You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
AUS vs IND: 72 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో తొలి టెస్ట్ సిరీస్ గెలిచిన భారత జట్టు
భారత్- ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
ఈ మ్యాచ్ జరుగుతున్న సిడ్నీ నగరంలో మధ్యాహ్నం దాటిన తర్వాత కూడా వర్షం పడుతుండటంతో టెస్ట్ డ్రా అయినట్లు ప్రకటించారు.
ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితం డ్రా అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం కొత్త చరిత్ర లిఖించింది.
ఇప్పటివరకూ భారత్ ఆస్ట్రేలియాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలుచుకోలేదు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 ఆధిక్యంతో గెల్చుకున్న కోహ్లీ సేన ఆ లోటును తీర్చేసింది.
చటేశ్వర్ పుజారాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది.
ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఇద్దరూ భారత ఆటగాళ్లే. పుజారా 521 పరుగులు సాధించగా, బుమ్రా 21 వికెట్లు తీశాడు.
సిరీస్ మొత్తంలో ఆస్ట్రేలియా జట్టు తరపున నమోదైన అత్యధిక వ్యక్తిగత పరుగులు 79.
తప్పని డ్రా
భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 622 పరుగులు చేసింది. పుజారా 193 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 159 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఆస్ట్రేలియా జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్ అయ్యి ఫాలో ఆన్ ఆడింది.
రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.
ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే... ఏదో ఒక జట్టు గెలవాల్సి ఉంది.
వాస్తవానికి భారత జట్టుకే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే, వర్షం తగ్గినప్పటికీ మరొక పూట ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులోని పది వికెట్లు తీయటం సాధ్యం కాకపోవచ్చు.
ఆస్ట్రేలియా గెలవాలంటే.. 316 పరుగుల కంటే ఎక్కువ పరుగులు చేసి, భారత జట్టును ఆలౌట్ చేయటం. ఇది అసాధ్యం.
కాబట్టి, ఈ టెస్ట్ డ్రా అయ్యింది.
భారత జట్టు ఫొటో సెషన్
ఐదో రోజు వర్షం వల్ల ఆట ఆగిపోవటంతో భారత జట్టు తమ సిబ్బందితో కలసి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఫొటో సెషన్‌లో పాల్గొంది.
క్రీడాకారులు, కోచ్, జట్టు మేనేజర్, సహాయ సిబ్బంది అంతా కలిసి ఫొటో దిగారు.
31 ఏళ్ల తర్వాత ఆతిథ్య జట్టు ఫాలోఆన్
ఆస్ట్రేలియా 300 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు 322 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాకు ఫాలోఆన్ ఇచ్చింది.
ఆస్ట్రేలియా జట్టు స్వదేశంలో ఫాలోఆన్ ఆడడం 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.
ఇంతకు ముందు 1988లో ఇంగ్లండ్ సిడ్నీలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాకు ఫాలోఆన్ ఇచ్చింది. భారత జట్టు కూడా 1986లో సిడ్నీలోనే ఆతిథ్య జట్టును ఫాలోఆన్ ఆడించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు మార్క్స్ హారిస్, ఉస్మాన్ ఖ్వాజా నాలుగు ఓవర్లలో ఆరు పరుగులు చేశారు. ఆ తర్వాత వెలుతురు సరిగా లేకపోవడంతో ఆట ఆగిపోయింది.
ఆస్ట్రేలియా భారత మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే 316 పరుగులు వెనకబడి ఉంది.
మొదటి ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు
ఒకే సంవత్సరంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన మొదటి భారత, ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు.
ఈ సిరీస్‌లో కోహ్లీ ఎప్పట్లాగా తన బ్యాటింగ్ ప్రతిభతో కాకుండా కెప్టెన్‌గా వ్యూహాలు రచించి ఆకట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
- మైనస్ 35 డిగ్రీల చలిలో చైనా మంచు పండుగ
- శబరిమల: అయ్యప్ప గుడిలోకి మహిళలు అడుగుపెట్టడం చరిత్రలో ఇప్పుడే జరిగిందా?
- నమ్మకాలు-నిజాలు: కాపురాలు కూల్చేసే తెల్లబట్ట
- మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ తెరలకు అతుక్కుపోతుంటే ఏం చేయాలి
- భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిడ్నీ టెస్ట్ మ్యాచ్‌లో ‘పింక్ సందేశం’
- ద్రవిడ్ గురించి ఆయన భార్య విజేత ఏమన్నారు?
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)