విజయ్ మాల్యాను వెంటనే భారత్‌కు రప్పించడం సాధ్యమేనా?

ఫొటో సోర్స్, AFP
భారతదేశంలో వివిధ బ్యాంకుల వద్ద తీసుకున్న రూ. 9 వేల కోట్లకు పైగా రుణాన్ని ఎగవేసి లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు న్యాయమూర్తి అనుమతిచ్చారు.
అయితే దీనర్థం వెంటనే మాల్యాను భారత్‌కు తీసుకొచ్చే వీలుంటుందని కాదు. మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అపీల్ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల సమయం ఉంటుంది.
ఒకవేళ ఆయన హైకోర్టులో అపీల్ చేసుకోకపోతే, ఆ దేశ విదేశాంగ మంత్రి మాల్యాను భారత్‌కు అప్పగించడానికి అంగీకరిస్తే, 28 రోజుల లోపల మాల్యాను భారత్‌కు తరలిస్తారు.
కోర్టులో హాజరవడానికి ముందు మాల్యా మాట్లాడుతూ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా తమ లీగల్ టీం దాన్ని విశ్లేషించి అవసరమైన ముందడుగు వేస్తుందని అన్నారు. ‘నేను బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను చెల్లిస్తానని ట్వీట్ చేశాను. అలాగే నా ఉద్యోగులకు బకాయిపడ్డ జీతాలను కూడా చెల్లించాలనుకుంటున్నా. అప్పు తీర్చాలనుకుంటున్న నా నిర్ణయానికి, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రెండూ వేర్వేరు విషయాలు’ అని మాల్యా పేర్కొన్నారు.
విజయ్ మాల్యా 2016 మార్చిలో భారత్‌ను వదిలి బ్రిటన్ వెళ్లిపోయారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆయన పైన ఆరోపణలున్నాయి.
ఆయన చెల్లించాల్సిన మొత్తం రుణం దాదాపు 10వేల కోట్ల రూపాయలని చెబుతారు. ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతబడింది.

ఫొటో సోర్స్, AFP
ఒకవేళ మాల్యాను భారత్‌కు తీసుకొస్తే ఆయన్ను ముంబయిలోని అర్థర్ రోడ్ జైల్లో 12వ నంబర్ బ్యారక్‌లో పెడతారు. కేసు విచారణ సమయంలో ఈ జైలు కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఆ జైల్లో కనీస వసతులు కూడా ఉండవని మాల్యా తరఫు న్యాయవాదులు అపీల్ చేశారు. దాంతో, జైలుకు సంబంధించిన వీడియోను భారత ప్రభుత్వం అందించాలని కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఆదేశించారు.
సెప్టెంబర్ 12న విజయ్ మాల్యా మరో ప్రకటనతో కలకలం సృష్టించారు. 2016లో భారత్ వదిలి వెళ్లే ముందు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని మాల్యా పాత్రికేయులతో చెప్పారు. కానీ, జైట్లీ ఆ ఆరోపణలను ఖండించారు.
ఒకవేళ మాల్యాను భారత్‌కు తరలించే ప్రక్రియ విషయంలో న్యాయమూర్తి సంతృప్తి చెందితే, ఆయన్ను భారత్‌కు అప్పగించే విషయంలో ఎలాంటి చట్ట పరమైన ఇబ్బందులు లేకపోతే ఆ ఉత్తర్వులను బ్రిటన్ విదేశాంగ మంత్రి దగ్గరకు పంపిస్తారు. ఆ తరువాత ఉత్తర్వులపై నిర్ణయం తీసుకునే అధికారం మంత్రి చేతుల్లోనే ఉంటుంది.
భారత ప్రభుత్వం మాల్యాను వెనక్కు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం లండన్ కోర్టులో భారత అధికారులు పోరాడుతున్నారు. 13 బ్యాంకులు కూడా మాల్యాకు ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మాల్యాను గతేడాది ఏప్రిల్‌లోనే ‘ప్రత్యర్పణ వారెంటు’పై అరెస్టు చేశారు. ఆ తరువాత కాసేపటికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇవి కూడా చదవండి:
- ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా
- తెలంగాణ ఎన్నికలు: ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుంది?
- తెలంగాణ ఎన్నికలు: 64 నియోజకవర్గాల్లో 5 శాతం కన్నా ఎక్కువ పెరిగిన ఓటింగ్
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- రామమందిరం నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుందా?
- కృష్ణా జిల్లా: స్వైన్ ఫ్లూ రోగులు ఉన్నారని ఊరినే వెలివేశారు
- క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








