పోలీసులకు సవాలుగా మారిన కొండ

నక్సల్స్ బుడా పహాడ్

ఫొటో సోర్స్, NIRAJ SINHA / BBC

ఫొటో క్యాప్షన్, హెలికాప్టర్‌లో క్షతగాత్రుల తరలింపు
    • రచయిత, నీరజ్ సిన్హా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఝార్ఖండ్ అంటే ఎత్తైన కొండలు, పచ్చటి అడవులు, నిండుగా ప్రవహించే నదులు గుర్తొస్తాయి. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గిరిజనులకు ఇవి జీవనాధారంగా నిలిచాయి.

ఇక్కడి నీళ్లు, అడవులు, భూముల కోసం దశాబ్దాల నుంచీ పోరాటాలు జరుగుతున్నాయి. వీటన్నిటి మధ్య రాష్ట్రంలో మోదుగ, లక్క, ఇప్ప చెట్లు భారీగా ఉండే పాలమూ జిల్లాలోని బూఢా పహాడ్ ప్రస్తావన వస్తే ఒక భిన్నమైన చిత్రం మన కళ్ల ముందుకొస్తుంది.

మావోయిస్టుల హింసతో బూఢా పహాడ్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల మావోయిస్టులు మందుపాతరలు పేల్చడంతో ఆరుగురు ఝార్ఖండ్ పోలీసులు మరణించారు.

పోలీసుల ఆయుధాలనూ వారు ఎత్తుకెళ్లారు. ఈ పేలుడులో పోలీసుల యాంటీ లాండ్‌మైన్ వాహనం కూడా ముక్కలైపోయింది.

నక్సల్స్ బుడా పహాడ్

ఫొటో సోర్స్, NIRAJ SINHA/BBC

బూఢా పహాడ్‌లోమావోయిస్టులు, పోలీసుల మధ్య 36 గంటలకు పైగా ఎదురుకాల్పులు జరిగాయి. కొండపై పట్టు నిలుపుకోడానికి, విముక్తి కోసం ఏడాదంతా పోరాడేందుకు ఇప్పటికీ అక్కడ మావోయిస్టులు భారీగా ఉన్నారని ఈ ఘటనతో పోలీసులకు స్పష్టంగా తెలిసింది.

పోలీసులు ఇటీవల ఈ కొండ, పరిసర ప్రాంతాల్లో భారీ ఆపరేషన్స్ నిర్వహించారు.

రాష్ట్ర పోలీసుల ప్రతినిధి ఆశిష్ బాత్రా "మావోయిస్టులు నైరాశ్యంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. వాళ్లు ఆయుధాలు వదిలి బుడా పహాడ్ విడిచిపెట్టాలి. లేదంటే ప్రాణాలు కోల్పోతారు" అన్నారు. ఈ ఏడాది 22 మంది మావోయిస్టులను హతమార్చామని.. అది కూడా వారికి ఇబ్బందిగా మారిందని పోలీసులు చెబుతున్నారు.

నక్సల్స్ బుడా పహాడ్

ఫొటో సోర్స్, NIRAJ SINHA / BBC

విశాలమైన బూఢా పహాడ్

పాలమూలోని గడ్వా-లాతేహార్‌లో చేరలేని ప్రాంతంలో ఉన్న ఈ కొండ సరిహద్దులు ఛత్తీస్‌గఢ్ వరకూ ఉంటాయి. నక్సలైట్లపై ఒత్తిడి పెరిగినపుడు వారు ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లిపోతుంటారు.

ఝార్ఖండ్ భండారియాలోని సరువత్ పర్వతాలు లేదా బూఢా పహాడ్ వంటి ప్రాంతాల్లో మావోయిస్టులు శిక్షణ కేంద్రాలు నడుపుతుంటారు. ఈ ప్రాంతాల్లో ఝార్ఖండ్-ఛత్తీస్‌గఢ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్స్ కూడా చేపడుతుంటారు.

ఝార్ఖండ్ రాజధాని రాంచీకి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాతేహార్‌ బ్లాక్‌ మారుమూల గ్రామాల్లో ప్రారంభమయ్యే ఈ కొండ అదే జిల్లాలోని మహువాడాండ్, బర్వాహీడ్‌లోంచి గడ్వా జిల్లాలోని రామ్‌కండా, భండరియా ప్రాంతాల వరకూ వ్యాపించి ఉంది.

ఈ కొండలోని ఒక భాగానికి పాలమూలోని పులుల అభయారణ్యం కోర్ ఏరియాతో సంబంధం ఉందని స్థానిక విలేకరి సతీష్ సుమన్ చెప్పారు. ఐదేళ్ల కిందటి వరకు పాలమూలో పోలీసులు వరుస దాడులు చేయడంతో మావోయిస్టులు వ్యూహాత్మకంగా బుడా పహాడ్‌ను తమ స్థావరంగా మార్చుకునే ప్రయత్నాలు పెంచారు.

నక్సల్స్ బుడా పహాడ్

ఫొటో సోర్స్, NIRAJ SINHA / BBC

పోలీసులకు సవాలు

ప్రకృతి సౌందర్యంతో ఉండే ఆ కొండపై మళ్లీ మళ్లీ వెళ్లాలని అనిపిస్తుంది, కానీ ఆ కొండలోని ఒక పెద్ద భాగం, కొన్ని గుహలు, శిఖరాలు ఏళ్లతరబడి మావోయిస్టులకు స్థావరంగా మారాయి అని ఆయన అన్నారు.

