ఆంధ్రప్రదేశ్: జోరుగా సాగిన కోడి పందాలు... కత్తులు తగిలి ఇద్దరు మృతి

కోడిపందేలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు జోరుగా నిర్వహించారు. పందేల సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు.

నిబంధనలు ఉల్లంఘించి ఇవి సాగుతున్నాయి. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ అధికార పార్టీ నేతల సమక్షంలోనే ఈ కోడి పందాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు స్వయంగా పర్యవేక్షించిన ఘటనలున్నాయి.

కోడి పందాలు చూసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి, ప్రమాదవశాత్తూ కోడి కాలికి కట్టిన కత్తి తగలడంతో ప్రాణం కోల్పోయారు. మరో ఘటనలో కోడికి కత్తి కడుతున్న వ్యక్తి ప్రమాదానికి లోనై చనిపోయారు.

పందాలు చూస్తుండగా..

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడి పందాల శిబిరం వద్ద కత్తి తగలడంతో పద్మరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.

పండగ రోజు కోడి పందాలు చూసేందుకు సరదాగా వెళ్లిన పద్మరాజు మీదకు అకస్మాత్తుగా కోడి దూసుకుని వచ్చింది. బరిలో నిలుచుని ఉన్న పద్మరాజుకి కోడి కాలికి ఉన్న కత్తి కోసుకుని తీవ్రంగా రక్తస్రావమైంది. అక్కడున్న వారు ఆయన్ని సమీపంలోని నల్లజర్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు.

పద్మరాజు మృతి అతని కుటుంబంలోనూ గ్రామంలోనూ విషాదం నింపింది.

పద్మరాజు మృతితో అక్కడ బరి నిర్వాహకులు పరారయ్యారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నల్లజర్ల పోలీసులు బీబీసీకి తెలిపారు.

పోస్ట్ మార్టమ్ నిర్వహించిన తర్వాత పద్మరాజు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

పందెం కోడితో రోజా

ఫొటో సోర్స్, Roja Selvamani/Facebook

కత్తి కడుతుండగా…

మరో ఘటనలో కోడికి కత్తి కడుతున్న వ్యక్తి చనిపోయారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంకలో ఈ ఘటన జరిగింది.

కత్తి కడుతుండగా గండే ప్రకాశ్ రావు అనే వ్యక్తి మణికట్టుకి గాయమైంది. దాంతో అతనికి కూడా రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు.

జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో కోడి పందాల సందర్భంగా కోడికి కత్తి కడుతుండగా అది పొరపాటున ఎగిరి పక్కనే ఉన్న గండే ప్రకాష్ రావును తగిలింది. కత్తి కోసుకుని పోవడంతో రక్తం అధికంగా కారిపోయి అక్కడికక్కడే మృతి చెందారు.

కోళ్ల పెంపకంతోపాటు పందాల సమయంలో కోళ్లకు కత్తులు కట్టడం వంటివి చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. కత్తి కడుతుండగా కోడి కదలడంతో ప్రమాదానికి గురయినట్టు పోలీసులు నిర్ధారించారు.

ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి ఆటోలో ప్రకాశ్‌ను ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కోడిపందేల బరి

‘నిబంధనలు ఉల్లంఘించినా స్పందన లేదు..’

కోడి పందాలు యథేచ్చగా సాగుతున్నా అధికార యంత్రాంగం ఏమీ పట్టనట్టుగా ఉండిపోయిందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వి.రామన్న అన్నారు.

‘ఎక్కడికక్కడ కోడి పందాల బరులు నిర్వహించారు. కత్తి కట్టి పందాలు వేయడం నిబంధనలకు విరుద్ధం. అయినా సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోడి పందాలలో భాగస్వామ్యం అయిపోయారు.

ఇది అధికార యంత్రాంగానికి పట్టలేదు. పోలీసులు మీద పాలకపక్షం ఒత్తిడి తీసుకురావడం విచారకరం. పందాలు, గుండాట, జూదం పెద్ద స్థాయిలో సాగింది.

చివరకు ఇద్దరి ప్రాణాల మీదకు కూడా వచ్చింది. వారి మృతికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?’ అని రామన్న ప్రశ్నించారు.

గతంలో ఎన్నడూ లేనంత రీతిలో వందల కోట్లలో పందాలు సాగడం, ప్రజల ప్రాణాలు పోవడం విచారకరమని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)