వికీపీడియా భారతీయులను డబ్బులు అడుగుతోంది ఎందుకు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మానవాళికి తెలిసిన విజ్ఞానాన్నంతా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందగలిగే ప్రపంచాన్ని ఊహించండి..’’ ఇదీ వికీపిడియా వ్యవస్థాపకులు జిమ్మీ వేల్స్, వికీపీడియా సంస్థ విరాళాల కోసం పెట్టిన పేజీలో ఉంచిన వాక్యం.
ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయడం, బ్రౌజింగ్ చేయడం తెలిసిన ప్రతి ఒక్కరూ, బహుశా జీవితంలో ఒక్కసారైనా ఒక్క వికీపీడియా పేజీ అయినా చదివి ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే వికీపీడియా వెబ్‌సైట్‌కీ, అందులోని వ్యాసాలకీ అంత ఆదరణ ఉంది.
ఉచితంగా విజ్ఞానం, సమాచారం అందించే వెబ్‌సైట్లలో అతి పెద్దదీ, కీలకమైనదీ వికీపీడియా.
ప్రపంచం మొత్తమ్మీద ఎక్కువ మంది చూసే మొదటి, అంటే ‘టాప్ 10’ వెబ్‌సైట్లలో ఎప్పుడూ వికీపీడియా ఉంటుంది.
ఇంత పేరున్న వికీ ఇప్పుడు పాఠకులను విరాళాలు అడుగుతోంది.
వికీపీడియా సమాచారాన్ని ఉచితంగా అందించే వెబ్‌సైట్. ఎక్కువ మందికి తెలిసిన ఇంటర్నెట్ దిగ్గజాలతో పోల్చినప్పుడు అతి తక్కువ మంది సిబ్బంది, పక్కాగా చెప్పాలంటే నామమాత్రపు సిబ్బందితో, వాలంటీర్లే ప్రధానంగా నడిచే వ్యవస్థ ఇది.
అయినప్పటికీ ఆ సంస్థల నిర్వహణకు చాలా ఖర్చు అవుతుంది. టెక్నాలజీ, మౌలిక వసతులు, సిబ్బంది, సాఫ్ట్‌వేర్ తయారు చేసి, అభివృద్ధి చేసేవారు.. ఇలా చాలా మంది ఉంటారు. అలాగే వివిధ భాషల్లో వికీని విస్తరించడం కోసం కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. దీనంతటికీ ఖర్చు అవుతుంది. అందుకే ఆ ఖర్చుల నిమిత్తం చందాలు అడుగుతోంది వికీ.
‘‘మీకు వికీపీడియా ఈ ఏడాదిలో కనీసం రూ.150 విలువైన విజ్ఞానాన్ని అందించింది అని నమ్మితే, కనీసం 150 రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ చందా ఇవ్వగలరు’’ అంటూ తరచూ వికీ పేజీలపై ఈ మధ్య మెసేజీ వస్తోంది.
‘‘భారతదేశంలో వికీ వాడేవారంతా కనీసం రూ.150 ఇస్తే కొన్నేళ్లకు సరిపడా నిధులు సమకూరుతాయి’’ అని ఆ సంస్థ చెబుతోంది.
వికీపీడియా పేజీ ఓపెన్ చేయగానే, మీకు వీలైనంత వికీపీడియాకు సాయం చేయండి అనే ఈ ప్రకటన కనిపిస్తోంది. భారత్‌లో విరాళాల సేకరణ కోసం వికీ విస్తృత ప్రచారం చేస్తోంది.

