వి సినిమా రివ్యూ: నాని, సుధీర్ బాబులు కలసి హిట్ కొట్టారా?

వి సినిమాలో సుధీర్ బాబు, నాని

ఫొటో సోర్స్, vthemovie

    • రచయిత, కె సరిత
    • హోదా, బీబీసీ కోసం

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన 'వి' చిత్రం ఓటిటి ప్లాట్ఫామ్.. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అటు నాని, ఇటు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇద్దరు తమ పంథాను మార్చి క్రైమ్ స్టోరితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ నటుడిగా నానికి, దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణలకు కొత్త కావడం ప్రేక్షకుల తప్పైతే కాదు. వైవిధ్యంగా చూపించలేక పోవడం మూమ్మాటికి సినిమా టీమ్ తప్పే.

ఈ మధ్య థియేటర్లు మూసివేత తరువాత క్వాలిటీ కంటెంట్ టెరాబైట్లలోనే దొరుకుతుండడంతో ఓటిటి సబ్‌స్ర్కిప్షన్లు ఊహాతీతంగా పెరిగిపోయాయి. సగటు ప్రేక్షకుడు కూడా భాష, జోనర్‌తో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లను వెతికి వెతికి చూస్తున్న ఇలాంటి సమయంలో ఇంకా ఒక హీరో హత్యలు చేస్తూ చాలెంజ్‌లు విసురుతుంటే..రెండో హీరో చేజింగులు చేస్తూ పరుగులెత్తే పురాతన ఫార్ములాతోనే సినిమానంతటిని నెట్టుకు రావాలనుకోవడం ఒక పొరపాటైతే... అసలు ఏ మాత్రం కొత్తదనం, ఉత్కంఠత కనబరచకపోవడం రెండో పొరపాటు.

మొదటి సీన్లలో హైదరాబాద్ పాతబస్తీలో మత కల్లోలాలు జరుగుతుంటే అక్కడికెళ్లి 30 మందిని ప్రాణాలతో బయట పడేసినందుకు గానూ డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)ను ప్రభుత్వం'శౌర్య' పతకంతో సత్కరిస్తుంది.

ఆ సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న రాత్రే ఒక పోలీసాఫీసర్ దారుణంగా హత్యకు గురవుతాడు. సదరు హత్య చేసిన వ్యక్తి.. తాను ఇంకో నలుగురిని చంపుతానని..ఆపగలిగితే ఆపామంటూ..ఆదిత్యను సవాలు చేస్తాడు. ఇక కేసును ఛేదించేందుకు ఆదిత్య.. హత్యలు చేస్తూ హంతకుడు.. ఎవరు పని వాళ్ళు చేసుకుంటుంటారు. మూడో హత్య తర్వాత ఈ దారుణాలు చేస్తోంది విష్ణు(నాని) అనే మాజీ సైనిక అధికారి అని ఆదిత్యకు అర్థమవుతుంది. అతడి గురించి వివరాలన్నీ సేకరిస్తాడు. అయితే నిజంగా విష్ణునే హంతకుడా..ఇంకేవరైననా.. వంటి సందేహాలు తీరాలంటే..సినిమా చూసి తీరాల్సిందే.

వి సినిమాలో సుధీర్ బాబు, నాని

ఫొటో సోర్స్, facebook/ActorNaniOfficial

మంచి ఫైట్‍ సీన్‍‌తో కత్తులు తగిలి, చొక్కా చిరిగి..విలన్లను ఎత్తుకు ఎగరేసి కొడుతూ.. సిక్స్ ప్యాక్‍ బాడీతో షో ఆఫ్ చేస్తూ.. టైటిల్స్ యావత్తూ అతన్నో 'సూపర్‍ కాప్‍'గా చూపించే పేపర్‍ కటింగ్స్, మ్యాగజైన్‍ కవర్స్ తో.. సెకెండ్ సీన్‍లోనే మొదటి పరిచయంలోనే హీరోయిన్‍ టపీమని ప్రేమలో పడిపోయే తెలుగు హీరోయిజమంతా సుధీర్‍ ఖాతాలోకే వెళ్ళిపోతే.. ఒక సిగరెట్ రింగురింగుల పొగ మధ్య నుండి ఎంట్రీ ఇచ్చి, మొదటి సీన్ లోనే కర్కషంగా కనపడే నానీని చూడగానే సినిమా మీద అమాంతం అంచనాలు పెరిగిపోతాయి.

కానీ ఆ అభిప్రాయం తప్పనిపించడానికి ఎంతో సమయం పట్టదు. సినిమా మొదలైన అరగంటకే ప్రేక్షకుడు ముగింపును సైతం ఊహించగలుగుతాడు. ఒక రొటీన్‍ వ్యవహారాన్ని ఇంట్రెస్టింగ్‍గా మార్చి తన సత్తా నిరూపించుకోవాలని ఇంద్రగంటికి అనిపించడంలో తప్పు లేదు కానీ దానికి తగ్గ స్టఫ్ లేకపోవడం మాత్రం తప్పే.

