ఆ అయిదింటిపై జగన్ ప్రభుత్వం మూడో కన్ను: ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, JAGAN/FB
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల్లోనే కాదు.. రాజధాని నిర్మాణం, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో చేపట్టిన పనుల్లో కూడా జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సాక్షి వెల్లడించింది.
ఈమేరకు థర్డ్ పార్టీ విచారణ పరిధిని పెంచడంతోపాటు సభ్యుల సంఖ్యను కూడా 5కు పెంచింది. రిటైర్డు ఈఎన్‌సీలు రోశయ్య, బి.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఐటీ ప్రొఫెసర్ సూర్యప్రకాశ్, నాక్ డైరెక్టర్ పీటర్‌లను థర్డ్ పార్టీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి.
అక్రమాలను థర్డ్ పార్టీ ద్వారా నిగ్గు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. థర్డ్ పార్టీ విచారణకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఖరారు చేసింది. అవి ఇలా ఉన్నాయి..
- శాఖలవారీగా, ప్రాజెక్టుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను థర్డ్ పార్టీ పరిశీలించాలి.
- ఒక ప్రాజెక్టు డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేక డీపీఆర్‌ను రూపొందించకుండా అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? అన్నది తేల్చాలి.
- అంచనా వ్యయాన్ని ఖరారు చేసేటప్పుడు పనుల పరిమాణాన్ని అవసరం లేకున్నా అమాంతం పెంచేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలించాలి.
- ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానంలో టెండర్ పిలిస్తే ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్ కమిటీ)ను, లంప్సమ్(ఎల్‌ఎస్)-ఓపెన్ విధానంలో టెండర్ పిలిస్తే చీఫ్ ఇంజనీర్స్ కమిటీలను సంప్రదించి అంచనా వ్యయాన్ని ఖరారు చేశారా? లేదా? అనే అంశాన్ని పరిశీలించాలి.
- టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేటప్పుడు ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించేలా నిబంధనలు విధించారా? అనే అంశాన్ని తేల్చాలి.
- నిబంధనలను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లను కట్టడి చేయడం, కుమ్మక్కు చేయడం వల్ల అధిక ధరలకు పనులు కట్టబెట్టారా? లేదా? దీనివల్ల ఖజానాకు ఎంత నష్టం? అన్నది పరిశీలించాలి.
- ఇప్పటివరకు చేసిన పనుల నాణ్యతను పరిశీలించాలి. నాణ్యతకు, పరిమాణానికి, బిల్లుల చెల్లింపులకు తేడాలుంటే వాటిని ప్రత్యేకంగా గుర్తించాలి.
- శాఖల వారీగా, ప్రాజెక్టుల వారీగా ఈ అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ స్పీకర్‌కు హైకోర్ట్ నోటీసులు
తెలంగాణ శాసన మండలిలోని కాంగ్రెస్ సభ్యులు టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనమైనట్లు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ, శాసనసభలో కాంగ్రెస్ సభ్యులను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిలువరించాలని కోరుతూ ఉభయ సభల్లోని కాంగ్రెస్ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందించిందని ఆంధ్రజ్యోతి వెల్లడిచింది.
రెండు పిటిషన్లలో ప్రతివాదులైన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశించింది.
విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మంగళవారం ఈ రెండు పిటిషన్లు విడివిడిగా విచారణకు వచ్చాయి. సీఎల్పీని టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేస్తూ జారీచేసిన బులిటెన్‌ను సవాల్ చేస్తూ తాజాగా మరో వ్యాజ్యం వేశామని, అది బుధవారం విచారణకు రావాల్సి ఉందని, మూడింటినీ కలిపి బుధవారం విచారించాలని కాంగ్రెస్ పార్టీ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
అందుకు అదనపు ఏజీ జె.రామచంద్రరావు అడ్డు చెప్పారు. ఈ వ్యాజ్యాల్లో సీనియర్ న్యాయవాది హాజరవుతారని, అత్యవసరంగా వినాల్సిన అవసరం లేదని, ఈ వ్యాజ్యాలను జూలైకి వాయిదా వేయాలని కోరారు. అదన పు ఏజీ చెబుతున్న సీనియర్ న్యాయవాది ఈ కోర్టులోనే ఉన్నారని జంధ్యాల కోర్టు దృష్టికి తెచ్చా రు. మరోపక్క 12 మంది సభ్యుల విలీనాన్ని ధ్రువీకరిస్తూ స్పీకర్ విడుదల చేసిన బులెటిన్‌ను సవాలు చేస్తూ సీఎల్పీ నేత భట్టి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
మండలిలో సీఎల్పీని టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేస్తూ మండలి కార్యదర్శి డిసెంబ రు 21న జారీచేసిన బులిటెన్‌ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్పందించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ట్రైబ్యునల్ చైర్మన్ హోదాలో శాసన మండలి చైర్‌పర్సన్‌కు, శాసనసభ కార్యదర్శికి, ఎన్నికల సంఘానికి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, కె.దామోదర్‌రెడ్డి, టి.సంతోష్‌కుమార్, ఆకుల లలితలకు నోటీసులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, KCR/FB
‘గ్రామస్వరాజ్యమే లక్ష్యం’
అభివృద్ధిలో తెలంగాణరాష్ట్రంలోని ప్రతి గ్రామం ఒక గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్‌గా తయారుకావాలని, ఈ మార్పు ఆరునెలల్లో రావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.
