చిదంబరం: కాంగ్రెస్ ఆర్థికవేత్త రాజకీయ జీవితంలో ఉత్థాన పతనాలు

ఫొటో సోర్స్, Hindustan times
- రచయిత, ఏడీ బాలసుబ్రమణియన్
- హోదా, బీబీసీ తమిళం
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు తప్పించుకోవడానికి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బుధవారం రాత్రి సిబిఐ అధికారులు ఆయనను దిల్లీలో అరెస్ట్ చేశారు. విచారణ కోసం సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్ళారు.
భారతదేశ ఆర్థిక మంత్రిగా, హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఈ రాజకీయ-ఆర్థికవేత్త తన జీవితంలో మొదటి నుంచీ ఎన్నో ఉత్థానపతనాలు చూశారు.
తమిళనాడు నుంచి దిల్లీ అధికార చక్రవ్యూహాల్లో ఉన్నత స్థానాలను చేరుకోవడంలో చిదంబరం విజయవంతమయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు.
2009-14 మధ్య యూపీయే పాలనాకాలంలోని శక్తిమంతమైన 9 కేబినెట్ కమిటీల్లోనూ ఆయన ఉన్నారు. అప్పటి ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ఈ కమిటీలే కీలక పాత్ర పోషించేవి.
ప్రభుత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తరువాత అత్యంత శక్తిమంతుల్లో చిదంబరం ఒకరు.
తమిళనాడులోని శివగంగై జిల్లా కానాదుకాత్తాన్‌లో పళనియప్పన్, లక్ష్మి ఆచి దంపతులకు 1945 సెప్టెంబరు 16న చిదంబరం జన్మించారు. ఆయన తాత(తల్లి తరఫు) రాజా సర్ అన్నామలై చెట్టియార్ తమిళనాట విద్య, సంగీతం, వాణిజ్య రంగాల్లో తనదైన ముద్ర వేశారు.

ఫొటో సోర్స్, Getty Images
చెన్నై లయోలా కాలేజీ, మద్రాస్ విశ్వవిద్యాలయం, చెన్నై లా కాలేజీల్లో చదువుకున్న చిదంబరం వృత్తిపరంగా న్యాయవాది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎంబీయే కూడా పూర్తి చేశారు.
సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లోనూ ఆయన న్యాయవాదిగా పనిచేశారు.
చిదంబరం భార్య నళిని కూడా న్యాయవాదే. కుమారుడు కార్తీ చిదంబరం ప్రస్తుతం శివగంగై లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన చిదంబరం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
1972లో కాంగ్రెస్ పార్టీలో చేరిన చిదంబరం ఆ తరువాత మూడేళ్ల పాటు తమిళనాడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడేళ్ల పాటు కొనసాగారు.
1984లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చేరారు. వాణిజ్య శాఖ సహాయమంత్రిగా కేంద్ర మంత్రివర్గంలో ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనంతర కాలంలో కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతలు చూశారు.

