శక్తికాంతా దాస్: ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా నియామకం

ఉర్జిత్ పటేల్‌తో శక్తికాంతా దాస్

ఫొటో సోర్స్, Getty Images

మాజీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంతా దాస్ ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు.

శక్తికాంతా దాస్ ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్‌లో సభ్యుడు. జీ20 దేశాల సదస్సులో ఆయన భారత ప్రతినిధిగా కూడా ఉన్నారు.

2015-17 మధ్య ఆయన కేంద్ర ఆర్థిక వ్యవహారాల సెక్రటరీగా ఉంటూ ఆర్బీఐ‌తో కలిసి పనిచేశారు.

మొదట రెవెన్యు విభాగం బాధ్యతలు చూసుకునేందుకు ప్రధాని మోదీ ఆయన్ను ఆర్థిక మంత్రిత్వ శాఖలోకి తీసుకొచ్చారు. ఆ తరువాత ఆయన్ను ఆర్థిక వ్యవహారాల శాఖకు మార్చారు. మోదీ ప్రవేశపెట్టిన పెద్ద నోట్లు రద్దును ముందుకు తీసుకువెళ్లింది శక్తికాంతా దాసే.

ఆయన సుదీర్ఘ కెరీర్‌లో తమిళనాడు పరిశ్రమల శాఖ సెక్రెటరీగా, తమిళనాడు న్యూస్‌ ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ ఛైర్మన్, డైరెక్టర్‌గా, ఎల్‌ఐసీ డైరెక్టర్‌గా... ఇలా అనేక శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

2017 మేలో ఒక రూపాయి నోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ నోట్లపైన శక్తికాంతా దాస్ సంతకమే ఉంది.

1957లో ఒడిశాలో పుట్టిన శక్తికాంతా దాస్, 1980లో ఐఏఎస్‌లో చేరారు. మొదట తమిళనాడు క్యాడర్‌లో బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆయన సన్నిహితంగా ఉండేవారు.

మోదీ ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రాకు కూడా దాస్ చాలా సన్నిహితుడు.

పెద్ద నోట్ల రద్దు వెనక ఉన్న ముగ్గురు కీలక వ్యక్తల్లో శక్తికాంతా దాస్ ఒకరు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)