తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగాలు నేరుగా డీట్ ద్వారా భర్తీ... ప్రణాళిక ఇదీ

తెలంగాణ డీట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించింది. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్(www.tsdeet.com) అనే వెబ్‌సైట్ సహకారంతో ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటోంది.

ఫిబ్రవరి నెలాఖరు వరకు 8,07,000 మంది నిరుద్యోగులుగా తెలంగాణ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదు చేసుకున్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 7,25,898 ఉందని కార్మిక ఉపాధి కల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ నీరజా రెడ్డి బీబీసీకి తెలిపారు.

ఈ సంఖ్య ఆధారంగా నిరుదోగ్యుల సంఖ్య తగ్గిందని తేల్చలేమని వివరించారు నీరజా రెడ్డి. "కరోనావైరస్ కారణంగా చాలా మంది తమ కార్డులను పునరుద్ధరించి ఉండరు. నిరుద్యోగుల సంఖ్యపై సమగ్ర విశ్లేషణ చేసేందుకు సమయం పట్టొచ్చు" అని ఆమె చెప్పారు.

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన నిరుద్యోగులకు డీట్ సాయంతో ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని వారికి అందిస్తున్నారు. దీనిపై ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్ డైరెక్టర్ కె.వై.నాయక్ బీబీసీ తెలుగుతో మాట్లాడారు.

"ఇదివరకు ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో ఉద్యోగ మేళాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడు డీట్ సాయంతో ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేస్తున్నాము" అని ఆయన తెలిపారు.

ఉద్యోగాలు

ఫొటో సోర్స్, Getty Images

డీట్ వెబ్‌సైట్ రూపకల్పన చేసిన సంస్థ వర్క్‌రూట్ సీఈఓ మనికాంత్ చల్లా బీబీసీ తెలుగుతో మాట్లాడారు. తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా వెబ్‌సైట్ రూపొందించామని తెలిపారు. "ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు దీనిలో నమోదు చేసుకోవచ్చు. విద్యా అర్హతలపై పరిమితేమీ లేదు. ఆన్‌లైన్‌‌లో ఫార్మ్ పూరించి నమోదు చేసుకోవాలి" అని ఆయన వివరించారు.

స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అండర్ స్కిల్డ్‌తో పాటు నిరుద్యోగం, తగిన ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం ఉండి వేరే అవకాశాల కోసం చూస్తున్న వారు... అభ్యర్థులను ఇలా ఆరు కేటగిరీలుగా విభజించారు.

ఆ మేరకు ఒక్కో కేటగిరీలోని ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి వారికి నోటిఫికేషన్ ద్వారా ఆ ఉద్యోగ అవకాశం గురించి సమాచారం అందిస్తారు. నేరుగా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.

నిరుద్యోగం

ఫొటో సోర్స్, Getty Images

డీట్ యాప్‌ కూడా అందుబాటులో

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో ఇప్పటివరకు జాబ్ మేళా నిర్వహించేవారు. కానీ కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆన్‌లైన్‌ పద్ధతిలో డీట్ సహాయంతో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను భర్తీ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ తగిన చర్యలు తీసుకోంటుదని కే వై నాయక్ తెలిపారు. డీట్ యాప్ కూడా అందుబాటులో ఉందని ఆయన వివరించారు.

గత సంవత్సరం జులైలో ప్రవేశపెట్టిన డీట్ ద్వారా ఇప్పటికే ప్రైవేటు రంగంలో మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ జరిగాయని మనికాంత్ చల్లా తెలిపారు.

"లక్షకు పైగా ప్రైవేటు రంగ సంస్థలు డీట్‌లో నమోదయ్యాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గాయి. కానీ మే నెల నుంచి మళ్లీ పెరిగాయి. అయితే గత మూడు నెలల్లో ఉద్యోగాల ఖాళీలు ప్రకటించే సంస్థల కంటే ఉద్యోగం కోసం వెతికే వారి సంఖ్య పెరిగింది. కొన్ని రంగాల్లో ఇంకా పూర్తి స్థాయిలో పనులు మొదలవ్వలేదు.. అందుకే ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈ రంగంలో ఉద్యోగ భర్తీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మార్కెటింగ్, భద్రత, లాజిస్టిక్స్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి"అని మనికాంత్ చల్లా వివరించారు.

అయితే ఇంగ్లిష్ రాని వారు ఈ వెబ్‌సైట్ ఎలా వాడుతారు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రాంతీయ భాషలో కూడా దీన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాము అంటున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)