హైదరాబాద్: పాతికేళ్ల యువతి రెండో భార్యగా కావాలంటూ 60 ఏళ్ల అరబ్ షేక్ అఘాయిత్యం - ప్రెస్ రివ్యూ

పేదరికం, అర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువతులు, బాలికల తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపి వివాహాలు చేసుకుని అనంతరం వదిలేసి వెళ్లిపోతున్న అరబ్‌షేక్‌లు కొద్దినెలలు విరామమిచ్చి తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''పాతబస్తీలో రెండేళ్ల కిందట షేక్‌ల అక్రమ నిఖాల బాగోతం తెరపడిందన్న భావనతో పోలీసులు వీటిపై దృష్టి సారించడం లేదు. తాజాగా మూడు రోజుల క్రితం బహ్రెయిన్ దేశస్థుడు ఎబ్రాహిం షుక్రల్లా మొహమ్మద్ బైరమి తనపై లైంగికదాడి చేశాడని పాతబస్తీకి చెందిన యువతి ఫిర్యాదు చేయడం.. చాంద్రాయణగుట్ట పోలీసులు విచారణ చేపట్టడంతో నిఖా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎబ్రాహిం నుంచి డబ్బు తీసుకున్న దళారీ మహ్మద్ సాబేర్, అతడి భార్య సమీనా కీలక పాత్రధారులని గుర్తించారు. వీరిద్దరూ కొన్ని నెలల నుంచి అరబ్ షేక్‌లతో మాట్లాడుతూ వారికి నగరంలోని యువతులతో పెళ్లిళ్లు చేయిస్తున్నారని పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో ప్రత్యేక విభాగం అధికారులు, పోలీసులు దొంగ వివాహాలపై దృష్టి సారించారు.
అరవై ఏళ్ల ఎబ్రాహిం.. ఆరు నెలల క్రితం తాను రెండో పెళ్లి చేసుకుంటానని, పాతికేళ్లలోపు యువతితో నిఖా చేయించాలని నబీల్ కాలనీలో ఉంటున్న మహ్మద్ సాబేర్‌కు ఫోన్ చేశాడు. అమ్మాయి తయారుగా ఉందని చెప్పడంతో గతేడాది అక్టోబరులో నగరానికి వచ్చాడు. అదేరోజు అంబర్‌పేటకు చెందిన ఓ యువతితో సాబేర్ నిఖా చేయించాడు. నాలుగైదు రోజులున్న తర్వాత ఎబ్రాహిం బహ్రెయిన్‌కు వెళ్లిపోయాడు. షేక్‌ను పెళ్లి చేసుకున్నట్టు నటిస్తే వేల రూపాయలు ఇస్తానంటూ అంబర్‌పేట యువతిని సాబేర్ బలవంతం చేయడంతో ఆమె ఆ వివాహానికి ఒప్పుకొంది. అతను బహ్రెయిన్‌కు వెళ్లగానే ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తన రెండో భార్యను తీసుకెళ్తానంటూ గత నెల 25న ఎబ్రాహిం తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. సాబెర్ సలహాతో బార్కస్ సలాలా ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సాబెర్ అదేరోజు అరబ్‌షేక్‌తో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె సోదరిని ఎబ్రాహిం నివాసానికి తీసుకువచ్చాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా.. ఆ యువతి తిరస్కరించింది. దీంతో సాబేర్ భార్య ఫాతిమా రంగప్రవేశం చేసి యువతిని మళ్లీ తీసుకొచ్చి అరబ్‌షేక్ ఇంట్లో వదిలేసింది. అప్పటి నుంచి మూడు రోజుల పాటు ఎబ్రాహిం ఆమెపై లైంగికదాడి కొనసాగించాడు. బాధితురాలి సోదరికి విషయం తెలిసి సాబెర్‌ను నిలదీయడం.. వారు బాధితురాలి ఆచూకీ చెప్పడంతో మూడు రోజుల క్రితం ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది'' అని ఆ కథనంలో వివరించారు.

ఫొటో సోర్స్, facebook/ysjaganmohanreddy
ఏపీ సీఎం జగన్: 'ఎన్పీఆర్‌లో ప్రశ్నలు మైనారిటీల్లో అభద్రత కలిగిస్తున్నాయి'
జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్)పై ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారని 'సాక్షి' పత్రిక తెలిపింది.
''ఎన్‌పీఆర్‌లో ప్రతిపాదిత ప్రశ్నలు రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
ఎన్పీఆర్‌పై మైనారిటీల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ ట్విటర్‌లో స్పందించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఎన్పీఆర్ అంశంపై తమ పార్టీలో విస్తృతమైన చర్చ జరిపామని పేర్కొన్నారు.
ఎన్పీఆర్‌కు సంబంధించి 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరాతామని అన్నారు. ఇందుకు సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని వెల్లడించార''ని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒక్క రోజులోనే మాస్కులు ఖాళీ.. 'కృత్రిమ కొరత సృష్టించొద్దు'
ఒక్క కరోనా కేసు నమోదుతో హైదరాబాద్ వాసులు ఉలిక్కి పడ్డారని.. మంగళవారం గంటల వ్యవధిలోనే మెడికల్ షాపుల్లో మాస్కులన్నీ అమ్ముడుపోయాయని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
''రోజుకు 10-20 మాస్క్‌లు అమ్మడమే ఎక్కువ కాగా, తాజాగా ఒక్కో షాపులో మంగళవారం 200-300 వరకు విక్రయించారు. దీంతో చాలా మెడికల్ షాపుల్లో మాస్క్‌లు లేవని చెబుతున్నారు. ఎక్కువ మంది ఒకటి రెండు మాస్క్‌లు కాకుండా ఒకేసారి కుటుంబానికి సరిపడా కొనుగోలు చేశారని, దీంతో ఒక్కరోజే స్టాక్ అంతా అయిపోయిందని కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు తెలిపారు. మాస్క్‌ల కోసం ఆర్డర్లు ఇస్తే.. ఒకట్రెండు రోజుల తర్వాతే ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారన్నారు.
