క్రౌడ్‌స్ట్రైక్: ఔటేజ్ సమస్య పరిష్కారానికి ఇంకా సమయం పడుతుందన్న కంపెనీ

ఐటీ ఔటేజ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఐటీ ఔటేజ్‌తో వేల సంఖ్యలో విమానాలు రద్దు
    • రచయిత, జోయ్ టిడీ, రాబర్ట్ గ్రీనాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలలో నెలకొన్న సాంకేతిక సమస్యతో విమానయానం సంస్థల నుంచి, రైల్వే, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్ వంటి ఎన్నో సంస్థల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

గురు, శుక్రవారాలలో కొన్ని గంటల పాటు కంప్యూటర్ సిస్టమ్స్‌పై ప్రభావం చూపిన ఈ భారీ ఐటీ ఔటేజ్‌ నుంచి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్‌లు, సర్వీసులు మెల్లమెల్లగా బయటపడున్నాయి.

సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ డెవలప్ చేసిన ‘ఫాల్కన్ సెన్సర్’ అనే సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా మైక్రోసాఫ్ట్ విండోస్‌లో ఈ సమస్య తలెత్తింది. ఈ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన ‘అప్‌డేట్‌’ వల్ల ఈ సమస్య వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అంతరాయానికి క్షమాపణ చెబుతున్నట్టు క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ తెలిపారు.

అన్ని సిస్టమ్‌లు బ్యాకప్‌కు వచ్చి, ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగేందుకు కొంత సమయం పడుతుందని క్రౌడ్‌స్ట్రైక్ సీఈఓ వెల్లడించారు.

అయితే, పెద్ద సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని రోజుల వ్యవధి పట్టొచ్చని నిపుణులు హెచ్చరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
క్రౌడ్‌స్ట్రైక్ టీమ్

ఫొటో సోర్స్, Getty Images

క్రౌడ్‌స్ట్రైక్ నుంచి వచ్చిన అప్‌డేట్‌‌ను అప్లై చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో బ్లూ స్క్రీన్ వచ్చి, సిస్టమ్స్ క్రాష్ అయ్యాయి.

క్రౌడ్‌స్ట్రైక్ అనేది అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీని అభివృద్ధి చేసే సంస్థ.

సైబర్ దాడులను అడ్డుకునేందుకు ఈ సంస్థ డెవలప్ చేసిన సాఫ్ట్‌వేర్లలో ‘ఫాల్కన్ సెన్సర్’ ఒకటి. ఈ సాఫ్ట్‌వేర్‌లోనే ఇప్పుడు సమస్య వచ్చింది.

‘సమస్యను గుర్తించి, ఐసోలేట్ చేసి, పరిష్కారానికి చర్యలు చేపట్టాం’ అని క్రౌడ్‌స్ట్రైక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ కర్ట్జ్ చెప్పారు.

కస్టమర్లకు కలిగించిన అంతరాయానికి కంపెనీ చింతిస్తుందని, క్షమాపణ చెబుతున్నట్టు అమెరికాలోని ఎన్‌బీసీ టుడే షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్ట్జ్ చెప్పారు.

చాలా మంది కస్టమర్లు ప్రస్తుతం వారి సిస్టమ్‌లను రీబూట్ చేస్తున్నారని, అది పని చేస్తుందని అన్నారు. ఆటోమేటిక్‌గా రికవరీ కాలేని కొన్ని సిస్టమ్‌లకు కాస్త సమయం పడుతుందన్నారు. ప్రతి కస్టమర్ సిస్టమ్‌ను పూర్తిగా రికవరీ చేయడమే తమ మిషన్ అని కర్ట్జ్ అన్నారు.

సిస్టమ్స్ స్టార్ట్ కాకపోతే, ప్రభావితమైన సిస్టమ్స్ తప్పుడు అప్‌డేట్‌ను తొలగించేందుకు ‘సేఫ్ మోడ్’లో ప్రారంభించాల్సి ఉంటుందని రీసెర్చర్ కెవిన్ బ్యూమాంట్ చెప్పారు. ఇది టైమ్ తీసుకుని ప్రక్రియ అని, దీని పూర్తి చేయడానికి పెద్ద సంస్థలకు కొన్ని రోజుల వ్యవధి పడుతుందన్నారు.

టెక్నికల్ స్టాఫ్ వెళ్లి, ప్రభావితమైన ప్రతి కంప్యూటర్‌ను రీబూట్ చేయాల్సినవసరం ఉందన్నారు. ఇదొక పెద్ద పని అని ఆయన అన్నారు.

సిస్టమ్‌లు పలుమార్లు రీబూట్ చేయాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ కూడా తెలిపింది. కొంతమంది యూజర్లు ఈ సమస్య పరిష్కారానికి తాము 15 సార్లు రీబూట్ చేసినట్లు తెలిపారు.

‘‘కంటెంట్ అప్‌డేట్’’తో సమస్య

సైబర్ సెక్యూరిటీలో అతిపెద్ద, అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్లలో క్రౌడ్‌స్ట్రైక్ ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా దీనికి 24 వేల మంది కస్టమర్లున్నారు. వేల కంప్యూటర్లను ఇది సంరక్షించాలి.

