తెలంగాణ: యువతిపై దాడి చేసి చంపిన పులి... ఆమె శవాన్ని తీసుకెళ్తున్న అంబులెన్సుకు అడ్డుపడింది - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, AFP
తెలంగాణ జిల్లాల్లోని అటవీ గ్రామాల్లో పులులు అలజడి సృష్టిస్తున్నాయని, తాజాగా కుమురం భీం జిల్లాలో ఓ యువతిని పులి చంపేసిందని సాక్షి పత్రిక పేర్కొంది. ఇదే జిల్లాలో ఇటీవలే పులి దాడిలో ఓ వ్యక్తి మరణించగా, తాజాగా పెంచికల్ మండలం కొండపల్లి గ్రామంలో పత్తిచేలో పని చేసుకుంటున్న నిర్మల అనే యువతిపై పులి దాడి చేసి చంపినట్లు సాక్షి కథనం వెల్లడించింది.
కూలి పనికి వెళ్లిన నిర్మల మధ్యాహ్నం భోజనానికి బయలుదేరుతుండగా పులి వెనక నుంచి ఆమెపై దాడి చేసింది. పంజాతో కొట్టి తీవ్రంగా గాయపరిచి, స్పృహ కోల్పోయాక ఆ మహిళ గొంతు పట్టుకుని లాక్కుని వెళ్లింది.
అక్కడున్న వారిలో కొందరు కర్రతో పులిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించగా, అది వారిపై కూడా దాడికి ప్రయత్నించి చివరకు పారిపోయింది. తమ కళ్ల ముందే ఈ ఘోరం జరిగిందని కూలీలు వెల్లడించినట్లు సాక్షి పేర్కొంది.
ఇటీవల స్థానికులపై దాడి చేసిన పులి, ఈ పులి ఒకటి కాదని, దీనిని బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అటవీ శాఖాధికారులు వెల్లడించారు. బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని జిల్లా అటవీశాఖాధికారి శాంతారామ్ తెలిపారు.
మరోవైపు మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా బెజ్జూర్-పెంచికల్ పేట్ సమీపంలో ఒక పులి అంబులెన్స్‌కు అడ్డుగా వచ్చిందని, అది వెళ్లేదాక వేచి చూడాల్సి వచ్చిందని డ్రైవర్ గణేశ్ వెల్లడించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
బెట్టింగ్ అప్పులు తీర్చి, తల్లిని, చెల్లెని హత్య చేసిన ఎం.టెక్ విద్యార్ధి
బెట్టింగ్ అప్పులు తీర్చడానికి తల్లి బ్యాంక్ ఎకౌంట్ నుంచి డబ్బులు, ఇంట్లో నగలు చోరీ చేసిన ఓ ఎం.టెక్ స్టూడెంట్ తల్లికి, చెల్లికి తన మీద అనుమానం వస్తుందన్న భయంతో వారిద్దరికీ విషమిచ్చి చంపాడని ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ఇచ్చింది.
మేడ్చల్ జిల్లాకు చెందిన సాయినాథ్ రెడ్డి స్థానికంగా ఓ కాలేజీలో ఎం.టెక్ చదువుతున్నాడు. బెట్టింగ్‌లకు పాల్పడి అప్పులు చేశాడు. మూడేళ్ల కిందట తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వచ్చిన రూ.18లక్షలు తల్లి ఎకౌంట్‌లో ఉండటంతో వాటిని పథకం వేసి కాజేశాడు .ఇంట్లో ఉన్న బంగారు నగలను కూడా రహస్యంగా అమ్మేశాడు.
ఈ వ్యవహారంలో తల్లికి, చెల్లికి అనుమానం వస్తుందన్న భయంతో వారిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23న ఎవరికీ తెలియకుండా అన్నంలో విషం కలిపాడు. అనుమానం రాకుండా అదే అన్నాన్ని ఆఫీసుకు కూడా తీసుకెళ్లాడు.
తల్లి ఫోన్ చేసి కడుపులో తిప్పుతోందని చెప్పడంతో ఇంటికి వచ్చిన సాయినాథ్ రెడ్డి వారు స్పృహ కోల్పోయే వరకు వేచి చూసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ప్రైవేటు ఆసుపత్రులకు ఫీజు చెల్లించలేనంటూ రెండు మూడు ఆసుపత్రులకు తిప్పి చివరకు 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత గాంధీ ఆసుపత్రికి చేర్చాడు. 8 గంటల తర్వాత చికిత్స అందడంతో అప్పటికే వారి పరిస్థితి విషమించింది. ఈ నెల 27న చెల్లెలు అనూష, 28న తల్లి సునీత మృతి చెందారు.