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు మార్కెట్లో ప్రధానంగా మూడు రకాల మాస్క్‌లను విక్రయిస్తున్నారు. ఇందులో ఎన్-95 ఖరీదైంది. దీని ధర గతంలో రూ.50 వరకు ఉండగా.. ప్రస్తుతం 150కి విక్రయిస్తున్నారు. ఇక 3ఫ్లై, 2ఫ్లై మాస్క్‌లు కరోనా రాకముందు 50పైసల నుంచి ఒక రూపాయి ఉండగా, ప్రస్తుతం రూ. 15-20 వరకు విక్రయిస్తున్నాయి. చైనాతో పాటు ఇతర దేశాలకు పెద్దమొత్తంలో సరఫరా చేయాల్సి ఉండడంతో ఇక్కడ కొరత ఏర్పడుతోందని తయారీదారులు చెబుతున్నార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
జగిత్యాలలో కశ్మీర్ పోలీసులు
కశ్మీర్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాదులకు సాయం చేశాడన్న అనుమానంతో అక్కడి పోలీసులు మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన సరికెల లింగన్నను అదుపులోకి తీసుకున్నారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''జమ్ముకశ్మీర్‌కు చెందిన రాకేశ్‌కుమార్ అక్కడి ఆర్నియా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఆర్మీ క్యాంప్‌లో కూలీ. అతడికి ఫేస్‌బుక్‌లో అనిత పేరుతో ఉన్నవారితో పరిచయమైంది. తాను జర్నలిస్టునని,భారత సైనిక శిబిరంలోని వస్తువులు, వాహనాలు, ఆ ప్రాంత ఫొటోలు పంపితే వార్తలుగా రాస్తానని అనిత చెప్పడంతో రాకేశ్ ఆ పనులు చేశాడు. దీనికోసం అనిత నుంచి రూ.27 వేలు రాకేశ్ ఖాతాలో జమయ్యాయి. రాకేశ్ ఫొటోలను తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌చేయడంతో స్థానిక పోలీసులు జనవరి 5న అరెస్టుచేశారు. రాకేశ్ ఖాతాలు పరిశీలించగా లింగన్న గూగుల్‌పే ద్వారా గతనెల 13న రూ.5 వేలు, 25న రూ.4 వేలు పంపినట్టు తేలింది. దీని ఆధారంగా ఆర్నియా పోలీసులు లింగన్న విచారించారు. దుబాయ్‌లో ఉన్న బంధువైన శ్రీనివాస్ ఓ బ్యాంకు ఖాతాకు నగదు పంపాలని సూచించడంతో డబ్బు పంపానని తెలిపాడు. దీంతో లింగన్నను విచారణకు తీసుకెళ్లేందుకు ఆర్నియా పోలీసులు మెజిస్ట్రేట్‌ను సంప్రదించగా అనుమతిచ్చారు.
లింగన్నకు బంధువైన శ్రీనివాస్ కొన్నేండ్లుగా దుబాయ్‌లో ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదేదుకాణంలో పాకిస్థాన్ వ్యక్తి కూడా పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య స్నే హం ఏర్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యం లో ఆ వ్యక్తి భారత్‌లో తమ బంధువు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని, గూగుల్‌పే ద్వారా రూ.9 వేలు పంపే ఏర్పాటుచేయాలని శ్రీనివాస్‌ను కోరినట్టు తెలిసింది. దీంతో శ్రీనివాస్ ఫోన్‌లో బ్యాంకు ఖాతాను లింగన్నకు పంప గా, ఆ ఖాతాకు లింగన్న రూ.9 వేలు పంపి నట్టు తెలుస్తున్నద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యూజియంగా పీవీ ఇల్లు
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామమైన వరంగల్ అర్బన్ జిల్లా వంగరలోని ఆయన స్వగృహం మ్యూజియంగా మారనుందని 'సాక్షి' కథనం తెలిపింది.
''పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో పీవీ ఉపయోగించిన 150 వస్తువులు ప్రదర్శనకు ఉంచుతారు. వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో నూతన గృహప్రవేశంతో పాటు మ్యూజియాన్ని గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చేత ప్రారంభించేందుకు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నార''ని అందులో తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఇంటర్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?
- ‘దేవుణ్ణి పూజించాలి, గే వివాహాలను నిషేధించాలి’ - రాజ్యంగంలో సవరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైన పుతిన్
- శశిథరూర్ మెడలో వేలాడుతున్న గాడ్జెట్ ఏమిటో తెలుసా?
- అమరావతి ఉద్యమంలో పెరుగుతున్న కేసులు... జైళ్ళలో ఉద్యమకారులు
- వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు 93,000 కోట్లు చెల్లించడంలో విఫలమైతే ఏమవుతుంది?
- కరోనావైరస్ నుంచి రక్షణ కల్పిస్తామంటూ తప్పుడు ప్రచారం.. లక్షలాది ఉత్పత్తుల్ని తొలగించిన అమెజాన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








