ప్రపంచ పులుల దినోత్సవం: పులులను ఎలా లెక్కిస్తారో తెలుసా

ఫొటో సోర్స్, AP Forest Department
అభయారణ్యాల్లో పులులను ఎలా లెక్కిస్తారు? వయసును ఎలా నిర్ధరిస్తారు? ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడతారు? నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా?
జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ- ఎన్‌టీసీఏ) దేశవ్యాప్తంగా పులులను లెక్కిస్తుంది.
16 పెద్దపులి ఆవాస రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోని అన్ని అడవుల్లో నాలుగేళ్లకోసారి ఈ గణన జరుగుతుంది.
పులులతోపాటు ఇతర వన్యప్రాణులను కూడా లెక్కిస్తారు.

ఫొటో సోర్స్, AP Forest Department
లెక్కింపు విధానం
వన్యప్రాణుల గణాంక సేకరణ దేశంలోని అన్ని అటవీ ప్రాంతాల్లో జరుగుతుంది. అటవీ సిబ్బంది రోజూ సుమారు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి, పులులతోపాటు ఇతర వన్యప్రాణుల ఆధారాలను అన్వేషిస్తారు.
ఐదు పద్ధతుల్లో వీటి గణాంకాలను సేకరిస్తారు.
అటవీ సిబ్బంది నడక మార్గంలో వన్యప్రాణులు కనిపిస్తే, వెంటనే వాటి గుర్తులతో పాటు ఏ ప్రదేశంలో ఎంత సమయానికి కనిపించాయనే వివరాలను నమోదు చేసుకుంటారు.

ఫొటో సోర్స్, DL Narasimha
పగ్ మార్క్ విధానంలో అయితే సిబ్బంది అడవిలో నడుచుకుంటూ పులుల పాదముద్రలను గుర్తిస్తారు.
మెుదట ఒక గాజుపలకపై స్కెచ్ పెన్‌తో పాదముద్ర ఆకారాన్ని గీస్తారు. తర్వాత గాజుపలకపై తెల్లటి కాగితాన్ని ఉంచి ఆకారాన్ని దానిపై పడేలా చూస్తారు.
నేలపై పాదముద్ర చుట్టూ ఓ రింగ్‌ను ఏర్పాటు చేసి పాదముద్రపై చాక్ పౌడర్ చల్లుతారు. తర్వాత రింగ్ అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిశ్రమాన్ని వేస్తారు. 15 నిమిషాల తర్వాత ఆ మిశ్రమం గడ్డ కట్టి పాదముద్ర అచ్చులా ఏర్పడుతుంది.
పాదముద్రలు ఏ ప్రాంతంలో, ఏ సమయంలో గుర్తించినదీ నమోదు చేసుకుంటారు. పాదముద్ర ఎన్ని సెంటీమీటర్ల మేర ఉందనే దాన్ని బట్టి పులి వయసును నిర్ణయిస్తారు.

ఫొటో సోర్స్, DL Narasimha
అడవుల్లో కనిపించే పులుల మలాన్ని సేకరించి, సిలికాన్ జెల్ ఉన్న డబ్బాలో పెట్టి హైదరాబాద్‌లోని 'సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)'కి పంపుతారు. అక్కడ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి పులుల సంఖ్యతోపాటు వాటి ఆరోగ్య పరిస్థితిని గుర్తిస్తారు.
వెంట్రుకలు, గోళ్లకు పరీక్షలు
అడవి జంతువులు చెట్లకు, రాళ్లకు పాదాలను, శరీరాన్ని రుద్దుతుంటాయి.
గోళ్లు పెరిగినప్పుడు వాటిని తగ్గించుకునేందుకు, శరీరంపై దురదను పోగొట్టుకునేందుకు ఇలా చేస్తుంటాయి. అప్పుడు వాటి వెంట్రుకలు, గోళ్లు ఊడి పడిపోతుంటాయి.
అటవీ సిబ్బంది చెట్లు, రాళ్లపై పడ్డ గాట్లను పరిశీలించి అక్కడ సంచరించిన జంతువు ఏదో గుర్తించగలుగుతారు. సేకరించిన వెంట్రుకలు, గోళ్లకు డీఎన్ఏ పరీక్ష చేసి ఆ జంతువు ఏదన్నది నిర్ధరిస్తారు.
అత్యాధునిక కెమెరాల వినియోగం
2014 నుంచి ఎన్‌టీసీఏ వన్యప్రాణుల లెక్కింపులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలను వాడుతోంది.
వీటిని వన్యప్రాణులు తిరిగే ప్రదేశాల్లో ఎదురెదురుగా చెట్లకు అమరుస్తారు. ఒకటి నుంచి రెండు అడుగుల ఎత్తులో ఉంచే ఈ కెమెరాలు 24 గంటలూ వాటంతటవే పనిచేస్తాయి.
చీకట్లో అయితే ఫ్లాష్ ఉపయోగించి ఫొటోలు తీస్తాయి.

