కరోనావైరస్: లాక్‌డౌన్ తర్వాత వైరస్ బారిన పడకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

నేను బస్సు టిక్కెట్ కోసం క్యూ లైన్లో ఉండగా ఎవరైనా తుమ్మితే పరిస్థితి ఏంటి? దానివల్ల నేను ప్రమాదంలో పడతానా?

లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత నేను మళ్లీ మునుపటిలా ధైర్యంగా రెస్టారెంట్‌కి వెళ్లవచ్చా?

వాటన్నింటినీ పక్కన బెట్టినా మళ్లీ సిటీ బస్సులు, మెట్రో రైళ్లు, సాధారణ రైళ్లలో గతంలోలా ప్రయాణాలు చెయ్యవచ్చా?

రోజు రోజుకీ లాక్‌డౌన్‌ను మరింత సడలిస్తున్న నేపథ్యంలో అందరిలోనూ ఇప్పుడు ఇవే ప్రశ్నలు.

ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నారు. మళ్లీ మనం సాధారణ జీవితంలోకి ప్రవేశిస్తూ రోజూవారీ కార్యకలాపాలకు హాజరవుతున్నాం. ఫలితంగా కరోనావైరస్ వ్యాపించటం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతో ఈ రెండో విడతలో మున్ముందు ఎంత మంది ప్రమాదంలో పడతారో అన్న భయాలు మొదలయ్యాయి.

కోవిడ్-19న బారిన పడే ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చని మేం ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్, యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో బయాలాజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఎరిన్ బ్రోమజ్‌ను అడిగాం.

ఆయన అదే యూనివర్శిటీలో సాంక్రమిక రోగ విజ్ఞానానికి సంబంధించిన కోర్సును బోధిస్తుంటారు. అంతే కాదు కోవిడ్-19 మహమ్మారి విస్తరించిన క్రమాన్ని మొదటి నుంచి అమూలాగ్రం ఆయన పరిశీలిస్తున్నారు.

ఈ వ్యాధికి సంబంధించిన శాస్త్రీయ సమాచారంతో కరోనావైరస్ వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఆయన రాసిన బ్లాగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోటి 60 లక్షల సార్లు చదివారు. లాక్‌డౌన్ తరవాత తిరిగి సాధారణ రీతిలో జీవితం గడిపేందుకు ఆయన అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు.

ప్రజలు ఎలా ప్రమాదంలో పడతారు?

చాలా మంది తమ ఇంట్లో కుటుంబ సభ్యుల ద్వారానే ఈ వైరస్ బారిన పడుతుంటారని అంటారు డాక్టర్ బ్రోమజ్.

మరి ఇంటి బయట పరిస్థితుల మాటేంటి? రోజూ మార్నింగ్ వాక్‌ చేసేందుకు పార్క్‌కు వెళ్తే మనం ప్రమాదంలో పడతామా? మన పక్కనే మనతో పాటు మాస్కు లేకుండా నడిచే తోటి వాకర్ మనకు ఆ వ్యాధిని అంటించనున్నారా? బహుశా కాకపోవచ్చు అంటారు ప్రొఫెసర్.

“నిజానికి బయట వైరస్ తీవ్రతను పట్టి ఉంచేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. కనుక ఊపిరిని బయటకు వదలగానే అది చాలా త్వరగా గాలిలో కలిసిపోతుంది” అని ఆయన బీబీసీతో అన్నారు. అంటే దానర్థం.. మనలో ప్రవేశించేందుకు దానికి తగినంత సమయాన్ని మనం ఇవ్వనంత వరకు దానివల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండదన్నమాట.

“మీరు వైరస్ బారిన పడాలంటే నియమిత స్థాయిలో వైరస్‌లోని సూక్ష్మ కణాలు మీ శరీరంలో ప్రవేశించాలి. ఇన్ఫెక్షియస్ డోస్ స్టడీస్ ప్రకారం మెర్స్, సార్స్ వ్యాధుల విషయంలో కనీసం 1000-SARS-CoV2 వైరల్ కణాలు శరీరంలో ప్రవేశిస్తేనే ఆ వ్యాధి బారిన మనం పడినట్టు” అని బ్రోమజ్ తన బ్లాగులో వివరించారు.

