విశాఖ వన్డేలో భారత్ గెలుపు : యశస్వీ సెంచరీ,రో-కో అర్ధసెంచరీలు

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, AFP via Getty Images

దక్షిణాఫ్రికాతో మూడువన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలిచింది. సిరీస్‌లో మూడో వన్డే తనకు అచొచ్చిన వైజాగ్‌ వేదికగా జరగగా, గెలుపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత్ 9 వికెట్ల తేడాతో గెలిచింది. 271 పరుగుల లక్ష్యాన్ని 39.5 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.

భారత జట్టులో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీ (116 పరుగులు) సాధించాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 75 పరుగులు చేసి ఔటయ్యాడు.

సూపర్‌ఫామ్‌లో ఉన్న కోహ్లీ కూడా 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి 65 పరుగులు చేయడంతో భారత్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

జైస్వాల్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలుచుకోగా, విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు గెలుచుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది.జట్టులో క్వింటన్ డీకాక్ సెంచరీ (106), బవుమా 48 పరుగులు సాధించారు.

భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు తీశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్వింటన్ డీకాక్, విశాఖపట్నం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డీకాక్ 106 పరుగులు సాధించారు.

రాణించిన కుల్‌దీప్, ప్రసిద్ధ్

టాస్ గెలిచిన భారత జట్టు, దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఓపెనర్ ర్యాన్ రికెల్టన్‌(0)ను తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ సింగ్‌ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ బవుమాతో డీకాక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. ఈ క్రమంలో బవుమాను రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చాడు.

దీంతో, మాథ్యూ బ్రీట్‌జ్కీతో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు డీకాక్. హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని ప్రసిద్ధ్ కృష్ణ విడగొట్టాడు. 24 పరుగులు చేసిన బ్రీట్‌జ్కీని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.

ఆ తర్వాత వచ్చిన మార్‌క్రమ్ కేవలం ఒక పరుగు చేసి పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో సెంచరీ పూర్తి చేసుకున్న డీకాక్ ( 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106)ను ప్రసిద్ధ్ కృష్ణ బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది.

కుల్‌దీప్ యాదవ్, విశాఖపట్నం, భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు.

ఆ తర్వాత వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ (29), మార్కో జాన్సెన్ (17), కార్బిన్ బాష్ (9)లను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.

చివర్లో కేశవ్ మహరాజ్ (20 పరుగులు) రాణించాడు. అయితే, మిగతావాళ్లు క్రీజులో నిలవకపోవడంతో దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌట్ అయింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)