ఫొటో సోర్స్, Andhra Pradesh Forest Department
జంతువుల కదలికలు, ఉష్ణోగ్రతల ఆధారంగా కెమెరాలు పని ప్రారంభిస్తాయి. వీటిలో నమోదైన సమాచారాన్ని రోజూ సేకరిస్తారు.
చిత్రాల్లోని జంతువుల ఎత్తు, చారలు, నడకను పరిగణనలోకి తీసుకొని వాటి సంఖ్యను లెక్కగడతారు.
ఇలా వివిధ పద్ధతుల్లో సేకరించిన ఆధారాలను, నివేదికలను ఎన్‌టీసీఏ అధికారులు ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌లో ఉన్న భారత వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ)కు పంపుతారు.
డబ్ల్యూఐఐ అందించే నివేదిక ఆధారంగా ఎన్‌టీసీఏ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపుతుంది. ఆ శాఖ దీనిని పార్లమెంటుకు సమర్పిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దేశవ్యాప్తంగా పులుల సంఖ్యలో పెరుగుదల
భారత్‌లో పన్నెండేళ్లలో పులుల సంఖ్య రెట్టింపైంది. 2006లో 1,411గా ఉన్న వీటి సంఖ్య 2018లో 2,967కు చేరింది.
2010లో 1,706గా ఉన్న పులుల సంఖ్య 2014 నాటికి 2,226కు చేరింది. గత నాలుగేళ్లలో ఇది 700కి పైగా పెరిగింది.
దేశంలో ఇప్పుడు సుమారు మూడు వేల పులులు ఉన్నాయని, పులులకు అతిపెద్ద, సురక్షిత నివాస ప్రాంతాల్లో భారత్ ఒకటని గత ఏడాది అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రపంచంలోని మొత్తం పులుల్లో దాదాపు 75 శాతం ఒక్క భారత్‌లోనే ఉన్నాయన్నారు.
పులుల సంఖ్య రెట్టింపు కావడం భారత్‌కు చరిత్రాత్మక విజయమని, పులుల సంరక్షణ పట్ల భారత్ అంకితభావాన్ని ఇది చాటుతోందని మోదీ చెప్పారు. పులుల సంఖ్యను 2022లోగా రెట్టింపు చేయాలని తొమ్మిదేళ్ల క్రితం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో లక్ష్యంగా నిర్ణయించారని, కానీ భారత్ నాలుగేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని అందుకుందని ఆయన ట్విటర్‌లో తెలిపారు.
ఏపీ, తెలంగాణల్లోనూ పెరిగిన పులులు
2006లో ఏర్పాటైన ఎన్‌టీసీఏ ఇప్పటికి నాలుగు సార్లు దేశవ్యాప్తంగా వన్యప్రాణుల గణన నిర్వహించింది.
2014లో అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్‌లో పులుల సంఖ్య 68 కాగా, 2018 నాటికి ఏపీ, తెలంగాణల్లో కలిపి వీటి సంఖ్య 74కు చేరింది. ఏపీలో 48, తెలంగాణలో 26 పులులు ఉన్నాయి.