అయితే కోవిడ్-19 విషయంలో ఈ సంఖ్య ఎంత అన్నదానిపై అనేక వాదోపవాదాలున్నాయి. ఇక ఎంత డోసు ఉండాలన్నది మాత్రం ప్రయోగాల ద్వారా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఇన్ఫెక్షన్ మనిషి శరీరంలో ఎలా ప్రవేశిస్తుందన్న విషయంలో ఈ వివరణ కొంత వరకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

ఇక్కడ కీలకమైన విషయమేంటంటే ఆ సంఖ్యను పక్కనబెడితే వైరల్ కణాలు మీ శరీరంలో ఏ మేరకు ప్రవేశిస్తున్నాయన్నది ముఖ్యం.

ఉదాహరణకు ఒకే విడతలో గాలి పీల్చడం ద్వారా వెయ్యి వైరల్ కణాలు మీ శరీరంలో ప్రవేశించవచ్చు. లేదా ఊపిరి పీల్చిన ప్రతిసారి వంద చొప్పున మీ శరీరంలోకి వెళ్లవచ్చు.. అదీ కాకపోతే కేవం పది వైరల్ కణాలు చొప్పున వంద సార్లు ఊపిరి పీల్చడం వల్ల వెయ్యి వైరల్ కణాలు మీ శరీరంలోకి చొరబడవచ్చు.

అంటే మీరు వైరస్ బారిన పడే అవకాశం ఇక్కడ ప్రతిసారి కచ్చితంగా ఉన్నట్టే. అయితే దాని ప్రభావం ఏ మేర ఉంటుందన్నది మీ శరీరంలో ప్రవేశించిన వైరల్ కణాల సంఖ్య బట్టీ ఉండవచ్చు.

అంటే మీరు పార్క్‌లో జాగింగ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న వ్యక్తి సామాజిక దూరం పాటించక పోయినప్పటికీ ఆయనతో మీరు గడిపే సమయం చాలా తక్కువగానే ఉంటుంది. ఆ కొద్ది పాటి సమయంలో వ్యాధి సోకే స్థాయిలో వైరల్ కణాలు మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం లేదు. అంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో మనం కంగారు పడాలి?

వ్యాధి లక్షణాలతో కనిపించే వ్యక్తులు

దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాధులు కచ్చితంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అది కూడా ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది.

మనిషి ఒక్కసారి దగ్గడం వల్ల 80 కిలోమీటర్ల వేగంతో సుమారు 3,000 నీటి తుంపర్లు విడుదలవుతాయని డాక్టర్ బ్రోమజ్ తెలిపారు. వాటిల్లో చాలా వరకు నేరుగా నేలపై పడిపోతాయి. కానీ కొన్ని మాత్రం గాల్లోనే ఉండిపోతాయి. అవి ఒక గది నుంచి మరొక గదికి కూడా వ్యాపించవచ్చు.

అదే మీరు లిఫ్ట్‌లో ఉండగా అందులోనే ఉన్న వారెవరైనా దగ్గినా లేదా తుమ్మినా మీ సమస్య పది రెట్లు పెరుగుతుంది.

ఒక్కసారి తుమ్మడం వల్ల సుమారు 30 వేల నీటి తుంపర్లు విడుదలవుతాయి. వాటిల్లో చిన్న చిన్న తుంపర్లు దాదాపు 320 కిలోమీటర్ల వేగంతో ఒక గది నుంచి మరో గదికి చాలా దూరం కూడా ప్రయాణించగలవు. అని డాక్టర్ బ్రోమజ్ వివరించారు.

“వైరస్ బారిన పడిన ఓ వ్యక్తి ఒక్కసారి తుమ్మినా లేదా దగ్గినా వెలువడే నీటి తుంపర్లలలో సుమారు 20 కోట్ల వైరల్ కణాలు ఉండవచ్చు. అంటే మీరు ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో నేరుగా మాట్లాడుతుండగా ఆ వ్యక్తి తుమ్మినా లేదా దగ్గినా మీకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో ఆ వ్యక్తి నుంచి కేవలం వెయ్యి సూక్ష్మ కణాలు మీరు పీల్చే గాలి ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించడం అసాధ్యమైన విషయం కాదు.’’

అలాగని మీరు ఆ వ్యక్తి తుమ్మినా లేదా దగ్గిన ప్రదేశంలో లేకపోయినా మీరు సురక్షితం అని చెప్పలేం. ఎందుకంటే ఇన్ఫెక్షన్‌తో కూడిన తేలికైన కణాలు కొన్ని నిమిషాల పాటు గాల్లోనే ఉంటాయి. కనుక ఆ సమయంలో మీరు ఆ వ్యక్తి ఉన్న గదిలో ప్రవేశించినా చాలు, మీ శ్వాస ద్వారా ఇన్ఫెక్షన్ సోకేందుకు అవసరమయ్యే సంఖ్యలో వైరల్ కణాలు మీ శరీరంలోకి ప్రవేశించవచ్చు.

