లేవారికి, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి తప్పని సరిగా టెస్టులు చేయాలన్న ఐసీఎంఆర్, ఈ నిబంధనల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది.
ఇక కంటైన్‌మెంట్ ప్రాంతాలలో నూటికి నూరుశాతంమందికి టెస్టులు చేయాలని ఈ కొత్త మార్గదర్శకాలలో పేర్కొన్నారు. కరోనా నెగెటివ్ రిపోర్ట్ లేదన్న కారణంగా గర్భిణులకు వైద్యాన్ని నిరాకరించవద్దని, లక్షణాలు లేకున్నా ఆపరేషన్లు చేయించుకునే వారికి కచ్చితంగా కోవిడ్ టెస్ట్ నిర్వహించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- మంచుకొండల్లో దారితప్పిన చైనీయులకు ఆక్సిజన్, ఆహారం అందించి బతికించిన ఇండియన్ ఆర్మీ
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- దేశంలో ఇంకెక్కడా లేనంత స్థాయిలో తెలంగాణలో వైద్య సిబ్బంది కరోనావైరస్ బారిన పడుతున్నారెందుకు
- వి సినిమా రివ్యూ: నాని, సుధీర్ బాబులు కలసి హిట్ కొట్టారా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