తరచూ మావోయిస్టుల దాడులతో బుడా పహాడ్ వార్తల్లో ఉంటోంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా బుడా పహాడ్ నుంచి వారిని తరిమివేయడం పోలీసులకు సవాలుగా మారింది.

ఇటీవల మావోయిస్టులు రామ్‌కండాలో చాలా వాహనాలకు నిప్పుపెట్టారు. కొన్ని నెలల ముందు కొంతమంది గ్రామస్తులను కిడ్నాప్ చేశారు.

నక్సల్స్ బుడా పహాడ్

ఫొటో సోర్స్, NIRAJ SINHA / BBC

ఫొటో క్యాప్షన్, సెర్చ్ ఆపరేషన్‌లో లభించిన క్యాన్ బాంబులు

రిమోట్ ఐఈడీలు

మావోయిస్టుల కార్యకాలాపాలను అణచివేసే ప్రయత్నంలో ఉన్న డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ విపుల్ శుక్లా "భౌగోళికంగా చూస్తే ఈ కొండ చాలా ఎక్కువ పరిధిలో విస్తరించి ఉంది. ఆ రాతి కొండ చాలా ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలను మనం వాటి పక్కనే వెళ్తున్నా గుర్తుపట్టలేం" అని చెప్పారు.

ఈ కొండ శిఖరాలపై నిలబడడం, లేదా పైకి వెళ్లి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం అంత సులభం కాదని పోలీసులు భావిస్తున్నారు.

"అక్కడ నీళ్లు కూడా దొరకవు. అయినా చాలాసార్లు దాని పైకి వెళ్లి మేం సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాం. నక్సలైట్లు ఈ ప్రాంతంలో రిమోట్‌తో పేల్చివేసే ఐఈడీలను భారీ సంఖ్యలో అమర్చారు" అని పోలీసు అధికారులు చెబుతున్నారు.

"ఈ రిమోట్ ఐఈడీల మధ్య నుంచి వెళ్లాలనుకున్నప్పుడు నక్సలైట్లకు ఎలాంటి సమస్యా ఉండదు. కానీ పోలీసు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, వాళ్లూ దూరం నుంచే రిమోట్‌తో ఆ మందుపాతరలను పేల్చేయగలరు" అన్నారు.

నక్సల్స్ బుడా పహాడ్

ఫొటో సోర్స్, NIRAJ SINHA / BBC

ఫొటో క్యాప్షన్, సెర్చ్ ఆపరేషన్ తర్వాత తిరిగి వస్తున్న పోలీసులు

కంచుకోటలాంటి స్థావరం

ఈ కొండకు దగ్గరగా ఉన్న చాలా ప్రాంతాల్లో పోలీసు పికెట్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో మావోయిస్టులకు సమస్యలు పెరిగాయి. మరికొన్ని పికెట్లు ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

మావోయిస్టుల అగ్ర నేత అరవింద్ జీ స్థావరం కడా బుడా పహాడ్ అని భద్రతా దళాల అధికారులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన చనిపోయారని వార్తలు వచ్చాయి. పోలీసులు మాత్రం అరవింద్ అనారోగ్యానికి గురైనట్టు సమాచారం రాగానే కొండను ముట్టడించామని చెబుతున్నారు.

సీఆర్పీఎఫ్ అధికారులు ఝార్ఖండ్‌లో నక్సలైట్లపై పోరాటానికి 22 బెటాలియన్లు మోహరించామని చెప్పారు. "బుడా పహాడ్‌పై కూడా మా ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాం. పైకి ఎక్కలేని ప్రాంతాల్లో పోలీసులకు కనెక్టివిటీ సమస్య ఎదురవుతోంది" అన్నారు.

నక్సల్స్ బుడా పహాడ్

ఫొటో సోర్స్, NIRAJ SINHA / BBC

ఫొటో క్యాప్షన్, మందు పాతర పేలుడు

మరింత కష్టం!

జంషెడ్‌పూర్‌లో నియమితులైన ఎస్ఎస్‌పీ అనూప్ బిరథ్రే 2015 నుంచి 2017 వరకూ లాతేహార్ పోలీస్ సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఆయన బుడా పహాడ్‌పై ఎన్నో భారీ ఆపరేషన్లకు నేతృత్వం వహించారు.

"బూఢా పహాడ్ కింద ఉన్న నదులతో సమస్య ఎదురవుతోంది. మేం ఆపరేషన్లో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ అవసరం అవుతుంది. దూరంగా, కష్టంగా ఉండే ఆ దారుల వల్ల సపోర్ట్ పొందడంలో మాకు సమస్యలు వస్తునాయి. అయినా బుడా పహాడ్ దగ్గర చాలా తీవ్రంగా పోరాడుతున్నాం. నక్సలైట్లకు కూడా భారీ నష్టం జరిగింది". అని చెప్పారు.

అయితే, నిపుణులు మాత్రం "వర్షాకాలం నాలుగు నెలలూ ఇక్కడి నదులు పొంగితే, అడవి మరింత దట్టంగా మారితే, తర్వాత పోలీసులు ఎంత ప్రయత్నించినా ఈ కొండపై కాలు పెట్టలేరు" అని చెబుతున్నారు.

"ఆలోపు మావోయిస్టులు తమ దళాలను మరింత బలోపేతం చేసుకుంటారు. సరకులు, మందులు, బట్టలు, ఇతర వస్తువులను ముందస్తుగా సమకూర్చుకుంటారు" అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)