బొగ్గు గనిలో పేలుడు, 51మంది మృతి.. ఇరాన్‌లో విషాదం

బొగ్గు గనిలో ప్రమాదం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గ్యాస్ లీకవడం వల్లే పేలుడు జరిగినట్టు భావిస్తున్నారు
    • రచయిత, థామస్ మెకింతోష్
    • హోదా, బీబీసీ న్యూస్

ఇరాన్ తూర్పుప్రాంతంలోని బొగ్గుగనిలో గ్యాస్ లీకైన ఘటనలో కనీసం 51మంది మరణించారని, 20మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది.

దక్షిణ ఖోరాసాన్ ప్రావిన్స్‌లో ఈ పేలుడు జరిగింది.

ఇరాన్ రాజధాని తెహ్రాన్‌కు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో తబాస్‌లోని గనిలో రెండు బ్లాకులలో మీథేన్ గ్యాస్ పేలుడు వల్ల ఈ ప్రమాదం జరిగిందని వార్తా కథనాలు తెలిపాయి.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9 గంటలకు ఈ పేలుడు సంభవించినట్లు మీడియా తెలిపింది.

పేలుడు జరిగిన సమయంలో బ్లాకుల్లో 69 మంది కార్మికులు ఉన్నారని దక్షిణ ఖొరాసాన్ గవర్నర్ జావేద్ ఘెనాత్జాదే తెలిపారు.

‘‘దురదృష్టవశాత్తు పేలుడు సంభవించింది. మదన్జూ గనిలోని బీ,సీ బ్లాకుల్లో 69మంది పనిచేస్తున్నారని’’ గవర్నర్ చెప్పినట్టు ఏపీ వార్తా సంస్థ తెలిపింది.

‘‘బ్లాకు సీలో 22మంది, బ్లాకు బీలో 47మంది కార్మికులు ఉన్నారు’’

అయితే ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు , ఎంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయారనే విషయం స్పష్టంగా తెలియడంలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తొలుత 30మంది మరణించినట్టుగా పేర్కొన్న ప్రభుత్వ మీడియా తరువాత ఆ సంఖ్యను 51గా తెలిపింది.

‘‘చనిపోయిన కార్మికుల సంఖ్య 51కి పెరిగింది, గాయపడినవారి సంఖ్య 20కి పెరిగింది’’ అని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది.

ఇరాన్ రెడ్ క్రెసెంట్ హెడ్‌ను ఉటంకిస్తూ 24మంది గల్లంతయ్యారని ప్రభుత్వ టీవీ తెలిపింది.

బాధిత కుటుంబాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసినట్టు రాయ్‌టర్స్ వార్తా సంస్థ తెలిపింది.

తబాస్ గనులు దాదాపు 30వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. వీటిలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని ఐఆర్ఎన్ఏ తెలిపింది.

గనిలో గ్యాస్ కారణంగా గాలింపు చర్యలు కష్టంగా మారాయని స్థానిక ప్రాసిక్యూటర్ అలీ నెసేయ్ తెలిపారని స్టేట్ మీడియా పేర్కొంది.

‘‘గాయపడినవారికి చికిత్స అందించడం, శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తీయడమే తక్షణ కర్తవ్యమని’’నెసేయ్ చెప్పారు.

గత ఏడాది దమ్‌ఘాన్ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారని, ఇది కూడా మీథేన్ లీకేజీ ఫలితమేనని స్థానిక మీడియా తెలిపింది.

అదే గని ప్రాంతం కూలి 2021 మేలో ఇద్దరు మరణించారని అప్పట్లో స్థానిక మీడియా తెలిపింది.

2017లో ఉత్తర ఇరాన్ లోని ఆజాద్ షహర్ నగరంలో జరిగిన పేలుడులో 43 మంది మృతి చెందారు.

ఈ ప్రమాదాలతో ఇరాన్ అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)