ఈ ఔటేజ్ సెక్యూరిటీ లేదా సైబర్ దాడికి చెందినది కాదని, ఇది కంటెంట్ అప్‌డేట్‌లో నెలకొన్న లోపం వల్ల తలెత్తిన సమస్య అని కర్ట్జ్ శుక్రవారం తన క్లయింట్స్‌కు పంపిన మెసేజ్‌లో చెప్పారు.

‘‘ఈ సమస్యను పరిష్కరించినప్పటికీ, ఇదెలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు అందించేందుకు పారదర్శకతతో ఉంటాం. మళ్లీ ఇది జరగకుండా చర్యలు తీసుకుంటాం’’ అని కర్ట్జ్ వాగ్దానం చేశారు.

‘‘కంటెంట్ అప్‌డేట్’’ అనేది ఈ సమస్యగా పేర్కొన్నారు. కానీ, అర్థరాత్రి చేసిన ఈ అప్‌డేట్ చాలా చిన్నది. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌కు చెందిన అంత పెద్ద అప్‌డేట్ కాదు.

సాఫ్ట్‌వేర్ డిజైన్‌లో ఇది ఫాంట్ లేదా లోగో మార్పు అయి ఉండొచ్చు. ఇదంత హానికరం కూడా కాదు.

కానీ, ఇంత చిన్న అప్‌డేట్ అంత పెద్ద డ్యామేజ్‌కు ఎలా కారణమవుతుందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

వరల్డ్ ఇంటర్‌కనెక్టెడ్ టెక్నాలజీల్లో ఉన్న ప్రమాదాన్ని ఈ గ్లోబల్ ఔటేజ్ ఎత్తి చూపింది. చిన్న ఒక్క సాఫ్ట్‌వేర్ సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపుతుందో తెలిపింది.

సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ క్రౌడ్‌స్ట్రైక్ ఫాల్కన్‌తో విండోస్ యూజర్లకు భారత కాలమాన ప్రకారం గురువారం అర్థరాత్రి నుంచి మొదలైందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. శుక్రవారం ఉదయానికి సమస్య ప్రమాద స్థాయిపై స్పష్టత వచ్చిందని చెప్పింది.

విమానాశ్రయాలు

ఫొటో సోర్స్, EPA

సాధారణ స్థితికి విమానయాన సంస్థల సేవలు

వేల విమానాలు రద్దు అయిన తర్వాత, ప్రస్తుతం కొన్ని విమానయాన సంస్థల సర్వీసులు సాధారణ స్థితికి వచ్చాయి. యథాతథంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

గ్లోబల్ ఔటేజ్‌తో నెలకొన్న నిర్వహణ ఇబ్బందులు దాదాపు పరిష్కారమయ్యాయని, విమాన కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో తమ సిబ్బంది గణనీయమైన పురోగతిని సాధించారని ఇండిగో తన ట్వీట్‌లో ప్రకటించింది. అయితే, వారాంతంలో విమాన ఆలస్యాలు, షెడ్యూల్ అంతరాయాలు కస్టమర్లకు కలగవచ్చని చెప్పింది.

గ్లోబల్ ఔటేజ్‌తో వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. అదేవిధంగా బ్యాంకింగ్, వైద్య సంరక్షణ, దుకాణాలు ప్రభావితమయ్యాయి.

చాలా బిజినెస్‌లు ప్రస్తుతం బ్యాక్‌లాగ్స్‌ వ్యవహారాలను చక్కదిద్దుతున్నాయి. మిస్ అయిన ఆర్డర్లను పరిష్కరించేందుకు మరికొన్ని రోజులు పట్టొచ్చు.

బ్రిటన్‌, ఇజ్రాయెల్, జర్మనీలోని వైద్య సేవలు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొన్నాయి. కొన్ని కార్యకలాపాలను రద్దు చేశారు కూడా.

శుక్రవారం సాయంత్రం నాటికి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లోనే సమస్యలు పరిష్కారమయ్యాయి. చెకిన్, పేమెంట్ సిస్టమ్స్‌లో సమస్యలు ఉన్నాయని కొన్ని విమానాశ్రయాలు చెప్పాయి.

పడిన క్రౌడ్‌స్ట్రైక్ షేర్లు

ఈ దెబ్బకు క్రౌడ్‌స్ట్రైక్ షేర్లు శుక్రవారం సుమారు 12 శాతం వరకు పడిపోయాయి. ఈ సమస్యను తొలుత ఆస్ట్రేలియాలో గుర్తించారు. దీని వల్ల ఎక్కువగా విమానయాన పరిశ్రమ ప్రభావితమైంది.

సిరియం ఏవియేషన్ డేటా ప్రకారం శుక్రవారం రాత్రి నాటికి 4 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇతర కారణాల వల్ల రద్దయిన విమానాలు కూడా దీనిలో ఉన్నాయి.

కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోయాయి. ముఖ్యంగా వీక్లీ శాలరీ పేమెంట్లు జరిపే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి.

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రైల్వే సంస్థలు కూడా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించాయి. స్కై న్యూస్, ఏబీసీ ఆస్ట్రేలియా వంటి న్యూస్ చానళ్లు కూడా ఈ ఔటేజ్ బారిన పడ్డాయి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)