తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్: మే 31 వరకు లాక్‌డౌన్.. హైదరాబాద్‌లో టాక్సీలు, ఆటోలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులకు అనుమతి

తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం నుంచి హైదారాబాద్ నగరంలో తప్ప రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడుపుతామని తెలిపారు. అయితే అంతరాష్ట్ర సర్వీసులను నడిపేది లేదని, అలాగే తెలంగాణలోకి అనుమతించేది కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇకపై రైతులు ప్రభుత్వం చెప్పిన పంటల్ని మాత్రమే వేయాలని, లేకపోతే రైతు బంధు పథకం వర్తించదని తేల్చి చెప్పారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కల్గితే చూస్తూ ఊరుకోబోమన్నారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఒట్టి డొల్ల అని విమర్శించారు.

కేసీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే:

  • రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాల్లో తప్ప అన్ని జోన్లను గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తున్నాం.
  • కరోనాకు వ్యాక్సీన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. ఎన్ని మాసాలు ఇది కొనసాగుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం కరోనాతో కలిసి జీవించడం తప్ప గత్యంతరం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ బతుకును కొనసాగించాల్సిందే. ఇలా ఎక్కువ కాలం కొనసాగలేం.
  • హైదరాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో అన్ని షాపులు తెరచుకోవచ్చు.
  • హైదరాబాద్ నగరంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగవు. మిగిలిన ప్రాంతాల్లో సరి,బేసి విధానంలో షాపులు తెరచుకోవచ్చు.
  • రేపు ఉదయం నుంచే ఆర్టీసి బస్సులు తిరుగుతాయి.
  • సిటీ బస్సులకు, అంతరాష్ట్ర సర్వీసులకు అనుమతి లేదు. తెలంగాణ సరిహద్దుల్లోపు మాత్రమే ఆర్టీసి సర్వీసులు నడుస్తాయి.
  • సిటీలో, ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి.
  • ట్యాక్సీలో 1+3, ఆటోల్లో 1+2 ప్రయాణీకులకు మాత్రమే అనుమతి. కార్లలో కూడా 1+3 విధానం పాటించాలి.
  • రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లు కూడా తెరచుకోవచ్చు.
  • ఈ కామర్స్‌ వ్యాపార కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో అనుమతి.
  • ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్-19 నిబంధనలను అనుసరిస్తూ నడుస్తాయి. అందుకు ఇప్పటికే ఆర్టీసీ సిద్ధమైంది.
  • ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూ 100 శాతం కార్యకలాపాలు నిర్వహించవచ్చు.
  • పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ విభాగాలు కూడా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించవచ్చు.
  • మే 31 వరకు కర్ఫ్యూ ఉంటుంది.
  • అన్ని మతాల ప్రార్ధనాలయాలకు ఎటువంటి అనుమతులు లేవు.
  • ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ బంద్.
  • సభలు, ర్యాలీలు బంద్.
  • అన్ని రకాల విద్యా సంస్థలు బంద్.
  • బార్లు, పబ్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్, పార్కులు, స్టేడియంలు, అమ్యూజ్మెంట్ పార్కులు బంద్.
  • మెట్రో రైళ్లు కూడా నడవవు.
  • ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి తీరాల్సిందే. లేదంటే వెయ్యి రూపాయల ఫైన్ తప్పదు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.
  • వ్యక్తిగత శానిటైజేషన్ తప్పనిసరి. షాపుల్లో షాపు ఓనర్లే కస్టమర్ల కోసం శానిటైజేషన్ ఏర్పాట్లు చేసుకోవాలి.
  • షాపుల్లో వినియోగదారులు కూడా కోవిడ్-19 నిబంధనలు పాటించాలి.
  • అవసరం లేని వాళ్లు రోడ్లపైకి వచ్చి హంగామా చెయ్యవద్దు. అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రండి.
  • 65 ఏళ్లు దాటిన వృద్ధులు, చిన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దు.

