కశ్మీర్‌పై అజిత్ డోభాల్ చెప్పింది ఎంత వరకు నిజం: అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, భరత్ భూషణ్
- హోదా, బీబీసీ కోసం
"కశ్మీర్‌లో మెజారిటీ జనాభా ఆర్టికల్ 370ని తొలగించడానికి అనుకూలంగా ఉన్నారని నాకు పూర్తి నమ్మకం ఉంది. కొంతమంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరికీ ఇది సామాన్యుల గళం అనిపిస్తోంది. అది పూర్తిగా నిజం కాదు. కశ్మీర్‌లో సైన్యం వేధించడం అనే ప్రశ్నే లేదు. అక్కడ శాంతిస్థాపనకు జమ్ము-కశ్మీర్ పోలీస్, కేంద్ర భద్రతా బలగాలను మోహరించాం. భారత సైన్యం తీవ్రవాదంతో పోరాడ్డానికి మాత్రమే అక్కడ ఉంది".
ఈ మాటలు శనివారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ చెప్పినవి.
జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని తొలగించాలనే నిర్ణయం తర్వాత పరిస్థితులు, అంతకు ముందు స్థానిక నేతలను గృహనిర్బంధంలోకి తీసుకోవడంపై కేంద్రంలో మోదీ ప్రభుత్వంపై వరుస విమర్శలు చుట్టుముట్టాయి.
జమ్ము-కశ్మీర్‌లో కమ్యూనికేషన్ సేవలను ఆపేయడం, సైన్యం కశ్మీరీలను వేధించిందనే ఆరోపణల మధ్య అజిత్ డోభాల్ శనివారం కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడారు. కశ్మీర్‌కు సంబంధించిన చాలా అంశాలపై కొన్ని ప్రకటనలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లో చురుగ్గా ఉన్న కొన్ని గ్రూపులు కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని డోభాల్ అన్నారు.
జమ్ము-కశ్మీర్‌లో ఏ నేతపైనా ఎలాంటి చార్జ్ లేదా దేశద్రోహం కేసులు పెట్టలేదు. వారు గృహనిర్బంధంలో మాత్రమే ఉన్నారు. ప్రజాస్వామ్యం కోసం సరైన వాతావరణం ఏర్పడేవరకూ వాళ్లు అక్కడ నిర్బంధంలోనే ఉంటారని డోభాల్ చెప్పారు.
కొంతమందిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నాం. బహిరంగ సభలు జరిగితే తీవ్రవాదులు దానిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అప్పుడు శాంతిభద్రతలు చూసుకోవడం కష్టం కావచ్చని ఆయన తెలిపారు.
కశ్మీర్‌లో పరిస్థితి గురించి అజిత్ డోభాల్ చేసిన ఈ ప్రకటనల్లో నిజమెంత, ఆయన మాటల ద్వారా ఏం తెలుస్తోంది అనేదానిపై బీబీసీ ప్రతినిధి అనంత్ ప్రకాశ్ సీనియర్ జర్నలిస్ట్ భరత్ భూషణ్‌తో మాట్లాడారు. ఇవి ఆయన అభిప్రాయాలు.

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ నేతలు ప్రభుత్వాన్ని కీర్తించరు
జమ్ము-కశ్మీర్ నేతలను గృహనిర్బంధం చేయడం, వారిని అదుపులోకి తీసుకోవడం సరైనదేనని అజిత్ డోభాల్ అన్నారు. ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ రకరకాల వాదనలూ వినిపించారు. కానీ ఆయన వాదనల్లో దమ్ము లేదు.
స్థానిక నేతలు బహిరంగ సభలు పెడితే మిలిటెంట్లు వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారని డోభాల్ చెప్పారు. కానీ చూస్తుంటే గత 70 ఏళ్లుగా భారత జెండాను ఎత్తుకున్న వాళ్లను జైల్లో బంధించి, వాళ్లను కూడా మిలిటెంట్ల క్యాంపుల్లో వేసేసినట్టు అనిపిస్తోంది.
ఈ నేతలు బయటికి వచ్చినపుడు, ప్రస్తుత ప్రభుత్వాన్ని కీర్తిస్తూ బయటకు రారు. వాళ్లు కశ్మీర్‌లో రాష్ట్ర ప్రత్యేక పతిపత్తిని హఠాత్తుగా లాగేసుకోవడంతో కోపంగా ఉన్న ప్రజలకు అండగా నిలబడతారు. వారిని గత నెల రోజులుగా ఇళ్లలో బంధించి ఉంచారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత సమాఖ్యవాదం వేరే
జమ్ము-కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి పక్షపాతం లాంటిదని డోభాల్ చెప్పారు. కానీ నిజం ఏంటంటే, ఇది భారత్ ఫెడరలిజం ఎసిమెట్రిక్. అంటే తమిళనాడుతో ఎలా ప్రవర్తిస్తుందో, అలా ఉత్తరప్రదేశ్‌తో ఉండదు. నాగాలాండ్‌తో ప్రవర్తించినట్లు, దిల్లీతో చేయదు. అలాగే ఆర్టికల్ 370 ఫెడరలిజంకు ఒక ఉదాహరణ కూడా.
