సిడ్నీ టెస్ట్: ఆస్ట్రేలియాపై రిషభ్ పంత్ కొత్త రికార్డు.. ధోనీకి సాధ్యం కానిది రిషబ్ సొంతమైంది

సిడ్నీ టెస్టులో రెండో రోజు భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డును సృష్టించాడు.

మహేంద్ర సింగ్ ధోనీ, ఫారూఖ్ ఇంజనీర్ లాంటి భారత టాప్ వికెట్‌ కీపర్లకు కూడా దక్కని ఘనతను సొంతం చేసుకున్నాడు.

సిరీస్‌లో నాలుగోది చివరిది అయిన టెస్టుకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పేన్‌ 'బేబీ సిట్టర్' చాలెంజ్ పూర్తి చేసిన పంత్ మైదానంలో ఆతిథ్య జట్టు బౌలర్లను ధాటిగా ఎదుర్కుని కేవలం 137బంతుల్లో సెంచరీ చేశాడు.

దీంతో పంత్ ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మెన్ అయ్యాడు.

చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాతో కీలక భాగస్వామ్యాలు అందించిన పంత్ సిడ్నీ టెస్టులో భారత్‌ను బలమైన స్థితిలో నిలిపాడు.

భారత్ ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగుల దగ్గర తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేసింది.

రిషభ్ కీలక భాగస్వామ్యాలు

తొమ్మిదో టెస్ట్ ఆడుతున్న రిషబ్ పంత్‌కు టెస్ట్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. ఇంతకు ముందు అతడు ఇంగ్లండ్‌లో సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌పై ఓవెల్ టెస్టులో పంత్ 114 పరుగులు చేశాడు.

సెంచరీ చేసిన రిషబ్ పంత్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్‌లో తనదైన శైలిలో ప్రశంసలు కురిపించాడు.

రిషబ్ పంత్ వెస్టిండీస్ మాజీ వికెట్‌ కీపర్ జెఫ్ డూజాన్ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో వికెట్‌ కీపర్‌ అయ్యాడు.

పుజారాతో కలిసి పంత్ ఐదో వికెట్‌కు 89 పరుగులు జోడించాడు.

పుజారా డబుల్ సెంచరీ మిస్

మొదటి రోజు 130 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారా రెండో రోజు తన జోరు కొనసాగించాడు. కానీ తన డబుల్ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. 193 పరుగులు చేసి నాథన్ లయన్ బంతికి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత పంత్, రవీంద్ర జడేజాతో కలిసి టీమ్ స్కోరును పరిగెత్తించాడు. పంత్‌కు అండగా నిలిచిన రవీంద్ర జడేజా 89 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సిడ్నీలో కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన పంత్ ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసినవారిలో రెండో స్థానంలో నిలిచాడు. సిరీస్‌లో అతడి కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ పుజారా మాత్రమే.

రెండో రోజు 622 పరుగుల దగ్గర రవీంద్ర జడేజా(81) అవుట్ కాగానే కెప్టెన్ కోహ్లీ భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. పంత్ 159 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)