ఫొటో సోర్స్, Wikipedia
ఇదీ అభ్యర్థన
‘‘ఇది చిత్రంగా ఉండొచ్చు. కానీ దయచేసి కిందకు స్క్రోల్ చేయకండి. వికీపీడియా స్వతంత్రతను కాపాడాలని మేం ఈ రోజు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మా పాఠకుల్లో 98 శాతం మంది మాకు డబ్బులు ఇవ్వరు. ఒకవేళ మీరు ఇప్పటికే డబ్బులు ఇచ్చి ఉంటే, మీకు కృతజ్ఞతలు. మీరు కనీసం రూ.150 ఇవ్వగలిగితే వికీపీడియా కొన్నేళ్ల పాటూ బతకగలుగుతుంది. వికీపీడియా ఉపయోగకరం కాబట్టి చాలా మంది ఇస్తారు. ఒకవేళ ఏడాది కాలంలో రూ.150 విలువైన జ్ఞానం మీకు వికీ అందించి ఉంటే, ఒక్క నిమిషం ఆగి మాకు చందా ఇవ్వండి. తద్వారా మీకు పక్షపాతంలేని, ఆధారపడగలిగిన సమాచారం ఇవ్వడానికి కృషి చేస్తోన్న వాలంటీర్లకు... వారు చేస్తున్న పని ఉపయోగపడేదే అని చూపించండి. ధన్యవాదాలు’’.
ఇదీ వికీపీడియా విరాళాల కోసం చూపిస్తోన్న ప్రకటన.
ఈ పేరా మొదట్లో ఆక్వర్డ్ గా ఉండొచ్చు అనే పదాన్ని వికీపీడియా వాడింది. ఆక్వర్డ్ అంటే వికారం, మొరటు ఇలా చాలా అర్థాలు ఉన్నాయి.
అయితే, వికీపీడియా విరాళాలు అడిగిన విధానం చూసిన వారికి అది చిత్రంగా అనిపించదు. ఎందుకంటే వారు విరాళాల కోసం అడిగిన భాష అలానే ఉంది.
విరాళాల కోసం పంపే మెయిల్ కూడా ఎంతో గంభీరంగా, ఇదే చివరి మెయిల్ ఇక మళ్లీ మళ్లీ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టం అనే తరహాలో ఉంది వారి భాష.
‘‘ఇది వాణిజ్య (కమర్షియల్) సైట్ కాదు. లాభాల కోసం, ప్రకటనల కోసం వికీ పనిచేయదు. ఇది ప్రజలు ఇచ్చే చందాల ద్వారా నడచే స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ, వారు ఏ మూలన ఉన్నా ఉచితంగా విజ్ఞానం అందాలన్నదే వికీ తాపత్రయం’’ అని అన్నారు వికీమీడియా పేమెంట్స్, ఆపరేషన్స్ డైరెక్టర్ పాట్స్ పేనా.
నిజానికి వికీపీడియా ఒక స్వచ్ఛంద సంస్థ అనీ, వారికి ప్రజలు ఇచ్చే చందాలు అవసరం అనీ చాలా మందికి తెలియదు. అందుకే కనీసం రూ.150 రూపాయిలైనా ఇవ్వండని వికీపీడియా అడగ్గానే అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై చర్చ జరిగింది. ‘‘ఇలానేనా చందా అడిగేది’’ అంటూ కొందరు ప్రశ్నించారు కూడా. ఇంకొందరు తాము ఎంత విరాళం ఇచ్చిందీ ప్రకటించారు. ప్రశ్నలను వికీపీడియా ముందే ఊహించినట్లుంది, అందుకే తమ ప్రకటన ప్రారంభంలోనే ఆక్వర్డ్ అనే మాట రాసింది.

ఫొటో సోర్స్, REUTERS
ఎలా పని చేస్తుందంటే...
2001లో అమెరికాకు చెందిన జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ వికీపీడియాను ప్రారంభించారు. వికీమీడియా ఫౌండేషన్ అనే సంస్థ ఆధ్వర్యంలో వికీపీడియా పనిచేస్తుంది. ఈ సంస్థ కింద వికీపీడియానే కాకుండా ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.
నెలకు 1500 కోట్ల సార్లు జనాలు వికీ పేజీలను చదువుతారు. 2010 నుంచి ఇప్పటి వరకూ వివిధ ప్రాజెక్టులపై (వికీపీడియా కాకుండా) 20 లక్షల డాలర్లు ఖర్చు చేసింది ఈ సంస్థ.