ఫొటో సోర్స్, Getty Images
తమిళ మానిల కాంగ్రెస్‌లో మూపనార్‌తో కలిసి..
కాంగ్రెస్‌తో చిరకాల బంధం కొనసాగించిన చిదంబరం 1996లో దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
రాజీవ్ గాంధీ హత్య తరువాత తమిళనాడు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేల కూటమి ఘన విజయం సాధించింది. జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. పీవీ నరసింహరావు ప్రధాన మంత్రి అయ్యారు.
తమిళనాడులో అన్నాడీఎంకే, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు తమను అన్నాడీఎంకే నిర్లక్ష్యం చేస్తుందని భావించారు. అదేసమయంలో జయలలిత నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వంపైనా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
దీంతో 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో అన్నాడీఎంకే ఉండరాదని కొందరు తమిళ కాంగ్రెస్ నేతలు వాదించారు. కానీ, పార్టీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు.
తమిళనాడు కాంగ్రెస్‌లో అప్పటికి కీలక నేతగా ఉన్న జీకే మూపనార్ అప్పుడు మరికొందరితో కలిసి తమిళ మానిల కాంగ్రెస్ ఏర్పాటు చేశారు. చిదంబరం కూడా అందులో ఉన్నారు. ఆ ఎన్నికల్లో తమిళ మానిల కాంగ్రెస్... డీఎంకేతో కలిసి పోటీ చేసింది.
తమిళ మానిల కాంగ్రెస్‌లో మూపనార్ తరువాత చిదంబరమే కీలక నేత.. అప్పటి పరిణామాలు చిదంబరం రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పాయి.
ఆ ఎన్నికల్లో డీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కేంద్రంలోనూ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఈ పార్టీలన్నీ కూటమి కట్టి యునైటెడ్ ఫ్రంట్‌గా ఏర్పడి దేవెగౌడ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దేవెగౌడ ప్రభుత్వంలో చిదంబరం మంత్రిగా పనిచేశారు. ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈసారి సొంత పార్టీ.. అక్కడి నుంచి మళ్లీ కాంగ్రెస్‌లోకి..
అయితే, అన్నాడీఎంకేతో కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ ఏర్పడిన తమిళ మానిల కాంగ్రెస్ మళ్లీ అదే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతో చిదంబరం బయటకు వచ్చి 'కాంగ్రెస్ జననాయక పెరవాయి' పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నుంచే లోక్‌సభకు పోటీ చేసిన చిదంబరం విజయం సాధించారు. అనంతరం 2004లో ఆయన కాంగ్రెస్ జననాయక పెరవాయిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యూపీఏ తొలి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రి పదవి దక్కింది చిదంబరానికి. 2009లోనూ యూపీఏ ప్రభుత్వమే ఏర్పడడంతో 2014 వరకు చిదంబరం కేబినెట్ మంత్రిగా కొనసాగారు. ఆ పదేళ్ల కాలంలో ఆయన హోం, ఆర్థిక శాఖలతో పాటు పలు ఇతర శాఖల బాధ్యతలూ చూశారు.
ఆ పదేళ్ల కాలం ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత దశ అని చెప్పాలి. అదే పదేళ్ల కాలం ఆయన రాజకీయ జీవితంలో కుదుపులు మొదలుకావడానికీ కారణమైందని చెప్పాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎన్ఎక్స్ మీడియా కేసు
చిదరంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలోకి రూ. 305 కోట్ల విదేశీ నిధుల రాకకు వీలుగా ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్స్ బోర్డు అనుమతులివ్వడం వెనుక అవకతవకలున్నాయని, అందులో ఆయన కుమారుడు కార్తి చిదంబరం ప్రమేయం ఉందని సీబీఐ 2017లో కేసు నమోదు చేసింది.
ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసు
చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే మారిషస్‌కు చెందిన మ్యాక్సిస్ అనుబంధ సంస్థ అయిన గ్లోబల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ హోల్డింగ్ లిమిటెడ్ భారత్‌లోని ఎయిర్‌సెల్ టెలి కమ్యూనికేషన్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు రావడంలోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
ఆర్థిక మంత్రిగా రూ. 600 కోట్ల వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతులిచ్చేందకు ఆయనకు అధికారాలు ఉన్నప్పటికీ ఆయన ఎయిర్‌సెల్‌లోకి మ్యాక్సిస్ నుంచి రూ. 3200 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారంటూ సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
రూ. 600 కోట్లు దాటితే ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ పరిశీలనకు పంపించాల్సి ఉన్నా అదేమీ లేకుండా చిదంబరం నుంచి క్లియరెన్స్ వచ్చిందన్నది ఆరోపణ.
ఎయిర్ఇండియా విమానాల కేసు
ఎయిర్ ఇండియా 43 విమానాల కొనుగోలు వ్యవహారంలోనూ అవకతవకలు జరిగాయన్న కేసులోనూ చిదంబరం విచారణ ఎదుర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘కశ్మీర్లో మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత భారత ప్రభుత్వానిదే’
- శాండ్విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు
- కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం వహిస్తానని మరోసారి ప్రతిపాదించిన డోనల్డ్ ట్రంప్
- ఉడుము దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధ జంట
- భారత్‌తో యుద్ధానికి సిద్ధం.. గుణపాఠం చెప్పే సమయం వచ్చింది : ఇమ్రాన్ ఖాన్
- ఆయన రోజూ 30 కిలోమీటర్లు గాల్లో తేలుతూ ఆఫీసుకు వెళతారు...
- కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు
- అమెరికా ఇతర దేశాల నుంచి ఎన్ని భూభాగాలను ఎంత ధరకు కొన్నదో తెలుసా...
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- డీప్ ఫేక్: నకిలీ వీడియోలను ఎలుకలు గుర్తిస్తాయా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