వ్యవసాయం రంగం

  • రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చెయ్యాల్సిన అవసరం ఉంది. రైస్ మిల్లర్లు, వ్యాపార సంస్థలు, ప్రొఫెసర్లు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో ఎన్నో సమావేశాలు నిర్వహించాం. దేశంలోనే అద్భుతమైన పత్తిని తెలంగాణలో పండిస్తున్నాం. కాటన్ పంటకు మరింత క్వాలిటీ పెంచాల్సినవసరం ఉంది. తెలంగాణ, విదర్భలో మాత్రమే ఈ తరహా పత్తి పండుతుంది.
  • ఈ ఏడాది ఏ పంటలు వేయాలి, ఎలా వేయాలి అన్న విషయంపై అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. రైతులు ఇష్టం వచ్చిన పంటలు వేసి ఇబ్బందులు పడవద్దు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల్ని మాత్రమే వేయండి. ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని రైతులు కచ్చితంగా పాటించాలి. గత ఏడాది కోటి 23 లక్షల ఎకరాల్లో పంటలు వచ్చాయి. ఈ మరో పది లక్షల ఎకరాల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది 70లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండించాలి. గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పండించారు.
  • పత్తి వల్ల ఎకరానికి రూ.50 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. 40 లక్షల ఎకరాల్లో వరి పంట వెయ్యాలి. ఏ రకాలు వెయ్యాలన్నది ప్రభుత్వం చెబుతుంది. రైతులు ఆ రకాలు మాత్రమే వెయ్యాలి. డిమాండ్ ఉన్న పంటల్ని ప్రభుత్వం గుర్తించింది.
  • వర్షాకాలంలో మొక్క జొన్న (మక్క) బదులు కంది, పత్తి పండించండి. కందిని 15 లక్షల ఎకరాల వరకు వేద్దాం. కంది పంటను మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం ప్రతిసారి మక్క పంటను ప్రభుత్వం కొనలేదు. ప్రస్తుతం సంక్షోభం నెలకొంది కాబట్టి మాత్రమే కొన్నాం. వర్షాకాలంలో మొక్క జొన్న వద్దు, వేసవిలో మాత్రమే వేద్దాం. ఎంత మేర వెయ్యాలన్నది ప్రభుత్వమే చెబుతుంది.
  • కూరగాయలు 2 లక్షల ఎకరాల్లో పండించవచ్చు. నిజామాబాద్,నిర్మల్, జగిత్యాల 1.25 ఎకరాల్లో పసుపు పంట వేసుకోవచ్చు. ఎండు మిర్చి 2.5లక్షల ఎకరాల్లో మిర్చి పండించవచ్చు.అందరికీ రైతు బంధు ఇస్తాం. ప్రభుత్వం చెప్పిన పంట వెయ్యకుండా వేరే పంటలు వేసిన వారికి రైతు బంధు పథకం వర్తించదు.

కృష్ణా జలాలపై...

  • కృష్ణా జలాల నీటి వాటాలకు సంబంధించి కేసీఆర్‌కు, తెలంగాణ రాష్ట్రానికి పూర్తి అవగాహన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిపిన అధికారిక కేటాయింపుల మేరకే మేం అన్ని ప్రాజెక్టులు కడుతూ వస్తున్నాం.
  • మేం చట్టం పరిధిలో, మా వాటా పరిధిలో మేం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. మేం ఎక్కడా ఏ నిబంధనల్ని అతిక్రమించలేదు.
  • కావాలనుకుంటే ఏపీ ప్రభుత్వం రాయలసీమకు గోదావరి నీళ్లు తీసుకెళ్లవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ విషయంలో గతంలోనే వారికి మేం స్పష్టం చేశాం. మా రాష్ట్రానికి ఇబ్బంది పెట్టే వైఖరితో వ్యవహరిస్తే కచ్చితంగా వ్యతిరేకిస్తాం. గోదావరిలో మా వాటా 950 టీఎంసీలు కాకుండా అదనంగా మరో 650 టీఎంసీల నీరు కూడా కావాలని గతంలోనూ కేంద్రాన్ని కోరాం. ఇప్పుడు కూడా కోరుతున్నాం.

టీఎస్ఆర్టీసీ ప్రజా రవాణ

  • హైదరాబాద్‌ జిల్లాలనుంచి జూబ్లీ బస్టాండ్‌కి మాత్రమే బస్సులను అనుమతిస్తాం. ఇమ్లిబన్ బస్టాండ్‌కు అనుమతి లేదు.
  • రాత్రి ఏడు గంటల లోపే బస్సులు గమ్యాన్ని చేరుకోవాలి. కొన్ని దూర ప్రాంతాల విషయంలో ప్రత్యేకంగా అనుమతులు ఇస్తాం.
  • ప్రైవేటు సర్వీసులు, సొంత వాహనాలు అన్నింటినీ అనుమతిస్తున్నాం.

కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఒట్టి డొల్ల

  • ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ఒట్టి డొల్ల. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది రూ. లక్ష కోట్లు కూడా లేదని అంతర్జాతీయ వార్తా సంస్థలు విమర్శిస్తున్నాయి. నియంతృత్వ వైఖరితో కేంద్రం వ్యవహరిస్తోంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.
  • ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని మేం కోరాం. కానీ రాష్ట్రాలను కేంద్రం బిచ్చగాళ్లలా చూస్తోంది. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్రాలను ప్రోత్సహించే విధానం కాదు.
  • కేంద్రం తన పరువు తానే తీసుకుంది. రాబోయే రోజుల్లో నిజం ఏంటన్నది ప్రజలకు తెలుస్తుంది. రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడం సమాఖ్య విధానానికే విఘాతం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)