వికీపీడియా సంస్థలో సిబ్బంది ఎవరూ వ్యాసాలు రాయరు. వారు కేవలం సపోర్ట్ ఇస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఆ వ్యాసాలు రాస్తారు లేదా అనువాదం చేస్తారు. ఈ వ్యాసాలను ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. కానీ వాటికి సాక్ష్యాధారాలు ఉండాలి. ఆ సాక్ష్యాలను లింకుల రూపంలో కింద ఇస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 2 లక్షల 50 వేల మంది వాలంటీర్లు వికీపీడియా పేజీలు సమగ్రంగా, తప్పులు లేకుండా ఉండేలా చూస్తున్నారు. ప్రస్తుతం వికీలో 300 భాషల్లో 5 కోట్ల వ్యాసాలు ఉన్నాయి.
భారతదేశంలో వికీపీడియా పేజీలను జనం నెలకు 7.5 కోట్ల సార్లు చదువుతారు. అత్యధికంగా వికీ చదివే వారిలో ఐదో స్థానం భారతదేశానిది.
23 భారతీయ భాషల్లో వికీ అందుబాటులో ఉండగా, ఎందరో భారతీయులు వాలంటీర్లుగా ఆ వ్యాసాలు సమకూర్చుతున్నారు. ఈ మధ్యే సంథాలీ భాషలో కూడా వికీపీడియా ప్రారంభమైంది.
‘‘కచ్చితమైన, సాక్ష్యాలు ఉన్న, పక్షపాతం లేని, సమగ్రంగా ఉన్న సమాచారం ఇవ్వడానికి, అవి చక్కగా కూర్చే వాలంటీర్ల వ్యవస్థతో పనిచేయడానికీ, కొందరు కావాలని పెట్టే తప్పుడు సమాచారం తొలగించడానికి వికీ పనిచేస్తుంది.’’ అని ఆ సంస్థ చెబుతోంది.
తమను గుడ్డిగా నమ్మవద్దనీ, ఏదైనా సమచారాన్ని విశ్లేషించేటప్పుడు, ఆ సమాచారం వచ్చిన సోర్స్, (వికీ పేజీలో కింద ఉండే లింక్స్) పరిశీలించాలని సలహా ఇస్తుంది వికీ. తమ సైట్లోని సమాచారాన్ని ఎంత వరకూ నమ్మొచ్చు? అంటూ ఒక వ్యాసమే ప్రచురించింది వికీ.
‘‘వికీపీడియా వ్యాసాల్లో కచ్చితత్వం కోసం ఎంతకైనా వెళ్తుంది. టర్కీ దేశంలో ఒక వ్యాసం విషయమై ఆ ప్రభుత్వం వికీపీడియాపై ఒత్తిడి తెచ్చింది. బెదిరించింది. ఆ వ్యాసం నిబంధనలను అతిక్రమించలేదని, తొలగించలేమని వికీ స్పష్టం చేసింది. దీంతో టర్కీ వికీని నిషేధించింది. దాదాపు మూడేళ్ల తరువాత ఇటీవలే టర్కీలో వికీపీడియా ప్రారంభమైంది. మూడేళ్ల నిషేధంపై వికీపీడియా కోర్టుల్లో పోరాడిందే తప్ప, ఒక్క వ్యాసమే కదా అని ప్రభుత్వానికి అనుకూలంగా దాన్ని మార్చలేదు’’ అంటూ వికీ పద్ధతులను వివరించారు పవన్ సంతోష్.
