బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్‌ ఎందుకు వేస్తారు?

బంగారు ఆభరణాలకు 2021 జూన్ 15 నుంచి హాల్‌మార్క్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.

నిజానికి గతంలో జూన్ 1 వరకు మాత్రమే గడువు విధించిన కేంద్రం, కోవిడ్ కారణంగా దాన్ని జూన్ 15 వరకు పొడిగించింది.

జూన్ 15 నుంచి విక్రయించే బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ షాపుల్లో 14, 18, 22 క్యారెట్ల ఆభరణాలను అమ్మడానికి మాత్రమే అనుమతిస్తారు.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ తివారీ నేతృత్వంలోని ఒక కమిటీ ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా చూసుకుంటుందని పీటీఐ వార్తా సంస్థ చెప్పింది.

గత ఐదేళ్లలో దేశంలోని హాల్ మార్క్ కేంద్రాలు 25 శాతం పెరిగాయని కేంద్రం చెబుతోంది.

"బంగారం అమ్మకాలకు హాల్ మార్క్ తప్పనిసరి అనేది నిన్నటి (జూన్ 15) నుంచే దేశమంతా అమలులోకి వచ్చింది. కానీ దానిని కొన్నిచోట్ల కఠినంగా అమలు చేయడం లేదు" అని బంగారం వర్తక సంఘాలు చెబుతున్నాయి.

'హాల్‌మార్క్' అంటే?

ఏదైనా విలువైన లోహంతో తయారుచేసే వస్తువులో ఆ లోహం ఎంత శాతముందో కచ్చితంగా నిర్ధరించి, అధికారికంగా ముద్ర వేయడమే హాల్‌మార్కింగ్. ఇది చాలా దేశాల్లో విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది.

ఈ వస్తువుల కల్తీ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, వీటి తయారీలో తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశాలు.

చెన్నైలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఎస్ఐ) హాల్‌మార్క్‌ లైసెన్స్ ఇస్తుంది.

ఈ లైసెన్స్ పొందిన జ్యూయలరీ దుకాణదారులంతా హాల్ మార్క్ సీల్ వేయవచ్చు. హాల్ మార్క్ లేకుండా ఏ నగ అమ్మినా అది నేరమే.

అయితే ఈ లైసెన్స్ తీసుకోవడం ఆర్థికంగా భారం అవుతుందని కొందరు చిన్న వ్యాపారులు అంటున్నారు.

"ప్రస్తుతం ఏపీ, తెలంగాణాలోని బంగారు దుకాణ యాజమానులంతా హాల్ మార్క్ నగలను మాత్రమే అమ్ముతున్నారు" అని విశాఖలోని బీఎస్ఐ లైసెన్స్ కలిగిన ఎస్బీఎం అసెస్సింగ్ అండ్ హాల్‌మార్క్ సెంటర్ నిర్వాహకులు మంజరి బీబీసీతో చెప్పారు.

ఏదైనా నగకు హాల్ మార్కింగ్ వేయాలంటే రూ. 50 నుంచి రూ. 100 వరకు, దానికి సర్టిఫికేట్ కూడా కావాలంటే మరో రూ. 60 అదనంగా తీసుకుంటామని ఆమె తెలిపారు.

భారత్‌లో ప్రస్తుతం రెండు విలువైన లోహాలు బంగారం, వెండి హాల్‌మార్కింగ్‌లో పరిధిలో ఉన్నట్లు బీఐఎస్ చెబుతోంది. హాల్‌మార్కింగ్‌పై అంతర్జాతీయ విధివిధానాలకు అనుగుణంగా తమ హాల్‌మార్కింగ్ కార్యక్రమం ఉందని పేర్కొంటోంది.

బీఐఎస్ హాల్‌మార్కింగ్ నిబంధనలను 2018 జూన్ 14న నోటిఫై చేశారు. బంగారు నగలకు హాల్‌మార్కింగ్ కార్యక్రమాన్ని బీఐఎస్ 2000 ఏప్రిల్ నుంచి అమలు చేస్తోంది.

బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణ విక్రేతలు వారి నగలకు బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ&హెచ్ కేంద్రాల నుంచి హాల్‌మార్కింగ్ పొందవచ్చు.

2019 అక్టోబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 877 ఏ&హెచ్ కేంద్రాలు ఉన్నాయి. 26,019 మంది బంగారు ఆభరణాల వ్యాపారులు బీఐఎస్ వద్ద నమోదు చేయించుకున్నారు.

2019 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 43, తెలంగాణలో 31 ఏ&హెచ్ కేంద్రాలు ఉన్నాయి. బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ&హెచ్ కేంద్రాల్లో వినియోగదారులు తమ నగలను పరీక్ష చేయించుకోవచ్చు.

దీనితో ప్రజలకు మేలు: ఆభరణ విక్రేతల సంఘం

గ్రామాల్లో చాలా మంది చిన్న వ్యాపారస్తులు అమ్మే బంగారు నగల్లో బంగారం 60 నుంచి 70 శాతం మధ్యే ఉంటోందని, కానీ దీనిని 91.6 (22 క్యారెట్స్) శాతం బంగారమని అమ్ముతున్నారని, దీనివల్ల కొనుగోలుదారులు మోసపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా అమలుచేయడం ప్రజలకు మేలు చేస్తుందని 'ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్' ఏపీ శాఖ అధ్యక్షుడు విజయ్ కుమార్ గతంలో బీబీసీతో చెప్పారు.

భారత్‌లో ఏటా 800 టన్నుల వినియోగం

భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. పసిడి వినియోగం పెరుగుతూ వస్తోంది.

1982లో వార్షిక వినియోగం 65 టన్నులుగా ఉందని అంచనా. 2019 నవంబర్ నాటికి ఇది 800 టన్నులపైనే ఉంది.

పసిడిలో దాదాపు 80 శాతం ఆభరణాల (ప్రధానంగా 22 క్యారెట్ స్వచ్ఛత) తయారీకే వెళ్తోంది.

ఫిక్కీ అధ్యయనం ప్రకారం భారత్‌లో బంగారం ప్రాసెసింగ్ పరిశ్రమలో దాదాపు 15 వేల సంస్థలు ఉన్నాయి. దాదాపు 80 యూనిట్లకు 50 లక్షల డాలర్లకు పైగా రాబడి ఉంది.

దేశంలో దాదాపు నాలుగున్నర లక్షల మంది స్వర్ణకారులు, లక్ష మందికి పైగా బంగారు నగల అమ్మకందారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)