You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దుబయిలో బంగారం భారత్‌లో కంటే స్వచ్ఛమైనదా? నాణ్యతలోనూ తేడా ఉంటుందా?
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
దుబయి నుంచి బంధువులు, స్నేహితులు భారత్‌కు వస్తుంటే వారితో బంగారం తెప్పించుకునే వాళ్ల గురించి మీరు వినే ఉంటారు.
తెలంగాణ నుంచి ఉపాధి నిమిత్తం దుబయి వలస వెళ్లిన వారు తిరిగొచ్చేటప్పుడు, తమ స్థాయికి తగినట్లుగా బంగారం తీసుకురావడం సర్వసాధారణం.
'దుబయిలో బంగారం తక్కువ ధరకు వస్తుంది. పచ్చగా మెరిసిపోతుంటుంది, క్వాలిటీ బాగుంటుంది' అని కొంతమంది తెలుగు ప్రజలు చెబుతుంటారు. మరి ఇందులో నిజమెంత?
నిజంగానే బంగారం నాణ్యతలో తేడా ఉంటుందా? ధరలో వ్యత్యాసం అంత ఎక్కువగా ఉంటుందా?
మరోవైపు ప్రస్తుతం భారత్‌లో బంగారం ధర రూ. లక్షన్నర దాటి పరుగులు పెడుతోంది.
ఒక గ్రాము మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర రూ. 15,520 ఉన్నట్లుగా బుధవారం (జనవరి 21) మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సంస్థ రోజుకు రెండుసార్లు బంగారం ధరలను ప్రకటిస్తుంది.
ఈ లెక్కన 24 క్యారెట్ల నాణ్యత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,55,200కు చేరింది.
దుబయి బంగారం vs భారత్ బంగారం... ఏది మంచిది?
ఇప్పుడు దుబయి బంగారానికి, భారత్‌లో లభించే బంగారానికి నాణ్యత విషయంలో ఎలాంటి తేడా లేదని బీబీసీతో హైదరాబాద్‌లోని పాట్ మార్కెట్ జ్యూయలరీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సునీల్ కుమార్ జైన్ చెప్పారు.
'1990లలో భారత్‌లో 18 క్యారెట్ల బంగారం ఎక్కువగా చెలామణిలో ఉండేది. అప్పుడు మనకు 22 క్యారెట్ బంగారం ఎక్కువగా అందుబాటులో లేదు. కస్టమర్లకు కూడా 22 క్యారెట్స్ బంగారంపై ఎక్కువగా అవగాహన లేకపోయేది. నగల వర్తకులు కూడా ఆ క్వాలిటీ ఇవ్వలేకపోయేవారు. కానీ, భారత్‌లో హాల్‌మార్క్ తీసుకొచ్చాక దుబయి బంగారం, ఇక్కడి బంగారం స్వచ్ఛత సమానంగా ఉంది' అని ఆయన వివరించారు.
క్యారెట్ లెక్క పరంగా, బంగారం నాణ్యత నియంత్రణ పరంగా ఈ రెండు దేశాలు ఒకేలా, చాలా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయని ఆయన అన్నారు.
అయితే, రెండు దేశాలకు సంబంధించి ఆభరణాల డిజైన్, తయారీ విధానంలో తేడాలుండొచ్చని చెప్పారు.
'దుబయిలో ఎక్కువగా యంత్రాలతో నగలు తయారు చేస్తారు. భారత్‌లో సంప్రదాయక నగలను ఇష్టపడతారు. ఎక్కువగా చేతితోనే ఈ ఆభరణాలు తయారు చేస్తారు' అని ఆయన వివరించారు.
క్యారెట్ లెక్క రెండు దేశాల్లో ఒకటేనా?
ఆభరణాల తయారీకి రెండు చోట్లా 22 క్యారెట్లు (91.6% బంగారం), 18 క్యారెట్లు వంటి ప్రమాణాలనే వాడతారని, క్యారెట్ ఒకటే అయితే స్వచ్ఛత కూడా ఒకేలా ఉంటుందని కరీంనగర్, పెద్దపల్లికి చెందిన స్వర్ణకారులు తెలిపారు.
సాంకేతికంగా చెప్పాలంటే, ప్రపంచంలో ఎక్కడైనా 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత 91.6 శాతంగానే ఉంటుందని సునీల్ జైన్ స్పష్టం చేశారు.
'బంగారం లోహాన్ని ఆభరణంగా మార్చినప్పుడు దాని స్వచ్ఛత 100 శాతం ఉండదు. బంగారంలో ఇతర లోహాలను కలిపితేనే ఆభరణాలు తయారవుతాయి. ఇలా ఇతర లోహాలు కలిసిన బంగారం స్వచ్ఛత 91.6 శాతంగా ఉంటుంది. దీన్నే 22 క్యారెట్ గోల్డ్ అని, 916 బంగారం అని పిలుస్తాం. ఇందులో మిగిలిన 8.4 శాతం రాగి, జింక్, వెండి వంటి లోహాలు కలగలిసి ఉంటాయి. అలాగే 18 క్యారెట్ల బంగారం (75 శాతం స్వచ్ఛత) కూడా ఉంటుంది. దీని స్వచ్ఛత కూడా ప్రపంచంలో ఒకే విధంగా ఉంటుంది' అని ఆయన వివరించారు.
ఇలా చూస్తే మీరు దుబయిలో కొన్నా, లేదా ఇండియాలో కొన్నా బంగారం నాణ్యత ఒకే విధంగా ఉంటుందని చెప్పారు.
