ప్రెస్ రివ్యూ: క్యాంపస్ నియామకాలకు ముఖం చాటేస్తున్న ఐటీ కంపెనీలు

ఫొటో సోర్స్, Getty Images
క్యాంపస్ నియామకాలకు ముఖం చాటేస్తున్న ఐటీ కంపెనీలు
ఐటీ కంపెనీలు కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు తగ్గించేయడం, కొన్ని సంస్థలు అసలు నియామకాల ఊసే ఎత్తకపోతుండటంతో విద్యార్థులు ఆందోళనలో మునిగిపోతున్నారని 'సాక్షి' ప్రత్యేక కథనం తెలిపింది.
ఐటీ కంపెనీలు ఏటా రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్‌తోపాటు ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, తిరుపతిలలో ఉన్న సుమారు వంద కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు జరుపుతుంటాయి.
కానీ ఈ ఏడాది కేవలం 25 కాలేజీల్లోనే క్యాంపస్ నియామకాలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కేవలం 15 కాలేజీలకే పరిమితంకాగా.. టీసీఎస్ 22 కాలేజీలు, విప్రో, క్యాప్‌జెమినీ కంపెనీలు హైదరాబాద్‌లోని పది కాలేజీలతో సరిపెట్టాయి.
ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, జేఎన్టీయూ, సీబీఐటీ, వాసవి తదితర ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా నియామకాలు చేపట్టే మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ యేడాది వాటి జోలికే పోలేదు. కేవలం హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ నిట్‌లకు చెందిన పది మంది విద్యార్థులకు మత్రమే ఉద్యోగాలు ఇచ్చింది.
సీబీఐటీ, వాసవి కాలేజీల్లో అత్యంత ప్రతిభావంతులైన నలుగురైదుగురు విద్యార్థులను, అది కూడా ఇంటర్న్‌షిప్ కింద ఎంపిక చేసుకుంది.
ఏటా 50 నుంచి వంద మంది విద్యార్థులను ఎంపిక చేసుకునే డెలాయిట్ సంస్థ కూడా ఈసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది.
ఇక దేశీయ కంపెనీలు గతేడాదితో పోలిస్తే 60 శాతం మేర నియామకాలు తగ్గించుకున్నాయి.
ఆందోళనలో విద్యార్థులు: ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో దాదాపు 50 శాతం మంది.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లోనే చేరారు.
కానీ ఐటీ కంపెనీలు పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుడటంతో వారు ఆందోళనలో మునిగిపోయారు.
సీబీఐటీలో గతేడాది 1,350 మందికి వివిధ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేయగా.. ఈసారి ఆ సంఖ్య 750కి లోపేకావడం గమనార్హం.
వాసవి, ఎంవీఎస్‌ఆర్, విజ్ఞానజ్యోతి, నారాయణమ్మ, శ్రీనిధి వంటి టాప్ కాలేజీల్లోనూ ఈ ఏడాది నియామకాలు 60 శాతం మేర తగ్గాయి.
గతేడాది హైదరాబాద్‌లో 40-50 కాలేజీల్లో క్యాంపస్ నియామకాలు చేపట్టిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ తదితర సంస్థలు ఈ ఏడాది కేవలం పది కాలేజీలకు పరిమితమయినట్టుగా 'సాక్షి' కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Wikipedia
'అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు'
అగ్రవర్ణాల్లోని పేదలకూ రిజర్వేషన్లను తప్పనిసరిగా కల్పించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు గట్టిగా అభిప్రాయపడిందని ఈనాడు పత్రిక ఓ కథనంలో పేర్కొంది.
ఆర్థిక స్థితి ఆధారంగా అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.
'అగ్రవర్ణాల పేదలు ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చారు. సామాజిక న్యాయం పేరుతో నిరసన వ్యక్తమవుతాయేమోనన్న భయంతోనే వారి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. సామాజిక న్యాయం అంటే సమాజంలో అన్ని వర్గాలకూ అందాలి' అని జస్టిస్ ఎన్.కిరుబకరన్ వ్యాఖ్యానించారు.
'అగ్రవర్ణంలోనైనా, వెనుకబడిన తరగతిలోనైనా పేదవాడు పేదవాడే. అన్నివిధాలా పైకి రావడానికి అలాంటివారికి రిజర్వేషన్లు కల్పించాలి' అని అన్నారు.

ఫొటో సోర్స్, Telangana CMO
లంబాడా-ఆదివాసీ ఘర్షణలు: అధికారులపై వేటు
తెలంగాణలో తీవ్రమైన లంబాడా-ఆదివాసీ ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వం అధికారులపై వేటు వేసిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.
నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కలెక్టర్లు, కరీంనగర్ రేంజ్ డీఐజీ, ఆదిలాబాద్ ఎస్పీపై శనివారం వేటు వేసింది.
కలెక్టర్లు ముగ్గురినీ వెయిటింగులో పెట్టగా, డీఐజీ, ఎస్పీలను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
లంబాడాలు తమ ఉద్యోగాలను, నిధులను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తూ ఆదివాసీలు నిరసన తెలుపుతుండటంతో కొన్ని వారాలుగా ఏజెన్సీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో లంబాడాలు పని చేయరాదంటూ ఆదివాసీలు అల్టిమేటం జారీ చేశారు.
ఈ క్రమంలో పోటాపోటీగా ఆదివాసీలు, లంబాడాలు బహిరంగ సభలతో బల ప్రదర్శన చేపట్టారు.
తాజాగా, శుక్రవారం సాయంత్రం ఉట్నూరులో, అంతకుముందు ములుగులోని మేడారంలో ఆదివాసీల తిరుగుబాటుతో ప్రభుత్వం కదిలింది.
ఏకంగా మూడు జిల్లాల కలెక్టర్లు, డీఐజీ, ఎస్పీలకు స్థానచలనం కల్పించింది.
ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన ఉట్నూరు ఘటనలో నిఘా వైఫల్యం ఉన్నట్లు తేలింది.
నిఘా వైఫల్యం కారణంగానే ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయని ఉన్నతాధికారులు నిగ్గు తేల్చారు. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదిక అందజేశారని ఆ కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Rajastan hign court
మతమార్పిడికి కలెక్టర్ అనుమతి తప్పనిసరి: రాజస్థాన్ హైకోర్టు
మతమార్పిడికి సంబంధించి రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 'నవతెలంగాణ' ఓ కథనం ప్రచురించింది.
ఎవరైనా వ్యక్తి తాను మతం మారినట్టు కేవలం స్టాంప్ పేపర్‌పై డిక్లేరేషన్ ఇస్తే సరిపోదని, జిల్లా కలెక్టర్, సబ్ డివిజన్ మెజిస్ట్రేట్, సబ్ డివిజన్ ఆఫీసర్‌లలో ఎవరైనా ఒకరు ఆ వ్యక్తి మతమార్పిడిపై క్లియరెన్స్ పత్రం అందజేయాల్సి ఉంటుందని ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
22 ఏండ్ల హిందూ యువతి పాయల్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జీకే.వ్యాస్, జస్టిస్ వీకే.మాథూర్‌లతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
మత మార్పిడులపై ధర్మాసనం నూతన మార్గదర్శకాల్ని విడుదల చేసింది.
హిందూ యువతి పాయల్ ముస్లిం వ్యక్తి ఫైయజ్‌ను వివాహమాడిన తర్వాత మతం మార్చు కున్నారు.
ఆమె తాను మతం మార్చుకున్నట్టు పది రూపాయల స్టాంప్ పేపర్‌తో డిక్లేరేషన్ సమర్పించారు.
దీనికి సంబంధించి హెబియస్ కార్పస్ కేసు విచారణ జరుపుతూ మతమార్పిడిపై హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది.
ఇలా స్టాంప్ పేపర్‌పై వ్యక్తిగత మార్పిడిని రూఢీ చేస్తూ డిక్లరేషన్ ఇవ్వటం చట్టపరంగా చెల్లదని కోర్టు పేర్కొంది.
ఇకపై ఎవరైనా వ్యక్తి తన మత మార్పిడికి సంబంధించి ముందుగా జిల్లా కలెక్టర్ లేదా సబ్ డివిజన్ మెజిస్ట్రేట్, లేదా సబ్ డివిజన్ అధికారికి రాతపూర్వకంగా సమాచారం అందించాలని, అందులో అతని పేరు, చిరునామా, మారిన మతం తదితర వివరాలన్నీ రాయాలని, ఆ తర్వాత అధికారులు మతమార్పిడి వివరాల్ని జిల్లా కలెక్టర్ నోటీస్ బోర్డుపై ఉంచుతారని కోర్టు తన మార్గదర్శకాల్లో తెలియజేసింది.
21 రోజుల అనంతరం దరఖాస్తుదారు తాను ఎందుకు మతం మారుతున్నానో జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని, ఒకవేళ ఇదంతా జరగకపోతే మతాంతర వివాహాల అనంతరం వ్యక్తుల మతమార్పిడికి చట్టపరమైన గుర్తింపు ఉండదని కోర్టు పేర్కొన్నట్టుగా ఆ కథనం తెలిపింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








