You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘పది నిమిషాల డెలివరీ’ సేవలు ఆగిపోనున్నాయా, క్విక్ కామర్స్ కంపెనీలకు కేంద్రం ఏం చెప్పింది?
- రచయిత, నికిత యాదవ్, అభిషేక్ డెయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
‘‘పది నిమిషాల్లో డెలివరీ’’హామీని ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను కోరినట్టు సంబంధిత వర్గాలు బీబీసీకి చెప్పాయి.
డెలివరీ సిబ్బంది భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
ప్రమాదకర పని పరిస్థితులపై ఇటీవల డెలివరీ రైడర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయడంతో ఆయా కంపెనీల అధికారులతో కేంద్ర మంత్రిత్వ శాఖ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
పట్టణాల్లోని వినియోగదారులకు నిత్యావసరాల నుంచి ఎలక్ట్రాన్సిక్స్ తదితర సామాగ్రిని నిమిషాల్లో డెలివరీ చేస్తున్న జొమాటో, బ్లింకిట్, జెప్టో వంటి ప్రధాన సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఈ సేవలు వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందినప్పటికీ డెలివరీ రైడర్లపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయని, వారి భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయనే విమర్శలున్నాయి.
‘డెలివరీ రైడర్లపై ఒత్తిడి’
గత నెలలో వేలాది మంది డెలివరీ వర్కర్లు సమ్మెకు దిగారు. న్యాయమైన జీతాలు, గౌరవం, సురక్షితమైన పని పరిస్థితులు కావాలని డిమాండ్ చేశారు. వేగవంతమైన డెలివరీ సేవల కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితులపై ఈ నిరసనల కారణంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.
ఈ సమ్మె తర్వాత జరిగిన ఓ రహస్య సమావేశంలో క్లిష్టమైన డెలివరీ డెడ్‌లైన్‌లు విధించడం ఆపేయాలని ప్రభుత్వం క్విక్ కామర్స్ కంపెనీలను కోరిందని పేరు చెప్పడానికి ఇష్టపడని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
అన్ని సంస్థలు దీన్ని ఉపంసహరించుకున్నాయా లేదా అనేదానిపై స్పష్టత లేదు. బ్లింకిట్ ఇప్పటికే ''టెన్-మినిట్'' డెలివరీ హామీని తన బ్రాండింగ్, మార్కెటింగ్ నుంచి ఉపసంహరించుకుందని, మిగిలిన కంపెనీలు కూడా రానున్నరోజుల్లో దీన్ని అనుసరిస్తాయని ఆ అధికారి చెప్పారు.
అయితే చాలా ప్రాంతాల్లో డెలివరీ టైమ్ అంచనా యాప్స్‌లో ఇప్పటికీ పది నిమిషాలు సూచిస్తోంది. చాలా సర్వీసులు నివాసిత ప్రాంతాలకు సమీపంగా డార్క్ స్టోర్‌లు నిర్వహిస్తుండడంతో దూరం తక్కువే ఉండి వేగంగా డెలివరీలు పూర్తవుతున్నాయి.
దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా స్విగ్గీ, బ్లింకిట్ మాతృసంస్థ ఎటర్నల్‌ను, స్విగ్గీ, జొమాటోలను బీబీసీ సంప్రదించింది.
కోవిడ్ తర్వాత వేగంగా విస్తరించిన క్విక్ కామర్స్
కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలోని పలు నగరాల్లో క్విక్ కామర్స్ అతివేగంగా విస్తరించింది. దగ్గరిప్రాంతాలలో చిన్న వేర్‌హౌస్‌లు ఏర్పాటుచేసి నిమిషాల్లో నిత్యావసరాలు, ఇతర వస్తువులు డెలివరీ చేస్తున్నాయి.
భారత్‌లో గిగ్ ఎకానమీ వేగంగా విస్తరించే సమయానికే ఈ బూమ్ రావడంతో కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నీతి అయోగ్ అంచనా ప్రకారం 2021లో కార్మికుల సంఖ్య 77లక్షలు ఉండగా 2030నాటికి 2కోట్ల35లక్షలకు చేరుకుంది.
పోటీ పెరిగేకొద్దీ మరింత వేగవంతమైన డెలివరీలు చేస్తామని కంపెనీలు హామీలిచ్చాయి. నగరాల్లో షాపింగ్ అలవాట్లకు ఇవి కొత్తరూపును ఇచ్చాయి. అయితే ఈ హామీల వల్ల కస్టమర్లకు అంచనాలు పెరిగాయని, రైడర్లపై ఒత్తిడి పెరిగిందని, ఇది ప్రమాదకర డ్రైవింగ్‌కు దారితీసిందని విమర్శకులు చెబుతున్నారు.
