డేరాబాబా: ఏడాది జైలు శిక్షా కాలంలో సంపాదన రూ.6వేలు

రామ్ రహీమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సత్ సింగ్
    • హోదా, బీబీసీ కోసం

డేరా బాబాగా పేరున్న డేరా సచ్ సౌదా నిర్వాహకుడు రామ్ రహీమ్‌కు విధించిన 20ఏళ్ల జైలు శిక్షలో ఏడాది పూర్తవుతోంది. ఈ క్రమంలో ఆయన జైల్లో 20కేజీల బరువు తగ్గారు. తన మహిళా భక్తులపై డేరా బాబా అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన రెండు కేసుల్లో ఆయనకు ఈ శిక్ష విధించారు.

2017 ఆగస్టు 25న సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను అత్యాచార కేసుల్లో దోషిగా ప్రకటించగా, ఆగస్టు 28న శిక్షను ఖరారు చేసింది.

హరియాణా ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో డేరా బాబా అధీనంలో ఉన్న ఆస్తుల విలువ రూ.1600 కోట్లు దాకా ఉంటుంది.

హరియాణాలోని రోహ్‌తక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా, జైల్లో నిరంతర శ్రమతో పాటు నియమాలకు అనుగుణంగా అందిస్తున్న సాదాసీదా ఆహారం వల్ల చాలా సన్నగా మారారు. జైల్లో రోటీ, పప్పుతో పాటు అప్పుడప్పుడూ స్వీట్లు పెడతారు.

జైలు జీవితంలో భాగంగా ఆయన పొలం పనులు చేయడంతో పాటు చెట్లకు నీళ్లు పోస్తూ కూరగాయల సాగు చేస్తున్నారు. గతేడాది పంచ్‌కులా సీబీఐ కోర్టు డేరా బాబాకు శిక్ష విధించేనాటికి ఆయన బరువు 104. కానీ ప్రస్తుతం 84కిలోలకు చేరుకున్నారు.

హై ప్రొఫైల్ ఖైదీ అయిన కారణంగా 51ఏళ్ల డేరా బాబాకు 10x12 వైశాల్యంలో ఉండే గదిని కేటాయించారు. దాన్ని ఆయన మరో ముగ్గురు ఖైదీలతో కలిసి పంచుకుంటారు. విచారణ ఎదుర్కొంటున్నవారు, ఇతర ఖైదీలు ఆయన్ను కలుసుకోకుండా గది బయట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

రామ్ రహీమ్

ఫొటో సోర్స్, Getty Images

జైలు నుంచి బయటకు వచ్చిన కొందరు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు మీడియాతో మాట్లాడుతూ, జైలు లోపల డేరా బాబాకు వీఐపీ ట్రీట్‌మెంట్ అందుతోందని ఆరోపించారు. కానీ, జైలు అధికారులు మాత్రం ఆయన్ను అందరు ఖైదీల్లానే చూస్తున్నామని చెప్పారు.

ఎప్పుడూ నల్లగా, గుబురుగా పెరిగి కనిపించే డేరాబాబా మీసం, గెడ్డం ఇప్పుడు సగం తెల్లబడిందని, రోజూ కూరగాయల సాగు చేస్తుండటంతో ఆయన కాస్త ఫిట్‌గానూ మారారని జైలు అధికారి ఒకరు చెప్పారు.

‘కఠినమైన జైలు జీవితానికి అలవాటుపడటం ఆయనకు మొదట్లో కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈగలు, దోమల్లాంటివి ఆయనను ఇబ్బంది పెట్టట్లేదు’ అని ఆ అధికారి చెప్పారు.

వేసవి ప్రారంభంలో ఆయన జైలు గదికి కూలర్ కావాలని డిమాండ్ చేశారు. కానీ జైలు నిబంధనలు ఒప్పుకోకపోవడంతో ఆయనకు కూలర్ కేటాయించలేదు. వారానికి ఓసారి ఆయన్ను కలుసుకోవడానికి 10మంది దగ్గరి వ్యక్తులు జైలుకు వస్తుంటారు.

‘అందరు ఖైదీల్లానే ఆయన జైల్లో పనిచేస్తున్నారు. రోజూ ఆయనకు 20 రూపాయల కూలీ అందుతుంది. ఆదివారాలు, గెజిట్ సెలవుల్ని పక్కనబెడితే ఆయన ఇప్పటివరకు రూ.6వేల దాకా సంపాదించారు’ అని ఆ అధికారి చెప్పారు.

డేరా బాబాకు జైల్లో రెండు జతల కుర్తా-పైజమాలు ఇచ్చారు. కానీ తన వాళ్లను, లాయర్లను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు, ఇతర కేసుల విచారణ కోసం కోర్టుకు హాజరైనప్పుడు ఆయన తన సొంత దుస్తులను వేసుకోవచ్చు.

తన భక్తులపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నారు

ఫొటో సోర్స్, HONEYPREETINSAN.ME

ఫొటో క్యాప్షన్, తన భక్తులపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నారు

ఆయన ఉదయం 6గంటలకు నిద్రలేచి టీ తాగుతారు. 8గం.కు అల్పాహారం తీసుకొని వాతావరణాన్ని బట్టి తోటలో పనిచేయడానికి బయటకు వెళ్తారు. మధ్యాహ్నం 1గం.కు భోజనం చేసి సాయంత్రం 5 వరకు విశ్రాంతి తీసుకుంటారు.

సాయంత్రాలు ఖైదీలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ డేరాబాబా మాత్రం పుస్తకాలు చదువుతూనో, కవితలు రాస్తూనో తన గదిలోనే కాలక్షేపం చేస్తారు.

తాను విచారణ ఎదుర్కొంటున్న కేసుల స్టేటస్‌ను తెలుసుకోవడానికి మినహా ఆయన జైలు భద్రతా సిబ్బందితో ఎక్కువగా మాట్లాడరు. తన గదిలోని తోటి ఖైదీలతో కూడా అరుదుగా సంభాషిస్తారు.

బాబా భక్తులు హైవే దగ్గర ఆగి, ఆయన ఉన్న జైలు దిక్కుగా నిలబడి నమస్కారం చేస్తూ కనిపిస్తారు.
ఫొటో క్యాప్షన్, బాబా భక్తులు కొందరు హైవే దగ్గర ఆగి, ఆయన ఉన్న జైలు దిక్కుగా నిలబడి నమస్కారం చేస్తూ కనిపిస్తారు.

హరియాణా ఖైదీల సత్ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏడాది జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 28 తరవాత డేరాబాబాకు కూడా అందుకు అర్హత లభిస్తుంది.

శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిపై ఆధారపడ్డ వాళ్లను స్కూల్, కాలేజీలో చేర్పించాల్సి వచ్చినప్పుడు... ఖైదీ భార్యకు డెలివరీ జరగాల్సి ఉన్నప్పుడు... ఖైదీ ఇంటికి మరమ్మతు చేయాలన్నా లేక కొత్త ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినప్పుడు... ఒకవేళ ఖైదీ సోదరుడు చనిపోయుంటే, ఆ వ్యక్తి పిల్లల పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు... చట్ట ప్రకారం ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఎవరికైనా పెరోల్‌కు దరఖాస్తు చేసుకోడానికి అవకాశం ఉంటుంది.

డేరా బాబాకు సంబంధించిన కేసులను వాదిస్తున్న న్యాయవాది ఎస్‌కే నర్వానా గార్గ్ దీనిపై మాట్లాడుతూ, పెరోల్ అన్నది క్లయింట్ కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయమని, పెరోల్ విషయంపై వాళ్లే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)