అయితే తల్లి చెల్లీ చనిపోయినా ఏమాత్రం కన్నీరు కార్చని సాయినాథ్ రెడ్డిని చూసి అనుమానించిన బంధువులు నిలదీయడంతో అసలు విషయం బైటికి వచ్చింది. ప్రస్తుతం సాయినాథ్ రెడ్డి పోలీస్ కస్టడీలో ఉన్నాడు.
ఈ వ్యవహారంలో ఒక ప్రైవేటు ఆసుపత్రితోపాటు గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు, పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహించారని, ఇది ఆత్మహత్య కేసని తెలిసినా ఎలాంటి విచారణ లేకుండా పోలీసులు మృతదేహాలను సాయినాథ్ రెడ్డికి అప్పగించారని ఆంధ్రజ్యోతి తన కథనంలో రాసింది.

ఏపీ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, రవాణా శాఖామంత్రి పేర్ని వెంకట్రాయమ్య (నాని)పై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది.
ఈ కథనం ప్రకారం మంత్రి నాని మచిలీపట్నంలో తన నివాసంలో తల్లి దశ దిన కర్మ పూర్తి చేసి బయటకు వస్తుండగా, ఆయన్ను చూడటానికి వచ్చిన జనంలో నుంచి ఓ వ్యక్తి కాళ్లకు నమస్కరించడానికి వచ్చినట్లు వచ్చి ఆయనపై తాపీతో దాడి చేశాడు.
అతను దగ్గరకు వచ్చి వంగి పొట్టలోంచి ఏదో తీసి తనపై దాడి చేశాడని, అది బెల్ట్ బకిల్‌కు తగిలిందని, రెండోసారి పొడవబోయినప్పుడు పక్కనున్న వారు అతన్ని అడ్డుకున్నారని మంత్రి నాని వెల్లడించారు. అతను ఎవరో, ఎందుకు అలా చేశాడో తనకు తెలియదని, అయితే తాను క్షేమంగా ఉన్నానని మంత్రి చెప్పారు.
దాడి చేసిన వ్యక్తిని మచిలీపట్నానికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించామని, అతను మద్యం మత్తులో అలా ప్రవర్తించినట్లు తేలిందని ఎస్పీ రవీంద్రనాథ్ వెల్లడించారు. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
అయితే దాడి చేసిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అని, ఉనికి కోసం టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించగా, అతను తెలుగుదేశం కార్యకర్త కాదని, ప్రభుత్వ ఇసుక విధానాల వల్ల ఉపాధి కోల్పోయిన తాపీ కార్మికుడు ఆవేశంలో ఈ పని చేసి ఉంటారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రజనీకాంత్ రాజకీయ నిర్ణయం నేడే?
వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ఇవాళ జరిగే సమావేశంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
తన పార్టీ రజనీ మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులతో ఆయన సమావేశమవుతారు. ఈ భేటీ ఆన్‌లైన్‌లో జరుగుతుందా లేక ప్రత్యక్షంగా నిర్వహిస్తారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఇటీవల ఆయన అభిమానులు కోరారు. దీంతో ఆయన ఇవాళ జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నమస్తే తెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరు
- అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక డోనల్డ్ ట్రంప్ ఏం చేస్తారు? రాజకీయాల్లో కొనసాగుతారా? మళ్లీ వ్యాపారం చేస్తారా?
- మనీశ్ మిశ్రా: బిచ్చగాడు అనుకుని సాయం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సాల్యూట్ చేశారు
- గుండె తరుక్కుపోయే కష్టం.. కళ్ల ముందే భార్య, ముగ్గురు పిల్లల శవాలు నీళ్లలో తేలుతుంటే చూడలేక ఆత్మార్పణం
- జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు పెరిగాయా?
- తుపాన్లకు పేర్లను ఎవరు పెడతారు?
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- GDP: ఆర్థిక సంక్షోభంలో భారతదేశం... 7.5 శాతం పడిపోయిన జీడీపీ
- GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?
- నివర్ తుపాను తాకిడితో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








