దిల్లీ హింస: పోలీసుల పాత్రపై వినిపిస్తున్న ప్రశ్నలకు బదులిచ్చేదెవ్వరు?

దిల్లీ హింసలో పోలీసుల పాత్రపై సందేహాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రశాంత్ చాహల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శుక్రవారం సాయంత్రం నాటికి ఈశాన్య దిల్లీలో చోటుచేసుకున్న హింసలో 42 మంది మృతిచెందారని అధికారులు ప్రకటించారు. గాయపడిన వందకు పైగా ప్రజలు ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.

అల్లర్లో మరణించినవారి సంఖ్యను చూస్తే, గత 70 ఏళ్లలో దిల్లీలో చోటుచేసుకున్న అతిపెద్ద హిందూ-ముస్లిం ఘర్షణలు ఇవే అని తెలుస్తోంది. అయితే, 1984లో ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లో దాదాపు 3000 మంది మరణించారు.

News image

ఫిబ్రవరి 23, ఆదివారం నాడు దిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హింస చెలరేగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రచారం లోకి వచ్చాయి. హిందువులు, ముస్లింలు చేతుల్లో కర్రలు పట్టుకుని, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం ఆ వీడియోల్లో కనిపించింది. కొన్ని నాటు తుపాకులు, పెట్రోల్ బాంబులు కూడా కనిపించాయి.

ఈ ఘర్షణల్లో ఉపయోగించిన ఆయుధాలు, వాటి సంఖ్యను చూస్తే, దిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అంతేకాదు, ఘర్షణ జరుగుతున్న సమయంలో పోలీసులు అచేతనంగా ఉండటంపై ఆ శాఖ ఉన్నతాధికారులు కోర్టులో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

"రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు మీ దగ్గర ఉన్నప్పుడు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మీరెందుకు ఆగాల్సి వచ్చింది" అని దిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్‌కు దిల్లీ హైకోర్టు జస్టిస్ ఎస్ మురళీధర్ ప్రశ్నించారు.

"నగరంలో ఉద్రిక్త పరిస్థితులున్నప్పుడు, తగిన చర్యలు చేపట్టడానికి అంతకన్నా మించిన సమయం ఎప్పుడొస్తుంది?" అని ప్రశ్నించారు.

అయితే, పరిస్థితులను అదుపుచేసేందుకు తగినంత మంది పోలీసులను హింసాత్మక ప్రాంతాల్లో మోహరించామని, దీనికి సంబంధించి వందకు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశామని దిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ కోర్టుకు వివరించారు.

దిల్లీ హింసలో పోలీసుల పాత్రపై సందేహాలు

ఫొటో సోర్స్, Getty Images

దీంతోపాటు, హింసాత్మక ఘటనలపై దర్యాప్తుకు దిల్లీ పోలీసు విభాగం రెండు ప్రత్యేక విచారణ బృందాలు (సిట్‌లు)ను ఏర్పాటు చేసింది. వీటికి దిల్లీ డిప్యూటీ కమిషనర్లు జోయ్ టిర్కీ, రాజేశ్ దేవ్‌లు నేతృత్వం వహిస్తారు. వీటిలో నలుగురు అసిస్టెంట్ కమిషనర్ హోదా గల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ మొత్తం విచారణను అడిషనల్ పోలీస్ కమిషనర్ బీకే సింగ్ పర్యవేక్షిస్తారు.

గతంలో రాజేశ్ దేవ్‌ను 'అత్యుత్యాహం' ప్రదర్శిస్తున్నారంటూ ఎన్నికల సంఘం మందలించింది.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షహీన్ బాగ్ వద్ద కపిల్ బైంస్లా కాల్పులు జరపడంపై మీడియాతో మాట్లాడటం సరైన పని కాదని అప్పట్లో ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతేకాకుండా, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది.

కానీ, దిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ తమ అధికారులు, సిబ్బంది హింస జరుగుతున్న సమయంలో పోషించిన పాత్రకు సంబంధించి నిజాలను బయటపెడుతుందా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న.