‘చాలామందికి ఇదే ఆధారం’
వేగవంతమైన డెలివరీ టార్గెట్ల వల్ల పనిగంటలు పెరుగుతాయని, ఆర్థిక లక్ష్యాల ఒత్తిడి ఎక్కవగా ఉంటుందని ఇటీవల బీబీసీ ఇంటర్వ్యూల్లో డెలివరీ కార్మికులు చెప్పారు.
డెడ్‌లైన్ మిస్సయితే పెనాల్టీలు పడతాయని లేదంటే ఆర్డర్లు తగ్గుతాయని 23ఏళ్ల మొబిన్ అలమ్ చెప్పారు. ''నాకు వేరే దారి లేదు. నా కుటుంబాన్ని పోషించడానికి నేను ఎక్కువ గంటలు పనిచేయాల్సిందే'' అని ఆయన చెప్పారు.
కొన్నిసార్లు రోజుకు 12గంటల కన్నా ఎక్కువ పనిచేసినప్పటికీ నెలకు దాదాపు 20వేలు మాత్రమే సంపాదించగలుగుతున్నానని చెప్పారు.
"చాలా మందికి ఇది అదనపు జాబ్ కాదు. ప్రధాన జీవనాధారం'' అని ఓటీపీ ప్లీజ్, ఆన్‌లైన్ బయ్యర్స్, సెల్లర్స్, గిగ్ వర్కర్క్ రచయిత్రి, పరిశోధకురాలు వందనా వాసుదేవన్ చెప్పారు.
ఫుల్ టైమ్ పనిచేసినప్పటికీ, ఈ కార్మికులకు సామాజిక భద్రత లేదని, కెరీర్‌లో వృద్ధి ఉండదని, శిక్షణ, సామర్థ్యం మెరుగుపరుచుకునే అవకాశాలుండవని ఆమె తెలిపారు.
''అధికారికంగా వారిని సొంతంగా పనిచేసుకునేవారి జాబితాలో చేర్చినప్పటికీ వారు జీవనోపాధి కోసం ప్లాట్‌ఫామ్ అల్గారిథిమ్‌లపై ఎక్కవగా ఆధారపడ్డారు'' అని ఆమె చెప్పారు.
డెలివరీ కార్మికుల మిశ్రమ స్పందన
10- మినిట్ సర్వీసును తొలగించడాన్ని అనేక కార్మిక సంఘాలు స్వాగతించాయి.
"గిగ్ వర్కర్ల జీవితం, గౌరవాన్ని కాపాడే కీలకమైన, అవసరమైన అడుగు ఇది," అని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ అన్నారు.
కఠినమైన డెడ్‌లైన్లను అధికారికంగా విధించకపోయినప్పటికీ తమపై ఒత్తిడి ఉంటుందని కార్మికులు చెబుతున్నారు.
''వ్యవస్థలోనే వేగం ఉంది'' అని వాసుదేవన్ చెప్పారు. నిబంధనలు పైకి కనిపించకపోయినప్పటికీ, వేగంగా పనిచేయగలగడం, వినియోగదారుల రేటింగ్స్ తమకొచ్చే ఆర్డర్లను ప్రభావితం చేయగలవని కార్మికులకు తెలుసుని ఆమె అన్నారు.
డెలివరీ వర్కర్లు కూడా మిశ్రమంగా స్పందించారు. దీన్ని కొంతమంది స్వాగతిస్తే, నిజంగా పరిస్థితులను ఇది మెరుగుపరచగలదా అని ఇంకొందరు ప్రశ్నించారు.
ఇలాంటి హామీలు గతంలో ఎలాంటి ఫలితాలనివ్వలేదని తన పేరు మొత్తం చెప్పడానికి ఇష్టపడని సత్‌వీర్ న్యూస్ ఏజెన్సీ పీటీఐతో అన్నారు. టెన్-మినిట్ డెడ్‌లైన్ ఎత్తివేయడం ట్రాఫిక్ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. అయితే కార్మికులకు ఇప్పటికీ మంచి జీతం, పార్కింగ్ సౌకర్యాలు వంటివి నెరవేరలేదని అన్నారు.
ఒక్కో ఆర్డర్‌కు వచ్చే తక్కువ మొత్తం సమస్యకు డెడ్‌లైన్ ఎత్తివేయడం పరిష్కారం చూపదని అఖిలేశ్ కుమార్ చెప్పారు.
ఈ మార్పు ఒత్తిడిని కొంత తగ్గించగలదని కొందరు రైడర్లు చెప్పారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుందని మహేశ్ కమార్ చెప్పగా, కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల భయాన్ని ఇది కాస్త తొలగిస్తుందని రాకేశ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)