వ్యాధి లక్షణాలు కనిపించని వ్యక్తులు వైరస్ వ్యాప్తికి ఎలా కారణమవుతారు?

సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన ఐదు రోజుల తర్వాత కానీ వ్యాధి లక్షణాలు బయటపడవన్న సంగతి మనకు తెలుసు. కొంత మందిలో అసలు ఎప్పటికీ ఆ లక్షణాలు కనిపించకపోవచ్చు.

కానీ అలాంటి వ్యక్తుల ఉచ్వాస-నిశ్వాసల వల్ల కూడా గాల్లోకి వైరల్ కణాలు విడుదలవుతాయి. అయితే అవి ఏ స్థాయిలో ఉంటాయి?

“సాధారణంగా ఒక్కసారి ఊపిరి వదలడం వల్ల 50 నుంచి 5,000 తుంపర్లు గాల్లోకి విడుదలవుతాయి. వాటి సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాదు అవి వెంటనే నేలపై పడిపోతాయి కూడా” అని బ్రోమజ్ తన బ్లాగులో వివరించారు.

“అవి చాలా వరకు వడపోతకు గురవుతాయి. అంతే కాదు వాటి లక్ష్యం కూడా నేలపైకి పడిపోవడమే. కనుక వ్యాధి కారక వైరల్ కణాలు అటువంటి వారి నుంచి చాలా తక్కువగా విడుదలవుతాయి. ముఖ్యంగా నేలపైకి జారుతున్న వాటిని శ్వాస ద్వారా మనం బలంగా లోపలికి పీల్చలేం. అయినప్పటికీ ముక్కులోని కింది ప్రాంతంలో ఉండిపోయిన వైరల్ కణాలు బయటకు వెళ్లే అవకాశం ఉండదు” అని బ్రోమజ్ బీబీసితో చెప్పారు.

నిజానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ దిగువ కణజాలాల్లోనే కరోనావైరస్ కణాల గాఢత ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా ఉచ్వాస-నిశ్వాస సమయంలో కరోనావైరస్‌ కణాలు ఏ సంఖ్యలో విడుదలవుతాయన్న విషయంపై ఇంకా మనకు స్పష్టత లేదు. కానీ ఓ పరిశోధన ప్రకారం ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి గాలి వదలడం ద్వారా నిమిషానికి సుమారు 3 నుంచి 20 వైరస్ ఆర్ఎన్ఏ కాపీలు విడుదలవుతాయని డాక్టర్ బ్రోమజ్ తెలిపారు.

ఒక వేళ మనం కూడా అలాగే అనుకుంటే వ్యాధి సంక్రమించిన వ్యక్తి నుంచి నిమిషానికి 20 ఆర్ఎన్ఏ కాపీల వరకు వాతావరణంలో కలిసే అవకాశం ఉంది. అంటే ఆ వ్యక్తి నుంచి ముందు మనం చెప్పుకున్నట్టు ఇన్ఫెక్షన్ సోకేందుకు అవసరమయ్యే సుమారు వెయ్యి వైరల్ కణాలు మనలో ప్రవేశించాలంటే, కనీసం ఆ వ్యక్తి వదిలే ప్రతి శ్వాసను మనం ఏకధాటిగా 50 నిమిషాల సేపు పీల్చాల్సి ఉంటుంది. (నిజానికి ఈ సంఖ్య కేవలం రిఫరెన్స్‌ కోసమే కచ్చితమైన సంఖ్య ఎంత అన్నది ఇప్పటికీ ఇంకా తెలియదు.)

అంటే దీన్నిబట్టి వైరస్ సోకిన వ్యక్తి ఉన్న గదిలోనే మనం ఉన్నప్పటికీ ఆయన తుమ్మనంత వరకు లేదా దగ్గనంత వరకు పెద్దగా ప్రమాదం లేదని చెప్పవచ్చు.

అయితే మాట్లాడటం వల్ల ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి విడుదలయ్యే నీటి తుంపర్లలో ఉండే వైరస్ కాపీల సంఖ్య నిమిషానికి పది నుంచి 200 వరకు పెరిగే అవకాశం ఉందని బ్రోమజ్ అన్నారు.

ఇక ఆ వ్యక్తితో కలిసి పాడినా, లేదా గట్టిగా మాట్లాడినా గాల్లోకి విడుదలయ్యే వైరల్ కణాల సంఖ్య మరింత పెరుగుతుంది.

