రియా చక్రవర్తికి మంచు లక్ష్మి మద్దతు: ‘ఆన్‌లైన్ దాడులు ఆపండి.. నిజాన్ని బతికించండి’

ఫొటో సోర్స్, RHEA CHAKRABORTY TWITTER
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి జీవితాన్ని కొన్ని న్యూస్ చానళ్లు ఈ మధ్య ఒక టీవీ సీరియల్‌లా చూపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు తమకే లోతైన సత్యాలు తెలుసనే విధంగా ఎవరికి తోచిన అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు.
నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత మీడియా దృష్టి రియా చక్రవర్తి వైపు మళ్లింది.
కొన్ని మీడియా ఛానళ్ల ప్రతినిధులు ఆమె ఇంటికి ఫుడ్ పార్సెల్ పట్టుకుని వెళ్లిన వ్యక్తిని కూడా వెంబడించిన వార్తలు ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి. ఇది మీడియా విలువల పతనానికి నిదర్శనమంటూ కొంత మంది ట్వీట్ కూడా చేశారు.
గత వారంలో రియా చక్రవర్తి ఇండియా టుడే ప్రతినిధి రాజదీప్ సర్దేశాయ్‌కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
సోషల్ మీడియాలో రియా చక్రవర్తిని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తూ ఆమెపై చేస్తున్న ఆన్‌లైన్ దాడులను ఖండిస్తూ కొంత మంది సినీ నటులు ఆమెకు మద్దతు పలికారు. చట్టంపై నమ్మకం పెట్టమని విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, INSTAGRAM
“సినీ పరిశ్రమలో ఉన్న నా స్నేహితులంతా స్పందించండి. న్యాయం పేరుతో చేస్తున్న ఈ ఆన్ లైన్ దాడులను ఆపండి. నిజాన్ని బ్రతికించండి” అంటూ రాజదీప్ సర్దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ సినీ నటి లక్ష్మి మంచు ట్వీట్ చేశారు.
"నేను రాజదీప్ సర్దేశాయ్, రియా చక్రవర్తి ఇంటర్వ్యూని పూర్తిగా చూశాను. దీని పై స్పందించాలా వద్దా అని చాలా ఆలోచించాను. చాలా మంది ఈ అంశం పై నిశ్శబ్దంగా ఉండటం చూశాను. మీడియా ఒక అమ్మాయిని రాక్షసిగా చిత్రించేసింది. నాకు నిజం ఏమిటో తెలియదు. నాకు నిజం తెలుసుకోవాలని ఉంది. సుశాంత్ మరణం వెనుక నిజం ఏమిటో నిజాయితీగా బయట పడుతుందని ఆశిస్తున్నాను. నాకు న్యాయ వ్యవస్థ మీద, సుశాంత్ కేసుని విచారణ చేస్తున్న సంస్థల పైన నమ్మకం ఉంది. నిజాలు బయటకు వచ్చేవరకు సత్యమేమిటో తెలియకుండా ఒక వ్యక్తి పట్ల అమానుషంగా, క్రూరంగా ప్రవర్తించడం మాని ఆమె కుటుంబం మొత్తాన్ని బాధపెట్టే పనిని ఆపుదామా? మీడియా చేస్తున్న ఈ పనుల వలన ఆమె కుటుంబం ఎంత వేదనను అనుభవిస్తుందో నేనర్ధం చేసుకోగలను”.
“నాకే ఇలాంటి పరిస్థితి తలెత్తితే కనీసం నాతో పరిచయం ఉన్న సహచరులైనా నాకు మద్దతుగా నిలిచి తనని కొంత సేపు ఒంటరిగా వదిలి పెట్టండి అని చెబుతారని ఆశిస్తున్నాను. నిజం బయట పడే వరకు అలాంటి మద్దతునే మీరంతా కూడా ఆమెకి ఇస్తారని ఆశిస్తున్నాను”.
“మనమంతా ప్రవర్తిస్తున్న తీరు నన్ను చాలా ఆవేదనకు గురి చేసింది. మన మనసులో భావాలను వినిపించేందుకు మనకున్న గళం విప్పకపోతే మనం నిజాయితీగా బ్రతుకుతున్నాం అని ఎలా చెప్పగలం? నేను నా స్నేహితురాలి వెంట నిలుస్తున్నాను” అని లక్ష్మి మంచు ట్వీట్ చేశారు.