రాష్ట్రాల చరిత్ర వేరైనా.. భారత్‌లో అవి విలీనం అయిన నేపథ్యం వేరువేరుగా ఉన్నప్పటికీ, దేశంలోని అన్ని రాష్ట్రాలను భారతీయ జనతా పార్టీ ఒకే కళ్లజోడు నుంచి చూస్తోంది.
బీజేపీ దృష్టికోణంలో ఈ సందర్భాన్ని చూస్తే, దాని లెక్క ప్రకారం ఇది కరెక్టే అనిపిస్తుంది. కానీ భారత రాజ్యాంగం ఏ సందర్భంలో ఏర్పడిందో, జమ్ము-కశ్మీర్ భారత్‌లో ఏ సందర్భంలో విలీనమైందో.. దానిని బట్టి చూస్తే, డోభాల్ చెబుతున్నది తప్పు అనిపిస్తుంది.
అజిత్ డోభాల్ మీడియా సమావేశంలో ఏ అంశాలపై మాట్లాడారో.. ఆ అంశాలన్నీ అమెరికా విదేశాంగ శాఖ లేవనెత్తినవి. అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం కశ్మీర్ గురించి ఒక ప్రకటన జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే డోభాల్ తన ప్రకటనలో అమెరికా విదేశాంగ శాఖ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ శుక్రవారం అమెరికా వైపు నుంచి వచ్చిన ప్రశ్నలన్నింటికీ అందులో సమాధానాలు ఉన్నాయి.
అంటే, అజిత్ డోభాల్ ఒక విధంగా అమెరికాకే సమాధానాలు ఇచ్చారు. ఆయన జమ్ము-కశ్మీర్‌లో పరిస్థితి కుదుటపడుతుందని అన్నారు. కానీ అది ఎప్పట్నుంచి అనేది కూడా ఆయన చెప్పుండాలి.
ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రభుత్వం మరో ఆర్నెల్లు లేదా ఏడాదిలో ఎన్నికలు నిర్వహించే స్థితిలో ఉంటున్నట్టు అస్సలు అనిపించడం లేదు.
ప్రజాస్వామ్యంలో నేతలను నియమించరు
కశ్మీర్‌లో పరిస్థితులు చాలా వేగంగా సాధారణ స్థితికి వస్తున్నాయని అజిత్ డోభాల్ చెప్పారు. కానీ నేతలను జైళ్లలో బంధించడం వల్ల పరిస్థితి సాధారణం అవుతుందా? పోలీసుల లాఠీలతో పరిస్థితి సర్దుకుంటుందా? లేదా మొబైల్, ఇంటర్నెట్ ఆపేయడం వల్ల పరిస్థితులు కుదుటపడతాయా?
ప్రజాస్వామ్యంలో పరిస్థితి సాధారణంగా ఉండడానికి 'సేఫ్టీ వాల్వ్స్' అవసరం అవుతాయి. నేతలు అలాగే వ్యవహరిస్తారు. వాళ్లు ప్రజల మధ్యలోకి వెళ్తారు. వారితో కూర్చుంటారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేసినా, మనం ఆ 'సేఫ్టీ వాల్వ్' ద్వారా పరిస్థితిని సాధారణ స్థితికి తేవాల్సి ఉంటుంది. కానీ జమ్ము-కశ్మీర్ నాయకత్వాన్నే అంతం చేసి, ఒక కొత్త నాయకత్వాన్ని పుట్టించాలని ప్రస్తుత ప్రభుత్వం అనుకుంటోంది.
ప్రభుత్వం ఆ నేతలను 'నియమించగలం' అనుకుంటోంది. కానీ ప్రజాస్వామ్యంలో నేతలను నియమించడం ఉండదు.
ఇవి కూడా చదవండి:
- మోదీ వల్ల పాకిస్తాన్‌లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
- చంద్రయాన్-2: వైఫల్యానికి కారణం ఇదేనా
- ప్రయోగానికి ముందే రాకెట్ పేలిపోయింది
- కశ్మీర్: మహమ్మద్ గజనీకి ముచ్చెమటలు పట్టించిన హిందూ రాజుల కథ
- 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...'
- భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