హంతకుడు హీరో కాబట్టి తప్పక అతని వెనక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందులో ఏదో విషాదం ఉంటుంది. హత్యలు చేయడమనేది తప్పే కాదని ప్రేక్షకులంతా విలన్నే హీరోగా ఫీలవ్వాలి... ఇంకెంత కాలం ఇదే అరిగిపోయిన పార్ములా? అలా ఏ ఉత్సాహం లేకుండా సాగుతున్న కథలో ప్లాష్ బ్యాక్ అయినా ఆసక్తి రేపుతుందనుకుంటే, అది కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది.

ఎలాంటి పాత్రలోనయినా సునాయాసంగా ఇమిడిపోగల నానిలో కూడా సెటిల్డ్ పెర్ఫామన్స్ కనపడకపోవడం పెద్ద లోపంగా అనిపిస్తుంది. మధ్యమధ్యలో ఫోన్ చేసి ఓ చాలెంజ్ విసిరి పారేసి తన మానాన తానేదో హత్యలు చేసుకుంటూ ఉంటాడు. మర్డర్‍ చేసిన ప్రతిసారి హంతకుడు ఇచ్చే క్లూస్‍, వాటిని డీకోడ్‍ చేసే విధానం థ్రిల్లింగ్‍గా అనిపించకపోగా సిల్లీగా అనిపించి నవ్వొస్తుంటది.

వి సినిమాలో నాని, అదితి రావు హైదరీ

ఫొటో సోర్స్, facebook/ActorNaniOfficial

ఇక సుధీర్‍బాబుకి సగటు తెలుగు సినిమా హీరో పాత్ర శిరోభారాన్ని భుజాలకెత్తుకున్నాడు. లుక్స్ పరంగా ఆకట్టుకున్న నటన పరంగా ఆకట్టుకోలేకపోయాడు. వేసవి కాలం వర్షంలా అక్కడక్కడ పడిన కామెడి సీన్స్ పడకపోయి ఉండే ఇంకాస్త బాగుండేదనిపిస్తుంది. ఎలాగూ హత్యలు చేసేది నానీ కనుక సినిమా క్లైమాక్స్ వరకు ఎలాగూ దొరకడు అనుకుని కథకు అడ్డం పడకుండా చాలా చాకచక్యంగా అంటిముట్టనట్లుగా నటించాడు.

నివేదా థామస్‌లో నటన పరంగా చాలా విషయమున్నప్పటికీ ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయారు. మరో హీరోయిన్ అదితి రావు పాత్రలో నటనకి స్కోప్ ఉన్నప్పటికీ నిడివి చాలా తక్కువ. ఇక నరేష్,తనికెళ్ళ భరణి, రోహిణి లాంటి మంచి నటులను ఎందుకు తీసుకున్నారో అన్న సందేహం కలుగుతుంది.

'వి'లో చెప్పుకోదగ్గ విషయమంటే..'నిర్మాణ విలువలు' మాత్రమే. ఆరంభం నుంచి చివరి దాకా ఒక 'రిచ్' లుక్ కనిపిస్తుంది. టాలెంటెడ్ తారాగణం.. ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమాలో ఒక క్వాలిటీ కనిపిస్తుంది. కానీ ఆ క్వాలిటీ కథాకథనాల్లో లేకపోవడమే ప్రధాన లోపం.

మామూలుగా నాని సినిమా అంటే ఫ్యామిలీస్ ఇష్టపడతారు. కానీ ఇది ఆ రకంగా కూడా ఆకట్టుకోలేదు. నాని పాత్ర ఆ మాత్రమయినా ఎలివేట్‍ అవ్వడంలో కెమెరా పనితనం సహకరించిందని ఒప్పుకోవాలి. తమన్ నేపథ్య సంగీతం పెద్దగా ఆకట్టుకోకపోయినా అమిత్ త్రివేది సంగీతం ప్రశాంతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది.

దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ గతంలో ఎప్పుడూ ఇంతలా నిరాశపరచలేదని చెప్పవచ్చు. బహుశా ఇది తన కంఫర్ట్ జోన్‍ కాకపోవడం వలనో, లేదా బేసిక్‍ ఐడియాతో ఎక్సయిట్‍ అయిపోయి అర్జంట్‍గా దానిని తెరమీదకు తెచ్చేయాలనే ఆరాటంలోనో ఈ చిత్రంలో అటు రచయితగా, ఇటు దర్శకుడిగా రెండు విధాలా పరిపూర్ణమవ్వలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)