కమల్‌నాథ్: ఇందిరాగాంధీకి మూడో కొడుకులాంటివారు

కమల్ నాథ్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, ప్రదీప్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు.

గురువారం రాత్రి 11 గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్ ఎంపికైనట్లు కాంగ్రెస్ ట్విటర్ ద్వారా తెలిపింది.

మధ్యప్రదేశ్ ట్విటర్ హ్యాండిల్ కూడా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు తెలిపింది.

దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గత రెండ్రోజులుగా ఆరాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే విషయం గురించి జరుగుతున్న చర్చలకు తెరపడింది.

అంతకు ముందు రోజు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. తర్వాత భోపాల్ వెళ్లిపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గవర్నర్‌కు కమల్‌నాథ్ ఈ-మెయిల్

ఫలితాలు వచ్చాక తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కమల్ నాథ్ గవర్నర్‌కు ఈ-మెయిల్ (ఫ్యాక్స్ పంపాలని అనుకోలేదు) పంపారు.

తర్వాత రోజు ఉదయం మొత్తం 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు గవర్నర్‌కు లేఖ పంపించారు. ఇది 71 ఏళ్ల కమల్‌నాథ్ రాజకీయ వ్యూహాల పదునెంతో చూపిస్తుంది.

గవర్నరుకు పంపిన లేఖలో బీజేపీ నుంచి గెలిచిన 109 ఎమ్మెల్యేలు మినహా మిగతా వారందరూ తమవైపే ఉన్నట్లు కమల్‌నాథ్ స్పష్టం చేశారు.

అంతకు ముందు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. అందరూ చర్చించిన తర్వాత మ్యాజిక్ ఫిగర్ అందుకోలేమని భావించారు.

కమల్ నాథ్

ఫొటో సోర్స్, FACEBOOK/KAMALNATH

ఏడు నెలల్లో కమల్‌నాథ్ అద్భుతం

మధ్యప్రదేశ్ రాజకీయాలను బాగా దగ్గరి నుంచి చూసినవారు, రాష్ట్ర ఎన్నికల్లో అద్భుతం జరిగిందంటే అది కేవలం కమల్‌నాథ్ వల్లే అంటారు.

కేవలం 7 నెలల ముందే కమల్‌నాథ్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆరెస్సెస్, హిందుత్వ రాజకీయాలకు కోటగా నిలిచిన మధ్యప్రదేశ్‌లో నరేంద్ర మోదీ-అమిత్‌ షా వ్యూహాలతోపాటు శివరాజ్ సింగ్ చౌహాన్‌ పాపులారిటీ కూడా పనిచేయకుండా చేశారు.

కమల్ నాథ్ గురించి బాగా తెలిసిన సీనియర్ జర్నలిస్ట్ ఆలోక్ మెహతా "కమల్‌నాథ్ ప్రత్యేకత అదే. ఆయనకు అందర్నీ కలుపుకుని వెళ్లడం, మంచి ఫలితాలు ఇవ్వడం తెలుసు" అన్నారు.

దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా లాంటి వారి మధ్య సఖ్యత తీసుకురావడంతోపాటు అందర్నీ ఒకేతాటిపైకి తెచ్చిన కమల్‌నాథ్ 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు.

2018 ఏప్రిల్ 26న మధ్యప్రదేశ్ బాధ్యతలు తీసుకున్న కమల్‌నాథ్ భోపాల్‌లో ఉంటూ మొదట పార్టీ కార్యాలయాన్ని చక్కదిద్దారు. దాన్ని కొత్తగా కనిపించేలా చేయడంతోపాటు లోపల సంజయ్ గాంధీ ఫొటో కూడా పెట్టించారు.

కమల్ నాథ్

ఫొటో సోర్స్, FACEBOOK/KAMALNATH

కమల్‌నాథ్ లో ప్రొఫైల్

కమల్‌నాథ్ సామర్థ్యం, అర్హత విషయంలో ఆయన ప్రత్యర్థులకు కూడా ఎలాంటి సందేహం ఉండదు. ఆయన స్వయంగా చాలా లో ప్రొఫెల్లో ఉంటారు.

గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం, 50 ఏళ్ల రాజకీయ జీవితం, వందల కోట్ల పారిశ్రామిక సామ్రాజ్యం, ఆయనపై ఈ స్థాయిలో చర్చ జరగడానికి కారణమైంది.

నిజానికి కమల్‌నాథ్ సంజయ్ గాంధీకి స్కూల్ వయసు నుంచే మిత్రుడు. వీరి స్నేహం డూన్ స్కూల్ నుంచి మొదలైంది.

మారుతీ కారు తయారు చేయాలనే కల దగ్గరి నుంచి యూత్ కాంగ్రెస్ రాజకీయాల వరకూ చేరుకుంది.