అయితే ఆభరణాలు చేసేటప్పుడు బంగారంలో కలిపే లోహాన్ని బట్టి రంగులో కొంచెం తేడా వస్తుందని స్వర్ణకారులు అంటున్నారు.
పచ్చగా ధగధగలాడితే స్వచ్ఛమైన బంగారమా?
సాధారణంగా దుబయిలో బంగారు ఆభరణాల తయారీలో ఎక్కువగా జింక్, వెండి వాడుతుంటారని సునీల్ జైన్ చెప్పారు.
ఈ విషయం గురించి 20 ఏళ్లుగా స్వర్ణకార వృత్తిలో ఉన్న సోదరులు రావుల బ్రహ్మం, శ్రీనివాస్ వివరించారు.
'బంగారంలో జింక్ ఎక్కువగా కలిపితే ఎక్కువగా పసుపు వర్ణం వస్తుంది. అందుకే పచ్చగా కనిపిస్తుంది.
భారత్‌లో ఎక్కువగా వెండి, రాగి కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. బంగారానికి రాగి కలిపినప్పుడు కాస్త ఎరుపు రంగు వస్తుంది.
ఇలా వెండి, రాగి కలిపే మోతాదులను బట్టి రంగులో మార్పులు వస్తుంటాయి. అయితే రంగు మారినంత మాత్రానా బంగారం నాణ్యత మారదు' అని వారు వివరించారు.
బంగారం నాణ్యతను ఎవరు నిర్ధరిస్తారు?
ఒకప్పుడు ఇండియాలో బంగారం క్వాలిటీపై అనుమానాలు ఉండేవని స్థానిక స్వర్ణకారులు అంటున్నారు.
భారత్‌లో బంగారు ఆభరణాలకు 2021 జూన్ 15 నుంచి హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగే 2023 ఏప్రిల్ నుంచి నగలపై ఆరు అంకెలు గల హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ)ను కచ్చితంగా వేయాలని ఆదేశించింది. బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు ఈ హెచ్‌యూఐడీని ఎంటర్ చేసి తమ నగల నాణ్యతను తెలుసుకోవచ్చు.
భారత్‌లో హాల్‌మార్క్ తీసుకొచ్చినప్పటినుంచి బంగారం నాణ్యతపై అందరి అనుమానాలు తొలగిపోయాయని కరీంనగర్‌కు చెందిన స్వర్ణకారుడు కందుకూరి నాగరాజు చెప్పారు.
ఏదైనా విలువైన లోహంతో తయారుచేసే వస్తువులో ఆ లోహం ఎంత శాతముందో కచ్చితంగా నిర్ధరించి, అధికారికంగా ముద్ర వేయడమే హాల్‌మార్కింగ్. ఇది చాలా దేశాల్లో విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది.
ఈ వస్తువులు కల్తీ కాకుండా చూడటం, తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశాలు.
చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఎస్ఐ) హాల్‌మార్క్ లైసెన్స్ ఇస్తుంది.
ఈ లైసెన్స్ పొందిన జ్యూయలరీ దుకాణదారులంతా హాల్ మార్క్ సీల్ వేయవచ్చు. హాల్ మార్క్ లేకుండా ఏ నగ అమ్మినా అది నేరమే.
బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ&హెచ్ కేంద్రాల్లో వినియోగదారులు తమ నగలను పరీక్ష చేయించుకోవచ్చు.
బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాల స్వచ్ఛతను నిర్ధరించడానికి దుబయ్‌లో 'బరీఖ్' అనే ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
దుబయిలో ధర తక్కువా?
బంగారం ధర విషయంలో భారత్, దుబయి మధ్య తేడా ఉంటుందని సునీల్ జైన్ చెప్పారు. దుబయిలో కస్టమ్స్ డ్యూటీ లేకపోవడం వల్ల బంగారం ధర కాస్త తక్కువ ఉంటుందని తెలిపారు.
'దుబయిలో ధర కాస్త తక్కువగా ఉన్నా, మీరు పరిమితికి మించి ఇండియాకు బంగారాన్నితీసుకొస్తే కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. అలాంటప్పుడు ఆ పన్నుతో కలిపి తీసుకొచ్చే బంగారం ధర, భారత్‌లో ధరతో సమానం అవుతుంది. దీంతో ధరలో పెద్ద తేడా ఏం కనిపించదు' అని సునీల్ జైన్ అభిప్రాయపడ్డారు.
ఎవరైనా విదేశాల్లో ఆరు నెలల్లోపే ఉండి తిరిగి వచ్చేప్పుడు బంగారం తీసుకువస్తే 38.5 శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలని హైదరాబాద్‌కు చెందిన కస్టమ్స్ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
'ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఉండి తిరిగివస్తే 13.75శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టాలి. ఇందులో మగవారు 20గ్రాములు, ఆడవారు 40 గ్రాములు ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ లేకుండా తీసుకుని రావచ్చు. కానీ కొందరు కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడానికి అక్రమ పద్ధతులలో తీసుకువస్తుంటారు. కొద్ది కాలం అక్కడ ఉండి పావు కిలో నుంచి కిలో వరకు తీసుకువస్తుంటారు. అలాంటప్పుడు 38.5శాతం కస్టమ్స్ డ్యూటీ కట్టకపోతే సీజ్ చేస్తాం. కిలోకు మించి తీసుకువస్తే అరెస్టు చేస్తాం'' అని ఆయన బీబీసీకి చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)