“మీరు కలిసి కేకలు వేసినా లేదా పాటలు పాడినా ఆ ప్రాంతంలో నీటి తుంపర్లు భారీ స్థాయిలో విడుదలవుతాయి. అవి కూడా మీరు గట్టిగా అరవడం వల్ల వైరస్ సోకిన వ్యక్తి ఊపిరితిత్తుల్లోని అట్టడుగు భాగం నుంచి తుంపర్లు బయటకు రావచ్చు” అని బ్రోమజ్ బీబీసీకి చెప్పారు.

ఊపిరితిత్తుల్లోని ఏ ప్రాంతంలో కణజాలం వైరస్ బారిన పడిందో అక్కడ నుంచే ఆ నీటి తుంపర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.

“అంటే శరీరంలో ఉండే ఉద్గారాలను బలంగా బయటకు పంపేందుకు చేసే ఏ ప్రయత్నం కారణంగానైనా సరే, వైరస్‌కు గురైన కణజాలం నుంచి గాల్లోకి విడుదలయ్యే నీటి తుంపర్ల సంఖ్య పెరుగుతుంది. దాని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.

ఈ మార్గంలో ఇన్ఫెక్షన్ సోకడం చాలా కష్టమైనప్పటికీ, బయట నుంచి సోకే అనేక వ్యాధులు, అసలు అటువంటి లక్షణాలే కనిపించని వ్యక్తుల ద్వారానే వ్యాప్తి చెందుతున్నాయన్నది పరిశోధనల సారాంశం.

ఎటుంటి వాతావరణ పరిస్థితులు ప్రమాదకరం?

వైరస్ సోకిన వారితో నేరుగా పని చేస్తున్న వృత్తుల వారు కచ్చితంగా తీవ్ర ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. కొన్ని వాతావరణ పరిస్థితులు ఇన్ఫెక్షన్ భారీ స్థాయిలో పెరిగేందుకు కారణమవుతాయన్న సంగతి మనకు తెలుసు. అలా అనగానే సాధారణంగా అందరికీ భారీ నౌకలు గుర్తొస్తాయి. ఎందుకంటే అందులో ఉన్న వ్యక్తులు వేరే చోటుకు వెళ్లే అవకాశం ఉండదు.

కానీ విశాలమైన ప్రాంగణాల్లో జరిగే వివిధ కార్యక్రమాలు అంటే అవి క్రీడలు కావచ్చు, లేదా పుట్టిన రోజు వేడుకలు, అంత్యక్రియలు వంటివి కావచ్చు.. అందులో పాల్గొన్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం చాలా తీవ్రంగానే ఉంటుంది. అప్పటికే వైరస్ బారిన పడ్డవారితో నాలుగు గోడల మధ్య ఎక్కువ సమయం గడపటమే కారణమని డాక్టర్ బ్రోమజ్ తెలిపారు.

“ఓ కాల్ సెంటర్లో కానీ లేదా సమూహంలో కానీ 15 మీటర్ల దూరంలో ఉంటూ పని చేసినప్పటికీ, గాలి ద్వారా తక్కువ పరిమాణంలోనే వైరల్ కణాలు వారిని తాకినప్పటికీ, కొంత నిర్ణీత కాలానికి ఇన్ఫెక్షన్ సోకడానికి అవసరమయ్యే వైరల్ కణాలు వారిలో శరీరంలో ప్రవేశిస్తాయి” అని బ్రోమజ్ చెప్పారు.

ముఖ్యంగా కొన్ని వృత్తులకు సంబంధించిన వ్యక్తులు తిరిగి తమ విధులకు హాజరయ్యే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అంతంత మాత్రం గాలి, వెలుతురూ ఉండే విశాలమైన ప్రాంగణాలు కూడా కచ్చితంగా సమస్యాత్మకం అని చెప్పవచ్చు.

అందుకు ఉదాహరణగా దక్షిణ కొరియాలో ఓ కార్యాలయంలో జరిగిన ఘటనను ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ 214 మంది ఉండే ఓ కార్యాలయంలో ఏకంగా 94 మంది కోవిడ్-19 బారిన పడ్డారు. వారిలో మెజార్టీ వ్యక్తులు ఒకే అంతస్థులో విశాలంగా ఉన్న ప్రాంతంలో కూర్చొని కలిసి పని చేశారు.