జర్నలిస్ట్ వినోద్ మెహతా తన 'సంజయ్ గాంధీ-అన్‌టోల్డ్ స్టోరీ' పుస్తకంలో "సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోని సిద్ధార్థ్ శంకర్ రే, ప్రియరంజన్ దాస్‌మున్షీకి పోటీ ఇవ్వడానికి కమల్‌నాథ్‌ను దించాడు" అని చెప్పారు.

అంతే కాదు, ఎమర్జెన్సీ తర్వాత సంజయ్ గాంధీని అరెస్ట్ చేసినపుడు, ఆయనకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసుకోడానికి, జడ్జితో దురుసుగా ప్రవర్తించి కమల్‌నాథ్ తీహార్ జైలుకు కూడా వెళ్లారు.

అందుకే ఆయన ఇందిరాగాంధీ దృష్టిలో పడ్డారు. 1980లో కాంగ్రెస్ మొదటిసారి కమల్‌నాథ్‌కు మధ్యప్రదేశ్ ఛింద్వాడాలో టికెట్ ఇచ్చింది.

ఆయన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన ఇందిరాగాంధీ ఓటర్లతో "మీరు కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌కు ఓటు వేయండని నేను అడగను. మీరు నా మూడో కొడుకు కమల్‌నాథ్‌కు ఓటు వేయాలని అడుగుతున్నాను" అన్నారు.

కాంగ్రెస్‌ను చాలా కాలం నుంచీ కవర్ చేస్తున్న ఎన్డీటీవీ ఇండియా పొలిటికల్ ఎడిటర్ మనోరంజన్ భారతి "సంజయ్ గాంధీ, కమల్‌నాథ్ ఇద్దరూ ఇందిరాగాంధీకి రెండు చేతుల్లాంటి వారని కూడా జనం అప్పట్లో చెప్పుకునేవారు" అన్నారు.

కమల్ నాథ్

ఫొటో సోర్స్, FACEBOOK/KAMALNATH

మొదటిసారి ఎక్కడ నుంచి గెలిచారు

1980లో మారుమూల ఆదివాసీ ప్రాంతం నుంచి గెలిచిన కమల్‌నాథ్ ఛింద్వాడా చిత్రాన్ని పూర్తిగా మార్చేశారు.

ఆ ప్రాంతం నుంచి 9 సార్లు ఎంపీ కావడంతోపాటు ఆయన అక్కడ స్కూల్-కాలేజ్, ఐటీ పార్క్ కూడా ఏర్పాటు చేశారు.

అంతే కాదు, స్థానికులకు ఉపాధి, పనులు లభించాయి. దానికోసం ఆయన వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, హిందుస్తాన్ యూనిలీవర్ లాంటి కంపెనీలు తెరిపించారు. దానితోపాటు క్లాత్ మేకింగ్ ట్రైనింగ్, డ్రైవర్ డ్రైనింగ్ లాంటివి కూడా ఇప్పించాడు.

సంజయ్ గాంధీ మరణం, ఇందిరాగాంధీ హత్య తర్వాత కమల్‌నాథ్ రాజకీయ కెరీర్‌పై ప్రభావం పడింది. కానీ ఆయన కాంగ్రెస్, గాంధీ కుటుంబం పట్ల నిబద్ధతతో ఉండేవారు.

1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైన తర్వాత సిక్కుల వ్యతిరేక అల్లర్లలో ఆయన పేరు కూడా వచ్చింది. కానీ సజ్జన్‌ కుమార్, జగదీష్ టైట్లర్ లాంటి నేతల్లా ఇందులో ఆయన పాత్ర స్పష్టం కాలేదు.

1984 నవంబర్ 1న న్యూ దిల్లీ గురుద్వారా రకాబ్‌గంజ్‌లో జనం ఇద్దరు సిక్కులను సజీవ దహనం చేసినప్పుడు కమల్‌నాథ్ అక్కడ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.

కమల్ నాథ్

ఫొటో సోర్స్, EPA

కమల్‌నాథ్ కూడా ఆ సమయంలో తను అక్కడ లేనని ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడు తనను పార్టీనే అక్కడకు పంపించిందని ఆయన ఎన్నోసార్లు మీడియాకు చెప్పారు.

"గురుద్వారా ముందు జనం ఉన్నారు. నేను వాళ్లు దాడి చేయకుండా ఆపుతున్నాను. జనాన్ని అదుపు చేయాలని పోలీసులు నన్ను అడిగారు" అని కమల్‌నాథ్ చెప్పారు.

1984 అల్లర్లలో సిట్ దర్యాప్తు, రంగనాథ్ మిశ్రా కమిషన్ ఎంక్వైరీ, జీటీ నానావతి కమిషన్‌ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు.