దిల్లీ హింసలో పోలీసుల పాత్రపై సందేహాలు

ఫొటో సోర్స్, AFP

పోలీసుల పాత్రపై సందేహాలు

భజన్‌పుర ప్రాంతంలోని ఓ దర్గా సమీపంలో ఉన్న పోలీస్ సహాయ కేంద్రాన్ని కూడా సోమవారం నాడు అల్లరిమూకలు మంటల్లో దగ్ధం చేశాయి.

హింసకు పాల్పడ్డవారితో పాటు, పోలీసులు కూడా కొందరు ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని ఆ సమయంలో అక్కడున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీతో అన్నారు.

పక్కనే ఉన్న చాంద్‌బాగ్‌లో నివసించే చిన్న దుకాణ యజమాని సగిర్‌పై కూడా ఆ ఘటనల్లో కాల్పులు జరిగాయి.

పోలీసులు సరైన సమయంలో చర్యలు తీసుకుని ఉంటే, తన సోదరుడు ఆ అల్లరి మూకల చేతిలో బలై చనిపోయి ఉండేవాడు కాదు అని ఆయన సోదరుడు జీటీబీ హాస్పటల్ దగ్గర బీబీసీతో చెప్పారు.

అలాగే, భజన్‌పుర చౌక్, విజయ్ పార్క్‌, ముస్తఫాబాద్‌లకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఆవేశంతో ఉన్న మూకలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకోవడం ఆ వీడియోల్లో కనిపించింది. కొద్ది దూరంలో ఉన్న పోలీసులు ఇదంతా చూస్తూ నిలబడటం కూడా ఆ వీడియోల్లో ఉంది.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

నగరంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న సమయంలో దిల్లీ పోలీసులు అచేతనంగా ఉండిపోయారని దిల్లీ పోలీస్ మాజీ కమిషనర్ నీరజ్ కుమార్ ఓ నివేదికలో తెలిపారు. వారిని బాధ్యులను చేయడంలో ఎలాంటి తప్పూ లేదని ఆయనన్నారు.

"అధికార పార్టీ, వారి నియంత్రణలో ఉన్న పోలీసులు చట్టాన్ని అపహాస్యం చేశారు, ఇది చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది" అని దిల్లీ పోలీస్ మాజీ జాయింట్ కమిషనర్ మ్యాక్స్‌వెల్ పెరీరా తెలిపారు.

"దిల్లీలో మారణకాండ జరుగుతుంటే, పోలీసుల ప్రతిస్పందన, వారి చర్యలపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి" అని అమెరికా వార్త పత్రిక న్యూయార్క్ టైమ్స్ శుక్రవారం నాడు ప్రచురించింది.

దిల్లీ హింసలో పోలీసుల పాత్రపై సందేహాలు

ఫొటో సోర్స్, AFP

విచారణ విధానం సరైనదేనా?

దేశ రాజధానిలో హింస సమయంలో పోలీసుల పాత్రపై అనేక సందేహాలు తలెత్తాయి. సిట్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసులు సమాధానం ఇవ్వడానికి సిద్ధమయ్యారా?

దీన్ని అర్థం చేసుకోవడానికి, మాజీ ఐపీఎస్ అధికారి, సీఆర్పీఎఫ్ మాజీ డీజీ ప్రకాశ్ సింగ్‌తో బీబీసీ మాట్లాడింది.

హింస సమయంలో దిల్లీ పోలీసుల వైఖరిని ప్రకాశ్ సింగ్ తప్పుపట్టారు. "చాలా నష్టం జరిగినప్పుడు, సాధారణంగానే ప్రశ్నలు తలెత్తుతాయి. వీటిపై విచారణ జరగడం చాలా అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

"ఇలాంటి కేసుల విచారణకు ప్రత్యేకమైన నిబంధనలు ఏమీలేవు. ఇది ప్రభుత్వ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అయితే, ముందుగా శాఖాపరమైన విచారణ జరగొచ్చు. ఒకవేళ ఆ విభాగంలో దీనిపై నమ్మకం లేకపోతే, ఓ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి నేతృత్వంలో దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ తర్వాత న్యాయ విచారణ అంశం వస్తుంది" అని ప్రకాశ్ సింగ్ తెలిపారు.