లక్ష్మి మంచు ట్వీట్ ని తాపసీ పన్ను రీట్వీట్ చేసి ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“నాకు సుశాంత్ కానీ, రియా కానీ వ్యక్తిగతంగా తెలియదు. న్యాయ వ్యవస్థను ధిక్కరించి ఒక వ్యక్తిని తప్పుగా నిలబెట్టే ప్రయత్నాన్ని అర్ధం చేసుకోవడానికి నేను మనిషిని అయితే చాలని అనుకుంటున్నాను. మీ చిత్త శుద్ధి కోసం కోసం, మరణించిన వ్యక్తి ప్రతిష్ట కోసం ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థను నమ్మండి” అని తాపసి అభ్యర్ధించారు.
ఈ అంశం పై గొంతు విప్పినందుకు భగవంతుడు నిన్ను ఆశీర్వదించాలంటూ లక్ష్మి మంచు ట్వీట్ కి తన కామెంట్ తో విద్య బాలన్ స్పందించారు. “సుశాంత్ మరణం ఒక మీడియా గారడీగా మారడం చాలా దురదృష్టకరమైన విషయం. రియాని నేరస్థురాలిగా చూపిస్తున్న విషయం పై ఒక మహిళగా నా హృదయం బద్దలవుతోంది. నేరం నిరూపితమయ్యే వరకు మనం ఒక వ్యక్తిని నిరపరాధిగా చూడవలసి ఉంటుందని అనుకుంటున్నాను. లేదా నిరపరాధిగా నిరూపితమయ్యేవరకు ఆమె నేరస్థురాలా? ఒక పౌరుడికి రాజ్యాంగ పరంగా ఉన్న హక్కుల పట్ల కాస్త మర్యాద చూపిద్దాం. చట్టాన్ని తన పనిని తనని చేయనిద్దాం”, అంటూ విద్య కామెంట్ చేశారు.
ఈ అంశం పై సినీ నటి స్వర భాస్కర్ ఇతరులు చేసిన ట్వీట్లను రీట్వీట్ చేశారు.
“ఒక మంచి జర్నలిస్ట్ ఇరు వైపుల వాదనలను ఎటువంటి పాక్షికత లేకుండా తెలియచేస్తారు. ఒక ఉత్తమమైన జర్నలిస్ట్ మాత్రం కొన్ని బలమైన మీడియా వర్గాలు తప్పుడు ప్రచారాన్ని, వాదనలను ముందుకు తెస్తున్నప్పటికీ , ఆన్ లైన్ లో మూక దాడులు జరిగినప్పటికీ పాక్షికత లేకుండానే వార్తలను ఇస్తారు,” అంటూ మర్యా షకీల్ అనే జర్నలిస్ట్ ని ట్యాగ్ చేస్తూ రోహిణి సింగ్ అనే మరో జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ని స్వర భాస్కర్ రీట్వీట్ చేశారు.
“రియా సింగ్ బ్లాక్ మ్యాజిక్ చేసి భారతదేశ ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించగలరా, దేశం కోసం అడుగుతున్నాను” అంటూ డేనియల్ స్లొస్ అనే ఫ్రీలాన్స్ రచయిత చేసిన ట్వీట్ ని కూడా స్వర రీట్వీట్ చేశారు.
“ఈ సీరియల్ అప్పుడే అయిపోలేదు. మీడియా కోర్టులో ప్రతి రోజూ కొత్త సమాచారం అందిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసినవారి వ్యాఖ్యలు బయటికి వస్తూనే ఉన్నాయి”, అంటూ సుశాంత్ సింగ్ మరణం పై మీడియాలో జరుగుతున్న విచారణ గురించి బీబీసీ విమెన్ అఫైర్స్ ప్రతినిధి దివ్య ఆర్య తన బ్లాగ్ లో రాశారు.
ఇవి కూడా చదవండి:
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్‌తో కలకలం
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- భారత్ - చైనా ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ స్థానం ఏమిటి? ఎవరి వైపు మొగ్గుతుంది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- టేబుల్ టాప్ రన్‌వే అంటే ఏమిటి.. ఇండియాలో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