వికీపీడియా తెలుగు నిర్వాహకుల్లో ఒకరిగా ఉన్న ఆయన, గతంలో కొన్ని వికీ ప్రాజెక్టులపై పనిచేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘‘వెబ్‌సైట్లు చురుగ్గా పనిచేయడం కోసం వారు అత్యాధునిక టెక్నాలజీ వాడతారు. ఈ విషయంలో వారు కమర్షియల్ వెబ్‌సైట్లతో పోటీ పడతారు. కోట్ల మంది నిత్యం సందర్శించే, లక్షల మంది నిత్యం ఎడిట్ చేసే వెబ్‌సైట్ కావడంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు వికీకి అవసరం. నిమిషానికి సుమారు 350 ఎడిటింగ్‌లు జరుగుతాయి వికీలో. అలాగే సెకనుకు 6,700 మంది వికీ పేజీలు ఓపెన్ చేస్తారు. ఇదంతా సులువుగా జరగడానికి ఎంతో ఖర్చుతో కూడిన టెక్నాలజీ అవసరం. సాధారణంగా చాలా ప్రముఖ వెబ్‌సైట్లు కూడా 50 నుంచి 100 భాషల్లోనే వస్తాయి. కానీ, వికీ మాత్రం 300 భాషల్లో వస్తుంది. ప్రతీ ఏటా వికీ అందుబాటులోకి వచ్చే భాషల సంఖ్య పెరుగుతోంది’’ అన్నారు పాట్స్.
వికీపీడియా ఎప్పుడూ తనకు వ్యాసాలు అందించే వారి సంఖ్య (కమ్యూనిటీ) పెంచుకునేలా ప్రయత్నిస్తుంది. రాసే వారి సంఖ్య పెంచడం, ఆ వ్యాసాల్లో నాణ్యత పెంచడం, వ్యాసాలు పెంచడం – ఈ మూడూ వికీ నిరంతరం చేస్తోంది.
‘‘వాళ్ల ప్రాజెక్టుల్లో ఎక్కడైనా కొందరు వ్యక్తుల వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. కానీ స్థూలంగా కచ్చితత్వం కోసం వికీ ప్రయత్నిస్తూనే ఉంటుంది. కొందరు కావాలనే వ్యాసాలు సృష్టిస్తారు. వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తారు వాలంటీర్లు. వ్యాసాల్లో పక్షపాతం లేకుండా వికీ ప్రయత్నిస్తూనే ఉంటుంది’’ అన్నారు పవన్.
వికీపీడియాలో ఇంజినీరింగ్ బృందంలో 250 మంది పనిచేస్తారు. నిజానికి ప్రపంచంలో టాప్ వెబ్‌సైట్ల బృందాల్లో ఉండేవారి సంఖ్యతో, పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువ. ఓ రకంగా చెప్పాలంటే 40 లక్షల పాఠకులకు వికీలో ఒక ఉద్యోగి ఉన్నారు.
ప్రపంచంలోని టాప్ టెన్ సైట్లలో వ్యాపారం చేయకుండా, లాభార్జన లేని స్వచ్ఛంద సంస్థ ఇదొక్కటే.
చదివే వారి ప్రైవసీ ఉల్లంఘించకూడదన్న కారణంగా సరిగ్గా ఎంత మంది చదువుతారు (యూనిక్ విజిటర్స్) అన్న సంఖ్యను కూడా లెక్కించదు వికీ.

ఫొటో సోర్స్, Wikipedia
ఏటా అడుగుతుంది. కానీ, ఈసారి...
వికీపీడియా ఏటా విరాళాలు అడుగుతుంది. ఏటా తమ ఆదాయ వ్యయాల ఖర్చులను వెల్లడిస్తూ ఉంటుంది. వీటి ఎవరైనా చూడవచ్చు.
కానీ ఈసారి భారతదేశంలో విరాళాల సేకరణకు వికీ ప్రత్యేకంగా ప్రచారం చేస్తోంది.
నిజానికి వికీమీడియా ఫౌండేషన్ ఆదాయ వ్యయ పట్టిక చూస్తే ఇది పేద సంస్థా అనే అనుమానమూ వస్తుంది. ఎందుకంటే, ఆ సంస్థ తమ ప్రాజెక్టుల కోసం వివిధ దేశాల్లో ఖర్చు చేస్తోన్న సొమ్ము కోట్లలోనే ఉంటుంది.
