You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ 80 టన్నుల బంగారాన్ని ఈ చెరువులోనే దాచారా?
ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ 1812లో మాస్కో నుంచి పారిపోయే సందర్భంలో కొల్లగొట్టిన టన్నులకొద్దీ బంగారం రహస్యం తనకు తెలుసునంటూ రష్యాకు చెందిన చరిత్రకారుడు ఒకరు కొత్త కథనాన్ని వినిపిస్తున్నారు.
200 ఏళ్లుగా ట్రెజర్ హంటర్స్ దీనికోసం వెతుకుతున్నా ఎవరూ సరైన ప్రాంతంలో వెతకడం లేదని ఆయన అంటున్నారు.
బంగారం కావాలంటే బెలారస్ సరిహద్దుల్లో ఉన్న తన స్వస్థలం రుదన్యాకు సమీపంలోని బోల్షయా రుటావెచ్ చెరువులో వెదకాలని వయాచెస్లావ్ రైజ్‌కోవ్ అనే చరిత్రకారుడు సూచించారు.
200 ఏళ్ల కిందట నెపోలియన్ సైన్యం మాస్కోను లూటీ చేసి, ఫ్రాన్స్ పారిపోయేటప్పుడు 80 టన్నుల బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకుంది.
అయితే తిరిగి వెళ్లడం కష్టం కావడంతో 400 బళ్లలోని ఆ నిధిని ఒకచోట దాచిపెట్టారని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
నెపోలియన్ సిబ్బందిలో ఒకరైన జనరల్ ఫిలిప్ డి సెగర్ స్మోలెన్స్క్ ప్రాంతంలోని సెమ్‌లెవో చెరువులో దానిని పడేశామని తెలిపారు.
ఆ చెరువుకు సమీపంలోనే ఫ్రెంచ్ సైన్యం తమ ఆయుధాలను పెద్ద ఎత్తున విడిచి వెళ్లడంతో, ఆయన కథనం నిజమేనన్న భావన ఉంది.
దీంతో 1830 నుంచి అనేక మంది రష్యా అధికారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, ట్రెజర్ హంటర్లు ఆ చెరువులో వెదుకుతున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
కానీ కొందరు చరిత్రకారులు మాత్రం నిజంగా ఆ బంగారాన్ని దాచిన ప్రాంతం నుంచి అన్వేషకులను మల్లించడానికి సెగర్ ఈ ప్రకటన చేసి ఉంటారని అనుమానించారు.
ఆ బంగారం బెలారస్‌లోని బెరెజినా నదిలో పారవేసి ఉండవచ్చని సూచించారు. దీనిపై 2012లో ఫ్రెంచి-బెలారస్ కలిసి ఒక సంయుక్త బృందాన్ని నియమించినా ఫలితం దక్కలేదు.
తాజాగా రష్యా జాతీయ మీడియాలో వెలువడిన రైజ్‌కోవ్ కథనం మరోసారి అందరి దృష్టినీ ఆ బంగారం పైకి మరల్చింది.
నెపోలియన్ తప్పుదోవ పట్టించారా?
రష్యా గూఢచారులను తప్పుదోవ పట్టించడానికి నెపోలియన్ ఒక కాన్వాయ్‌ను సెమ్‌లెవో చెరువు వైపు పంపి ఉంటారని రైజ్‌కోవ్ అంటున్నారు.
ఒకవైపు రష్యా గూఢచారులు ఆ కాన్వాయ్ వెంట వెళ్లగా, మరోవైపు బంగారాన్ని, ఇతర విలువైన వస్తువులను దక్షిణాన ఉన్న రుదన్యా సమీపంలోని బోల్షయా రుటావెచ్ చెరువులో పడేశారని ఆయన అన్నారు.
బంగారాన్ని, విలువైన వజ్రాలను ఆ చెరువు మధ్యలోని బురద మట్టిలో జాగ్రత్తగా దాచి ఉంచారని రైజ్‌కోవ్ అంటున్నారు.
తన కథనానికి మద్దతుగా రైజ్‌కోవ్.. 1989 నుంచి ఆ చెరువులో సిల్వర్ అయాన్ పరిమాణం గణనీయంగా పెరిగిందని తెలిపారు.
తగిన పరికరాలు, నిపుణులతో చెరువు మధ్య భాగంలో ఉన్న బురద నుంచి ఆ నిధిని ఇప్పటికైనా వెలికి తీయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే రైజ్‌కోవ్ మాటలను చాలామంది విశ్వసించడం లేదు.
వృత్తిరీత్యా అలాంటి రహస్య నిధులను అన్వేషించే వ్లాదిమీర్ పోరివయేవ్.. రైజ్‌కోవ్ వాదనను కొట్టిపారేశారు.
''అనేక శతాబ్దాలుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు రష్యాపై దండయాత్ర సందర్భంగా నెపోలియన్ ఎక్కడెక్కడికి వెళ్లారు, ఏం చేశారన్న దానిపై సమగ్ర వివరాలు సేకరించారు. ఆయన తన సైన్యాన్ని వదిలి పెట్టి 400 బళ్లలో బంగారాన్ని తీసుకెళ్లి దాచారన్న కథనం నమ్మశక్యం కాదు'' అని పోరివయేవ్ అన్నారు.
'అభూత కల్పన'
అదే విధంగా చెరువులో సిల్వర్ అయాన్ సిద్ధాంతాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. ఫ్రెంచి సైన్యం గడ్డకట్టే నీటిలో బంగారాన్ని ఎలా దాచి ఉంటుందని, వాళ్లేమైనా స్కూబా దుస్తులు వేసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ అభూత కల్పనలని ఆయన కొట్టిపారేశారు.
నిధి కారణంగానే సిల్వర్ అయాన్ పరిమాణం పెరిగినట్లు రైజ్‌కోవ్ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని సవాలు విసిరారు. బహుశా అక్కడి సహజసిద్ధమైన నేల స్వభావం కారణంగానే అది జరిగి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నెపోలియన్ నిధికి సంబంధించి అనేక మంది వ్యక్తులు వింత వింత కథనాలతో తన వద్దకు వస్తుంటారని, కానీ రైజ్‌కోవ్ కథనం చాలా ఆసక్తికరంగా ఉందని అన్నారు.
అయితే నెపోలియన్ దాచిన నిధి ఎక్కడో ఒక చోట ఉండి ఉండవచ్చని మాత్రం ఆయన అంగీకరించారు.
ఇవి కూడా చదవండి:
- AUS vs IND: 72 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- మైనస్ 35 డిగ్రీల చలిలో చైనా మంచు పండుగ
- మారుతున్న కేబుల్ ధరలు.. దేనికెంత
- సౌదీ అరేబియాలో తలాక్: 'రహస్య విడాకుల్లో' మహిళలకు మెసేజ్ తప్పనిసరి
- BBC Click ఎపిసోడ్ 4: ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే సరికొత్త టెక్నాలజీ...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)