'మోదీ కేదార్‌నాథ్ యాత్ర ఎన్నికల కోడ్ ఉల్లంఘనే...' ఈసీకి ఫిర్యాదు చేసిన తృణమూల్

మోదీ కేదార్‌నాథ్

ఫొటో సోర్స్, BJP

లోక్‌సభ ఎన్నికల చివరి దశ ప్రచారం ముగిసన తర్వత ప్రధాన మంత్రి కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లారు.

ఆయన ఈ పర్యటనను టీవీ ఛానళ్లన్నీ చూపిస్తున్నాయి, దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది ప్రవర్తనా నియమావళిని బహిరంగంగా ఉల్లంఘించినట్లే అని ఆరోపించింది.

ఎన్నికల సంఘం దీనిని నిర్లక్ష్యం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

ఈసీకి లేఖ రాసిన పార్టీ నేత డెరెక్ ఓ బ్రయన్ ప్రధాన మంత్రి పర్యటన గురించి చానళ్లు కథనాలు ప్రసారం చేయడంపై తాత్కాలిక నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.

ఆయన ఈ లేఖలో "ప్రధాన మంత్రి తన పర్యటనలో కేదార్‌నాథ్ ఆలయం కోసం తయారుచేసిన మాస్టర్ ప్లాన్ ప్రకటించారు, అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. ఇది పూర్తిగా తప్పు, అనైతికం. ఇది ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనే" అన్నారు.

"ఆయన ఈ పర్యటనలో ప్రతి నిమిషం గురించి ప్రజలకు చెబుతున్నారు. ఎలాగోలా ఓటర్లను ప్రభావితం చేయాలనే లక్ష్యంతో అలా చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మోదీ నినాదాలు కూడా వినిపిస్తున్నాయి." అన్నారు.

మోదీ కేదార్‌నాథ్

ఫొటో సోర్స్, TMC

ప్రధాన మంత్రి శనివారం కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 17 గంటలు గడిపారు. అక్కడ పూజ చేశాక, గుహలో ధ్యానం చేశారు.

అక్కడ మీడియాతో మాట్లాడిన ప్రధాని "నేను ఉంటున్న గుహకు నేరుగా ఉన్న శివుడిని 24 గంటలూ దర్శించుకోవచ్చు. ఒక విధంగా నేను దేశంలో ప్రస్తుత వాతావరణానికి పూర్తిగా దూరంగా, ఏకాంతంగా ఉన్నాను. అక్కడ మమేకం అయ్యాను. ఎవరితోనూ సంప్రదింపులు కూడా లేవు" అన్నారు.

"ఇక్కడ మా అభివృద్ధి మిషన్ ప్రసూతి, పర్యావరణం, పర్యాటక రంగం. ఇక్కడివరకూ చేరుకోడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేస్తాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభివృద్ధి పనుల గురించి తెలుసుకుంటూ ఉంటాను".

తృణమూల్ నేత డెరెక్ ఓ బ్రయాన్ తన లేఖలో ఎన్నికల సంఘం పనితీరుపై కూడా ప్రశ్నలు సంధించారు. "ప్రజాస్వామ్య ప్రక్రియపై నిఘా ఉంచే అత్యున్నత సంస్థ అయిన భారత ఎన్నికల సంఘం, మోదీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘనపై కళ్లుమూసుకుంది" అన్నారు.

మోదీ కేదార్‌నాథ్

ఫొటో సోర్స్, BJP

"దీనిపై త్వరగా విచారణ జరిపించాలని, ఆ పర్యటన గురించి ప్రసారాలు చేయడంపై నిషేధం విధించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను" అన్నారు.

కేదార్‌నాథ్ పర్యటన సమయంలో "ఎన్నికల్లో విజయం లభించాలని కోరడానికి ఇక్కడికి వచ్చారా" అని మీడియా మోదీని ప్రశ్నించింది.

సమాధానంగా నరేంద్ర మోదీ "నేను ఎప్పుడూ ఏదీ అడగను. కోరికలు కోరే ధోరణి నాకు నచ్చదు. ఎందుకంటే ఆయన(దేవుడు) మిమ్మల్ని కోరుకోవడానికి సృష్టించలేదు, ఇవ్వడానికే సృష్టించాడు.

కేదార్‌నాథ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ప్రధాన మంత్రి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ప్రధాన మంత్రి కేదార్ నాథ్ పర్యటనకు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)