2019లో 30 దేశాలకు చెందిన 70 లక్షల మంది వికీకి విరాళాలు ఇచ్చారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థలు, వాటి ఉద్యోగులు కూడా వికీకి విరాళాలు ఇస్తారు. వాటిలో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ మాచింగ్ గిఫ్ట్ స్కీములు కూడా ఉన్నాయి.
‘‘అది చూసే చాలా మంది వికీ దగ్గర చాలా డబ్బుంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. నిధులు వస్తాయి. వాటికి తగ్గట్టే ఖర్చులుంటాయి. వాళ్లు యాడ్స్ తీసుకోరు. ఎవర్నీ ప్రమోట్ చేయరు. దీంతో చందాలే ఆధారం. సమాచారాన్ని అన్ని భాషల్లో ఉంచడానికీ, టెక్నాలజీకీ చాలా ఖర్చవుతుంది’’ అని అన్నారు పవన్.
‘‘స్వచ్ఛందంగా పనిచేసే మొజిల్లా వంటి సంస్థలతో పోల్చితే, వికీ దగ్గర కాస్త ఎక్కువ డబ్బు ఉండవచ్చు. కానీ వారు చేసే పనితో పోలిస్తే, అది అసలు లెక్కే కాదు. ఉదాహరణకు తెలుగే తీసుకోండి.. గూగుల్ ఫర్ తెలుగు అంటూ గూగుల్ సంస్థ 2018లో ఒక ప్రాజెక్టు ప్రారంభించింది. కానీ, వికీపీడియా 2004లోనే తెలుగు పేజీలను ప్రారంభించింది’’ అని పవన్ వివరించారు.
‘‘వికీపీడియా, వికీమీడియా మీ కోసమే తయారయ్యాయి. మీరంతా వికీపీడియాను చరిత్ర, సంస్కృతి, సైన్సు వంటివి నేర్చుకోవడానికి ఉపయోగించండి. ఎవరికైతే సాయం చేయగల స్తోమత ఉందో, వారిచ్చే దానం వికీ నిలబడానికి ఉపయోగపడుతుంది. మీరిచ్చే డబ్బు ద్వారా ఉచిత విజ్ఞాన ఉద్యమం ముందుకు వెళ్తుంది. అందరూ డబ్బు ఇవ్వలేరని మాకు తెలుసు. అసలు డబ్బు కట్టలేకుండా చదువుకోవాలనుకునే వారి కోసమే వికీ పుట్టింది. మా పని విలువైనదేనని మీకనిపిస్తే సాయం చేయండి’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది వికీ.
విరాళాలు కాకుండా వికీపీడియా పేరిట టీ షర్టులూ, పెన్నులూ, పెన్సిళ్లూ, మగ్‌లూ, బ్యాడ్జ్‌ల వంటివి కూడా అమ్ముతూ ఆ సంస్థ ఆదాయం పొందుతోంది. కానీ, వాటి వల్ల వచ్చే ఆదాయం... వికీకి వచ్చే విరాళాల్లో, ఖర్చుల్లో ఒక్క శాతం కూడా ఉండదు. ఇది నామమాత్రమే.
ఇవి కూడా చదవండి:
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- పాకిస్తాన్‌కు భారత్ కంటే ఒక రోజు ముందే స్వాతంత్ర్యం వచ్చిందా? అసలు నిజం ఏంటి?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- కరోనావైరస్: తెలంగాణ, బీహార్, గుజరాత్, యూపీలలో టెస్టులు పెంచాలి - ముఖ్యమంత్రుల సదస్సులో మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
- కమలా హ్యారిస్ ఎవరు? జో బిడన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు?
- ఇండియా, ఇరాక్, బ్రిటన్, ఆస్ట్రేలియా.. అన్ని చోట్లా అమ్మోనియం నైట్రేట్ టెన్షన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