1984 సిక్కు అల్లర్లు, 1996 హవాలా కుంభకోణం వల్ల అపవాదులు వచ్చాయి అనుకుంటే ఏళ్ల తరబడి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన కమల్‌నాథ్ పేరు ఎలాంటి వివాదాల్లో చిక్కుకోలేదు.

ఆయనపై ఇతర అవినీతి ఆరోపణలు కూడా ఏవీ లేవు.

కమల్‌నాథ్ పర్యావరణ, పట్టణాభివృద్ధి, కామర్స్ అండ్ ఇండస్ట్రీ లాంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు.

కమల్ నాథ్

ఫొటో సోర్స్, FB/KAMALNATH

కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేత

దిల్లీలో కమల్‌నాథ్ ఇల్లు, ఆఫీస్ 24 గంటలూ కార్యకర్తల కోసం తెరిచి ఉంటుంది. ఎవరైనా చిన్న కార్యకర్త ఏదైనా పనికోసం వచ్చినా కమల్‌నాథ్ దగ్గరుండి అది పూర్తి అయ్యేలా చూసుకుంటారు. ఇప్పుడు అదే ఆయనకు బలంగా మారింది.

కానీ తన ఇమేజ్‌ కారణంగా కమల్‌నాథ్ ఎప్పటికీ శివరాజ్ సింగ్ చౌహాన్ అంత సాదాసీదాగా ఉండలేరు. శివరాజ్ రాత్రి ఒంటిగంటకు కూడా కార్యకర్తలను రిసీవ్ చేసుకోగలరు. తన ఇంట్లోనే ఆహార ఏర్పాట్లు చేయించగలరు. కానీ కార్పొరేట్ శైలిలో ఉండే కమల్‌నాథ్ శివరాజ్ దరిదాపుల్లోకి కూడా రాలేరు.

కుడిచేత్తో ఏం చేస్తున్నారో ఎడమచేతికి కూడా తెలీనంత షార్ప్‌గా కమల్‌నాథ్ ఉంటారని కూడా కొందరు చెబుతారు.

అయితే ఆయన ఒక్కసారిగా ఏ స్టాండ్ తీసుకోలేరని, ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉండాలని భావిస్తారనే విమర్శలూ ఉన్నాయి.

ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో గత 15 ఏళ్లలో ఆయన ఎప్పుడూ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను విమర్శించలేదు.

"అది కమల్‌నాథ్ శైలి, ఆయనకు పని చేయడం, చేయించడం కూడా తెలుసు. కమల్‌నాథ్‌కు ఒక మిషన్ ఇచ్చారు. చాలా కష్టం అనుకున్న ఆ లక్ష్యాన్ని కూడా ఆయన అందుకుని చూపించారు" అని మనో రంజన్ భారతి చెబుతారు.

కమల్‌నాథ్ చురుగ్గా ఉండడంలో ఆయన సలహాదారుడు, సహచరుడు ఆర్కే మిక్లానీకి కూడా భాగం ఉంది. ఆయన గత 38 ఏళ్లుగా కమల్‌నాథ్ అసిస్టెంట్‌గా ఉన్నారు.

"కమల్‌నాథ్ తను ఇచ్చిన మాటను ఎప్పటికీ మర్చిపోరని" ఆయన చెబుతారు. అందుకే మధ్యప్రదేశ్ ప్రజలకు చేసిన హామీలను కూడా ఆయన మర్చిపోరనే అందరూ ఆశిస్తున్నారు.

రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్

ఫొటో సోర్స్, afp/Getty Images

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం, కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఆయనకు కలిసొచ్చాయి.

ముగ్గురు ప్రధానుల హయాంలో మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అశోక్ గెహ్లాట్ ఒకరు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు కేబినెట్లలో ఆయన మంత్రిగా పనిచేశారు.

అర్ధశాస్త్రంలో పట్టభద్రుడైన గెహ్లాట్ స్వస్థలం జోధ్‌పూర్. విద్యార్థి జీవితం నుంచే ఆయన రాజకీయ, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

1980లో జోధ్‌పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రోత్సహించడం, ప్రచారం చేయడంలో గెహ్లాట్ పనితీరును గుర్తించిన అధిష్టానం చిన్న వయసులోనే ఆయనకు పెద్ద పదవి కట్టబెట్టింది.

అశోక్ గెహ్లాట్

ఫొటో సోర్స్, Ashok/fb

1985లో ఆయనను రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. అప్పుడు ఆయన వయసు 34 ఏళ్లు.

2004న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.

అదే ఏడాది హిమాచల్‌ప్రదేశ్ మరియు చత్తీస్‌గఢ్ రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించింది.

ఇటీవల గుజరాత్ ఎన్నికల సమయంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా గెహ్లాట్ పనిచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)