పంచాయతీరాజ్ ఉద్యమస్ఫూర్తితో గ్రామస్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతిసాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ ఉద్యమం, సహకార ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని గుర్తుచేసిన సీఎం.. ఆ ఉద్యమానికి పూర్వవైభవం రావాలని ఆకాంక్షించారు. నిర్దేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషిచేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్తులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరుచేయనున్నట్లు ప్రకటించారు. జెడ్పీ చైర్‌పర్సన్లకు కొత్త కార్లు కొనిస్తామని చెప్పారు.
కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, వైస్‌చైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణాకార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం జిల్లాస్థాయిలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు కూడా శిక్షణనిస్తామని చెప్పారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్ధిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలులో పరిషత్ ప్రజాప్రతినిధులు ముఖ్యభూమిక పోషించాలని కోరారు.
కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకషంగా వివరించారు.
‘‘జిల్లా పరిషత్ చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు పనిచేయబోయే ఈ ఐదేండ్లకాలంలో మంచిపేరు తెచ్చుకోవాలని, మీకు పనిచేసే ధైర్యాన్ని, అభినివేశాన్ని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరింకా ఉన్నత పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు లభించిన పదవిని ఎంత గొప్పగా నిలబెట్టుకుంటే అంతమంచిది. ఎవరూ పుట్టినప్పుడే అన్నీ నేర్చుకోలేదు. పరిస్థితులనుబట్టి నేర్చుకుంటూపోతారు. మనిషి చివరిశ్వాస విడిచేవరకు కూడా జ్ఞానసముపార్జన చేసుకుంటూపోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ కాస్త సమయంలోనే మంచిపేరు తెచ్చుకోవాలి. అజ్ఞాని ఏ రోజైనా జ్ఞాని కాగలుగుతాడు కానీ, మూర్ఖుడు జ్ఞానికాలేడు. వాడు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు. అలాకాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నవారే తాము ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలరు. అన్ని విషయాల్లాగానే పంచాయతీరాజ్ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి’’ అని సీఎం అన్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.NCBN.OFFICIAL
మొదట జగన్ ... తర్వాత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసనసభ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయని ఈనాడు వెల్లడించింది. మొదటి రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి.
మొత్తం ఐదు రోజులపాటు సమావేశాలు జరిగే అవకాశముంది. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు. బుధవారం ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకటఅప్పలనాయుడు శాసన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
మొదట ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగతా సభ్యుల ప్రమాణ స్వీకార ప్రక్రియ కొనసాగుతుంది. శాసనసభాపతి ఎంపిక గురువారం జరుగుతుంది.
శుక్రవారం ఉభయసభలను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. ఈ నెల 15, 16 తేదీల్లో సమావేశాలకు విరామం ఉంటుంది. మళ్లీ ఈ నెల 17, 18 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి.
ఆ రెండు రోజులు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. మళ్లీ జులైలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. గత సభలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కిచ్చిన ఛాంబర్‌ని ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకి కేటాయించారు.
గతంలో లోకేష్ కార్యాలయాన్ని తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయానికి కేటాయించారు. గత సభలో వైసీపీ శాసనసభ పక్ష కార్యాలయం, తెలుగుదేశం శాసనసభ పక్ష కార్యాలయం, అలాగే ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌కు కేటాయించిన ఛాంబర్‌లను ప్రస్తుతం వైసీపీ తీసుకుందని ఈనాడు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- రాజ్‌నాథ్ సింగ్ బీజేపీకి కొత్త చిక్కుముడిలా మారారా: అభిప్రాయం
- యూట్యూబ్ ప్రాంక్: బిస్కెట్లలో టూత్‌పేస్టు.. 15 నెలలు జైలు, 15 లక్షలు జరిమానా
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- నాసా: అంతరిక్ష కేంద్రంలో హాలిడే.. పర్యాటకులకు అనుమతి.. ఒక రాత్రికి అద్దె రూ. 24 లక్షలు
- ఆపరేషన్ బ్లూ స్టార్: స్వర్ణ మందిరంలోకి భారత యుద్ధ ట్యాంకులు ప్రవేశించగానే ఏం జరిగింది
- ఇమ్రాన్ ఖాన్ కొండచిలువ చర్మంతో చేసిన చెప్పులు వేసుకుంటారా
- ‘100 మందిని చంపేసి నదిలో పడేశారు’.. సూడాన్ నరమేధం
- ఈవిడ షాపింగ్ బిల్లు రూ.140 కోట్లు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








