కరోనావైరస్: లాక్‌డౌన్ వల్ల శానిటరీ నాప్కిన్ల కొరత

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీత పాండే
- హోదా, బీబీసీ న్యూస్
దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వలన పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించడంతో స్కూళ్ల నుంచి శానిటరీ నాప్కిన్ల సరఫరా ఆగిపోయింది. దీంతో కొన్ని లక్షల మంది టీనేజ్ అమ్మాయిలకు శానిటరీ నాప్కిన్ల కొరత ఏర్పడింది.
దిల్లీలో ఉన్ బదిలీ మురికివాడలో నివసించే ప్రియ గత కొన్ని సంవత్సరాలుగా తన స్కూలులో ఇచ్చే శానిటరీ నాప్కిన్లపై ఆధారపడుతోంది. నెలసరి సమయంలో అమ్మాయిల ఆరోగ్యం కాపాడటం కోసం ప్రభుత్వమే పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్లని సరఫరా చేస్తుంది.
భారత్‌లో 35.5 కోట్ల మంది నెలసరి అయ్యే మహిళలు ఉండగా వారిలో కేవలం 36 శాతం మంది శానిటరీ నాప్కిన్లను వాడతారు. వీటి వాడకం పట్ల దేశంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మిగిలిన చాలా మంది పాత బట్టలు, బూడిద, ధాన్యం వంటివి వాడతారు. 2 కోట్ల 3 లక్షల మంది అమ్మాయిలు నెలసరి మొదలవ్వగానే స్కూల్ మానేస్తారు.
ప్రస్తుతం లాక్ డౌన్ వలన స్కూల్స్ లేకపోవడంతో శానిటరీ నాప్కిన్ల సరఫరా కూడా ఆగిపోయింది.
"నేను ఫిబ్రవరిలో ఆఖరి సారి స్కూల్ నుంచి ప్యాకెట్ తీసుకున్నాను.ఆ తర్వాత నుంచి నేను బయట మందుల దుకాణంలో 30 రూపాయలు చెల్లించి శానిటరీ నాప్కిన్లు కొనుక్కుంటున్నాను”.
కానీ, ప్రియ తో కలిసి చదువుకునే స్నేహితులు, ఇరుగు పొరుగు పిల్లలు శానిటరీ నాప్కిన్లు కొనుక్కునే పరిస్థితిలో లేరు. చాలా మంది మూడు పూటలా తిండి దొరకక బాధపడుతున్నారు. అలాంటి ఇళ్లల్లో పిల్లలు పాత బట్టలపై ఆధారపడుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రియ ఇంటికి దగ్గరలోనే భలస్వా డైరీ అనే మురికివాడ ఉంది. 1900 కుటుంబాలు నివసించే ఆ మురికి వాడలో మధు బాల రావత్ అనే ప్రచారకర్త ఉన్నారు. ఆమె కూడా ఈ శానిటరీ నాప్కిన్ల కొరత గురించి మాట్లాడారు.
"తిండి లాగే అమ్మాయిలకి నాప్కిన్లు చాలా అవసరమైన వస్తువులు. మా అవసరాలను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోందని” ఆమె ప్రశ్నించారు.
ఆమె నివసించే మురికి వాడలో ఉండే చాలా మంది స్కూల్ కి వెళ్లే అమ్మాయిలు ప్రభుత్వం ఇచ్చే శానిటరీ నాప్కిన్ల పై ఆధార పడతారు. వారు సొంతంగా డబ్బులు పెట్టి వాటిని కొనుక్కునే స్థితిలో లేరు.
"అక్కడ ఉండే అమ్మాయిలు విచారంతో ఉన్నారు. నెల నెలా ఇచ్చే రేషన్ తో పాటు ప్రభుత్వం శానిటరీ నాప్కిన్లు కూడా సరఫరా చేయాలని కోరుతున్నారు”.
.రావత్ అభ్యర్ధన మేరకు ఉమనైట్ అనే స్వచ్చంద సంస్థ ఈ మురికివాడల్లో అమ్మాయిలకి ఏప్రిల్ నెలలో 150 శానిటరీ నాప్కిన్ల ప్యాకెట్లని సరఫరా చేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దిల్లీలోని కొన్ని మురికి వాడల్లో శానిటరీ నాప్కిన్లు పంచేందుకు నిధులను సమీకరిస్తున్నట్లు ఉమనైట్ సంస్థ వ్యవస్థాపకురాలు హర్షిత్ గుప్త చెప్పారు. మే 28 వ తేదీన అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినంగా పరిగణిస్తారు.
వీరు మరి కొన్ని రోజుల్లో అవసరమైన వారికి శానిటరీ నాప్కిన్లు సరఫరా చేస్తామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా అమ్మాయిలకి శానిటరీ నాప్కిన్లు పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక శానిటరీ నాప్కిన్లు తయారు చేసే సంస్థ దిల్లీ , పంజాబ్ ప్రాంతాలలో పంచడానికి 80000 ప్యాడ్లని సరఫరా చేశారు.
రిలీఫ్ క్యాంపులలో ఉన్న వలసదారులకు, మురికివాడల్లో ఉండే ప్రజలకి శానిటరీ నాప్కిన్లు సరఫరా చేసేందుకు బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, చండీగఢ్, భువనేశ్వర్, కోల్కతా లాంటి నగరాల్లో పోలీసుల సహాయం తీసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బిజెపి ప్రభుత్వం దిల్లీ మురికివాడల్లో పంచడానికి 6 లక్షల ప్యాకెట్లని పోలీసులకి ఇవ్వనున్నట్లు సోమవారం ప్రకటించింది.