"హోంశాఖతో సంప్రదించిన తర్వాతే దిల్లీ పోలీస్ కమిషనర్ సిట్ ఏర్పాటుచేశారా, లేక దిల్లీ పోలీస్ శాఖాధిపతిగా ఇది ఆయన సొంత నిర్ణయమా అనే దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు. కానీ, హోంశాఖ కోరుకుంటే ఉన్నత స్థాయి దర్యాప్తు లేదా బయట అధికారి ఎవరితోనైనా విచారణకు ఆదేశించవచ్చు" అని ఆయన అన్నారు.

దిల్లీ హింసలో పోలీసుల పాత్రపై సందేహాలు

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఏమైనా చర్యలు తీసుకోగలదా?

దీనికి సమాధానంగా, "ఇలాంటి అంశాల్లో దిల్లీ ప్రభుత్వమే కాదు, ఓ ఎన్జీఓ సైతం స్వతంత్ర దర్యాప్తు జరపవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనికి ఎలాంటి అడ్డంకీ లేదు. చాలా సందర్భాల్లో కొన్ని సామాజిక సంస్థలు తమ సొంత విచారణ బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ విచారణ బృందాలతో పాటు సమాంతర దర్యాప్తు చేపట్టి, ఆ వివరాలను వెల్లడిస్తుంటారు" అని తెలిపారు.

అయితే, ఇలాంటి నివేదికల్లో పేర్కొన్న అంశాలను కోర్టుల్లో నిరూపించడం చాలా కష్టమైన పని అని ఉత్తర్ ప్రదేశ్ మాజీ డీజీపీ బ్రజ్ లాల్ అన్నారు.

"దిల్లీ పోలీసులు నిష్క్రియగా ఉండటం కనిపించింది. లేకపోతే హింస ఇంతలా వ్యాప్తి చెంది ఉండేది కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

"మంటలు, అల్లరి మూకలు ప్రజల ఇళ్లలోకి ప్రవేశించడం వంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు కాల్పులు జరిపే అధికారం పోలీసులకు ఉంటుంది. హింస మొదలైన 24 గంటల్లోపు పోలీసులు కఠిన చర్యలు చేపట్టి, హింసకు కారకులపై రబ్బర్ బుల్లెట్లు, పెల్లెట్ గన్స్ ఉపయోగించి ఉండాల్సింది. అదే జరిగి ఉంటే, దాదాపు 40మంది పౌరులు మరణించి ఉండేవారు కాదు. ఇంతమంది దళాల్ని ఉపయోగించాల్సి ఉండేది కాదు. ఇదైతే చాలా స్పష్టం" అని ఆయన అన్నారు.

దిల్లీ హింసలో పోలీసుల పాత్రపై సందేహాలు

ఫొటో సోర్స్, PTI

"ఎర్ర చొక్కా వేసుకున్న వ్యక్తి పోలీసుల వైపు తుపాకీ చూపించడం టీవీ చానళ్లలో కనిపించింది. అతడిని ఘటనా స్థలంలోనే శిక్షించి ఉంటే, ఇలాంటి బహిరంగంగా ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదనే ఓ బలమైన సందేశం ప్రజలకు చేరి ఉండేది" అని బ్రిజ్ లాల్ తెలిపారు.

ఉన్నత స్థాయి లేదా న్యాయ విచారణకు బదులుగా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం మంచిదే అని లాల్ అభిప్రాయపడ్డారు.

"ఉన్నత స్థాయి విచారణ లేదా న్యాయ విచారణను కేసు డైరీలో భాగంగా పరిగణించలేం. కాబట్టి, వారి నివేదికల ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవడం కుదరదు. అందుకే, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిట్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టడమే మంచిది. సిట్ సమర్పించే సాక్ష్యాలనే కోర్టు విచారణలో స్వీకరిస్తారు" అని బ్రిజ్ లాల్ అన్నారు.

హింసకు సంబంధించిన కేసుల్లో పోలీసుల పాత్రపై విచారణ జరిగితేనే హింసకు కారకులకు శిక్ష పడుతుంది అని బీబీసీతో బ్రిజ్ లాల్ అన్నారు. అంతేకాదు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)