ఫొటో సోర్స్, AP Forest Department
నాగార్జునసాగర్-శ్రీశైలం అభయారణ్యంలో పరిస్థితి?
దేశంలోని అతిపెద్ద అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యంలో 2006లో 95 పులులు ఉండేవి. 2010లో వీటి సంఖ్య 72కు, 2014 నాటికి 68కి తగ్గింది. అయితే, 2018 లెక్కల్లో ఈ సంఖ్య పెరిగింది.
2009లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో అత్యధిక ప్రాంతం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చింది. గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం కూడా ఇందులో విలీనమైంది.
ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలో నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.
నల్లమలలోని గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యంలోని 1,193.68 చదరపు కిలోమీటర్లు విలీనం కావడంవల్ల 2,444.14 చ.కి.మీ. కోర్ ఏరియా, 1,283.36 చ.కి.మీ. బఫర్ ఏరియా కలిపి నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తీర్ణం 3,727.5 చదరపు కిలోమీటర్లకు చేరింది.
పులులు నివాసం ఉండే ప్రధాన ప్రాంతాన్ని కోర్ ఏరియా అని, సంచరించే అవకాశమున్న ప్రాంతాన్ని బఫర్ ఏరియా అని వ్యవహరిస్తారు.
ఇక తెలంగాణలో పెద్ద పులులు 20కి పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కవ్వాల్, ఆమ్రాబాద్ రెండు అభయారణ్యాలున్నాయి.
ఆమ్రాబాద్ టైగర్ ప్రాజెక్ట్ నల్లమలలోనే ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన తరువాత అది తెలంగాణలో భాగమైంది.
'పులుల పునరుత్పత్తికి అనుకూలంగా నల్లమల'
2014 తర్వాత నుంచి పులుల పునరుత్పత్తికి నల్లమలలో అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఫలితంగా పులుల సంఖ్య పెరుగుతోందని నంద్యాల ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
నల్లమల ప్రాంతంలోని నంద్యాల, ఆత్మకూరు, మార్కాపురం డివిజన్ల పరిధిలో వంద బేస్ క్యాంపులు ఉన్నాయని, అక్కడ రాత్రింబవళ్లు అటవీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని, వేటగాళ్ల నుంచి పులులకు రక్షణ దొరుకుతోందని చెప్పారు.
గుండ్లబ్రహ్మేశ్వర అభయారణ్యం కేంద్రంగా పులులు రుద్రవరం, అహోబిలం మీదుగా కడప జిల్లాలోని శేషాచలం కొండలైన ప్రొద్దుటూరు, సిద్దవటం వరకు పులుల సంతతి పెరుగుతోందంటున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
గిన్నిస్ రికార్డులకు ఎక్కిన భారత పులుల గణన
భారత్‌లో పులుల లెక్కింపు విధానం కొత్త గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. కెమెరాల సహాయంతో వన్యప్రాణి గణన ఇంత పెద్ద ఎత్తున ఇంకెక్కడా లేకపోవడంతో 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'కు ఎక్కింది.
దీంతో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఇదో గొప్ప సందర్భమని.. ఆత్మనిర్భర భారత్‌కు సరైన ఉదాహరణనని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
'ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్-2018' లెక్కలను గత ఏడాది 'గ్లోబల్ టైగర్ డే' సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ లెక్కలే 'ప్రపంచంలోనే కెమేరా సహాయంతో చేపట్టిన భారీ వన్యప్రాణి గణన'గా 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు దక్కేలా చేశాయి.
గిన్నిస్ బుక్‌లో ఏం రాశారంటే..
''భారత్ 2018-19లో నిర్వహించిన సర్వే నాలుగో సైకిల్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన గణనల్లో వనరులు, గణాంక సేకరణ పరంగా అత్యంత సమగ్రమైనది. 141 వేర్వేరు ప్రాంతాల్లో 26,838 ప్రదేశాల్లో కెమేరా ట్రాప్స్(మోషన్ సెన్సర్లున్న కెమేరాలు అడవుల్లో అమర్చగా వాటి పక్క నుంచి జంతువులు వెళ్లినప్పుడు అవి రికార్డు చేస్తాయి) ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో 1,21,337 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులుల గణన చేపట్టారు. ఈ కెమేరా ట్రాప్స్ మొత్తం 3,48,58,623 ఫొటోలను తీశాయి. అందులో 76,651 పులులవి కాగా 51,777 చిరుతలవి, మిగతావి ఇతర జంతువుల ఫొటోలు. ఈ ఫొటోల్లోని పులులను వాటిపై చారల తీరు ఆధారంగా గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి మొత్తం 2,461 పులులున్నట్లు(కూనలను మినహాయించి) తేల్చార''ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేర్కొన్నారు.
2018 సర్వే ప్రకారం దేశంలో మొత్తం 2967 పులులు ఉండగా అందులో 2461 కెమేరా ట్రాప్‌ల సహాయంతో లెక్కించారు. మిగతావి ఇతర పద్ధతుల్లో గణించారు.
పులుల సంరక్షణలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ముందంజలో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఇవి కూడా చదవండి:
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు విక్రయించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- పీవీ నరసింహారావు సోనియా గాంధీకి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారు?
- హ్యాపీ బర్త్ డే రీటా
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- శ్రీలంక: మహిళలు 'డ్రమ్ము'లా ఉండరాదన్న జిమ్.. వెల్లువెత్తిన నిరసనలు
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- EXCLUSIVE: అంబేడ్కర్ వీడియో ఇంటర్వ్యూ
- సుభాష్ చంద్రబోస్: 1934 - ఎ లవ్ స్టోరీ!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