డెంటిస్టులకు ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వారు రోగులకు చికిత్స చేసే సమయంలో భారీ స్థాయిలో నీటి తుంపర్లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కనుక కచ్చితంగా వారు పని చేసే ప్రాంతంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రోగుల నుంచి వారికి, లేదా వారి నుంచి రోగులకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి కూడా ప్రమాద తీవ్రతగా ఎక్కువగానే ఉంటుందని డాక్టర్ బ్రోమజ్ తెలిపారు.

ఇంటా... బయటా...

బహిరంగ వాతావరణ పరిస్థితుల నుంచి ఇటువంటి వైరస్‌లు వ్యాపించిన సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయని డాక్టర్ బ్రోమజ్ అభిప్రాయపడ్డారు.

గాలి, ఖాళీ ప్రదేశాలు వైరస్ లోడ్‌ను పలుచన చేస్తాయి. అలాగే సూర్యరశ్మి, వేడి, గాల్లోని తేమ కూడా వైరస్‌ మనుగడపై ప్రభావం చూపిస్తాయి.

సామాజిక దూరం పాటించడం, సమావేశాల సమయాన్ని వీలైనంత కుదించుకోవడం ద్వారా కూడా ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు.

అయితే కొన్ని సార్లు నాలుగు గోడల మధ్య చర్చలు కూడా ప్రమాదానికి దారి తీయవచ్చు.

అంతా కలిసి ఒక్క చోట చేరి మాట్లాడటం, పాటలు పాడటం, కలిసి బిగ్గరగా అరుస్తూ గోల చేసే ఎటువంటి కార్యక్రమాలైనా అత్యంత ప్రమాదకరం.

ఎక్కువ సమయం నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల సామాజిక దూరం పాటించినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

పరిమిత స్థాయిలో వెంటిలేషన్ ఉండే చోట లేదా ఒకరు వదిలిన గాలిని వేరకొరు పీల్చడం వల్ల కూడా తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ప్రమాదాన్ని అంచనావేయడం ఎలా ?

కరోనావైరస్ ఆంక్షలు క్రమంగా సడలిస్తున్న ఈ పరిస్థితుల్లో మన ప్రతి కదలికను మనమే చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని డాక్టర్ బ్రోమజ్ చెబుతున్నారు.

నాలుగు గోడల మధ్య పని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పని చేస్తున్న ప్రదేశంలో వెంటిలేషన్ ఎలా ఉంటుంది? ఎంత మందితో, ఎంత సమయం కలిసి పని చేయాల్సి వస్తుందన్న అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

“మీరు గాలి, వెలుతురు బాగా ఉండే ప్రాంతంలో, కొద్ది మందితో మాత్రమే కలిసి కూర్చొని పని చేస్తే ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

అదే.. మీరు నాలుగు గోడల మధ్య ఉండే విశాలమైన ప్రాంగణంలో ఉండాల్సి వస్తే కచ్చితంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది” అని బ్రోమజ్ అన్నారు.

ఉదాహరణకు తక్కువ జన సాంద్రత, భారీగా వెంటిలేషన్ ఉన్న ఓ పెద్ద షాపింగ్ మాల్‌లో మీరు కొద్ది సేపు మాత్రమే షాపింగ్ చేస్తే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. కానీ అదే స్టోర్‌లో ఎక్కువ సేపు పని చేసే వ్యక్తులకు మాత్రం ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది” అని బ్రోమజ్ స్పష్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఇన్ఫెక్షన్‌తో కూడిన నీటి తుంపరలు చాలా త్వరగా మాయమైపోతాయి. కానీ వ్యాధి సోకడానికి డోసు-టైం అన్న రెండు విషయాలు చాలా ముఖ్యమన్న సంగతిని మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

“ఇక ఇక్కడ నేను చెప్పదల్చుకున్న మరో ముఖ్యమైన విషయమేంటంటే వివిధ వస్తువుల ఉపరితలాలు. ఇన్ఫెక్షన్‌తో కూడిన నీటి తుంపర్లు ఏ వస్తువు ఉపరితలంపైనైనా ఉండవచ్చు. అందుకే తరచు చేతులు కడుక్కోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ముఖాన్ని పదే పదే తాకడాన్ని మాత్రం మర్చిపోండి” ఆయన హెచ్చరించారు.

చివరిగా ఇకపై మీరు మీ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ సమయంలో వెలిగించిన కొవ్వొత్తుల్ని ఊది ఆర్పే సరదాకి కూడా పూర్తిగా స్వస్తి చెప్పాల్సి ఉంటుందని డాక్టర్ బ్రోమజ్ తేల్చి చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)