అయితే, ఈ కొరత నగరాలకి మాత్రమే పరిమితం కాదు. ఈ కొరత దేశ వ్యాప్తంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని దసరా స్వచ్చంద సంస్థ కి చెందిన శైలజ మెహతా చెప్పారు.
లాక్ డౌన్లో కేవలం 15 శాతం మంది అమ్మాయిలకి మాత్రమే శానిటరీ ప్యాడ్లు లభ్యమవుతున్నాయని చెప్పారు.
“స్కూళ్ళు లేకపోవడంతో గ్రామాలలో సామాజిక కార్యకర్తలు పంచే నాప్కిన్లు మీద మాత్రమే ఆధారపడవలసి వస్తోందని చెప్పారు. వారి దగ్గర కూడా అందరికీ ఇవ్వడానికి తగినంత మోతాదులో శానిటరీ నాప్కిన్లు లేవు”.
దేశంలో తొలి విడత లాక్ డౌన్ విధించినప్పుడు ప్రభుత్వం శానిటరీ నాప్కిన్ల ని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చలేదు.
మార్చ్ 29 వ తేదీన మందుల షాపుల వాళ్ళు, గ్రోసరీ షాపుల వాళ్ళు శానిటరీ నాప్కిన్ల కొరత ఏర్పడిందని చెప్పడంతో ప్రభుత్వం వాటిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చింది. ఈ ఆలస్యం వలన సుమారు 10 రోజుల ఉత్పత్తి నష్టం జరిగింది.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

"ప్రభుత్వం మమ్మల్ని విధులు నిర్వహించమని చెప్పిన తర్వాత మాకు అన్ని అనుమతులు తీసుకుని ఫ్యాక్టరీలు తెరవడానికి ఇంకొక మూడు రోజులు పట్టిందని ఫెమినైన్ & ఇన్ఫన్ట్ హైజీన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాజేష్ షా బీబీసీ కి చెప్పారు.
చాలా మంది పని వాళ్ళు నగరాల నుంచి వారి గ్రామాలకి వెళ్లిపోవడంతో ఫ్యాక్టరీలలో పని చేసేందుకు తగినంతమంది పనివాళ్ళు లేరని చెప్పారు.
కేవలం 60 శాతం ఫ్యాక్టరీలే అతి తక్కువ మంది పని వారితో పని చేస్తున్నాయని చెప్పారు. అలాగే కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ఫ్యాక్టరీలు తెరవనివ్వటం లేదు. దీంతో ఉత్పత్తి, సరఫరాలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.
ప్రస్తుతం శానిటరీ నాప్కిన్లకి తీవ్రమైన కొరత ఉందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇప్పటికే దీని ప్రభావం దేశంలోని మారుమూల ప్రాంతాలకి కూడా తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో వీటి కొరత తీవ్రంగా ఉన్నట్లు తమ భాగస్వామ్య సంస్థలు చెప్పాయని నెలసరి పై అవగాహన కల్గించేందుకు పని చేసే మెన్స్ట్రువల్ హెల్త్ అలియన్స్ ఆఫ్ ఇండియాకి చెందిన తాన్యా మహాజన్ అన్నారు.
ఆఖరి మైలులోఉండేవారే ముందుగా ఇబ్బంది పడతారని అన్నారు.
కొన్ని ప్రాంతాలలో శానిటరీ నాప్కిన్లు కొనుక్కోవాలంటే కనీసం 10 నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. రవాణా సౌకర్యాలు లేకపోవడం, సామాజిక దూరం పాటించవలసిన పరిస్థితితో బయటకి వెళ్లి తెచ్చుకునే అవకాశం చాలా మందికి ఉండటం లేదు.
చాలా భారతీయ కుటుంబాలలో నెలసరి గురించి మాట్లాడటాన్ని తప్పుగా భావిస్తూ ఉండటంతో శానిటరీ ప్యాడ్స్ తీసుకురమ్మని ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాలంటే ఒక పెద్ద సవాలులా భావిస్తున్నారు.
దీంతో చాలా మంది అమ్మాయిలు తమ దగ్గర ఉన్న పాత బట్టలని వాడటం మొదలు పెట్టారని మహాజన్ చెప్పారు.
దేశంలో ప్రతి నెలా 100 కోట్ల శానిటరీ ప్యాడ్ల వాడకం ఉందని అంచనా. అయితే, వీటిని వీటి వలన కలిగే పర్యావరణ నష్టం కారణంగా రుతుస్రావ ఆరోగ్య ప్రచార కర్తలు తిరిగి మెన్స్ట్రువల్ కప్ లు, కాటన్ వస్త్రంతో చేసిన ప్యాడ్లు వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఏ విధానం పాటించినా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించడం ముఖ్యమని వాటర్ ఎయిడ్ స్వచ్చంద సంస్థకి చెందిన అరుంధతి మురళీధరన్ అన్నారు. పాత బట్టలతో ప్యాడ్లు వాడమని, వాటిని ఉతికి ఎండబెట్టమని చెప్పడం సులభంగానే ఉంటుంది కానీ, అది నిజానికి మురికివాడల్లో ఉన్న టాయిలెట్ల పరిస్థితి, నీటి లభ్యతని బట్టి సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయ పడ్డారు.
కోవిడ్ 19 విపత్తు మహిళల ఆరోగ్యంలో కూడా అనేక మార్పులు తీసుకుని వచ్చిందని దీని పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మురళీధరన్ అన్నారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి.
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి? నిర్థరణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








