చైనా: ‘‘పందులను కోయడానికి సాయం చేయరూ’’ అంటే ట్రాఫిక్ జామ్ అయ్యేంత జనం వచ్చారు

    • రచయిత, స్టీఫెన్ మెక్‌డోనెల్
    • హోదా, చైనా కరస్పాండెంట్, బీజింగ్

చైనీస్ కొత్త ఏడాది ప్రారంభానికి ముందు జరుపుకునే సంప్రదాయ సామూహిక విందుకోసం ఓ రెండు పందులను కోయడం వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికి శక్తిని మించిన పని అవుతుందని దైదై గ్రహించారు.

తన తండ్రిని నిరాశపరచకూడదని ఆమె భావించారు. అందుకే ఆమె సాయం కోసం సామాజిక మాధ్యమాలవైపు చూశారు.

చైనా టిక్‌టాక్ వెర్షన్ అయిన డోయిన్‌లో " నాకెవరైనా సాయం చేయగలరా?" అని గత వారం ఆమె ఓ పోస్ట్ చేశారు.

"నా తండ్రి పెద్దవారైపోయారు, ఆయన ఈ పందులను కోయగలరోలేదోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ పనిలో సాయం చేయడానికి మా ఊరు కింగ్‌ఫుకు వచ్చినవారికి పందిమాంసంతో విందు ఇస్తాను" అని 20ఏళ్లు దాటిన దైదై సోషల్ మీడియాలో రాశారు.

చైనాలోని గ్రామీణ ప్రాంతాలైన సిచువన్, చోంగ్‌కింగ్‌లలో భారీ సామూహిక విందు ఇవ్వడం అక్కడి సంస్కృతిలో భాగం. ఇందులో రెండుసార్లు ఉడికించిన పందిమాంసం, దాని పక్కటెముకలతో చేసిన వంటకం, సూప్, ఇంట్లో తయారు చేసిన మద్యం వంటివి అందిస్తుంటారు.

"మా ఊళ్లో నన్ను తలెత్తుకునేలా చేయండి" అని దైదై తన పోస్టులో కోరారు.

దైదై పోస్టుకు మిలియన్ల కొద్దీ లైక్‌లు, కామెంట్లే కాదు, బయట నుంచి వచ్చిన స్పందన కూడా ఓ ఫీల్-గుడ్ సినిమాలోని దృశ్యాన్ని తలపించింది. ఆమెకు పనిలో సాయం చేసేందుకు వేలాది కార్లలో, లెక్కకుమించిన సంఖ్యలో జనం ఆమె గ్రామానికి క్యూ కట్టారు. దీంతో చైనా నైరుతి దిశలో ఉండే చోంగ్‌కింగ్ ప్రాంతంలోని రోడ్లలో ట్రాఫిక్ జామ్ అయింది.

కింగ్‌ఫు గ్రామానికి దారితీసే, ఇరువైపులా పంటపొలాలతో ఉన్న రోడ్లపై కార్లు బారులు తీరిన దృశ్యం డ్రోన్ ద్వారా తీసిన చిత్రాల్లో కనిపించింది.

తమ ప్రాంతానికి వచ్చే వారంతా తమ గ్రామ రోడ్లపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, ముఖ్యంగా నగరాల నుంచి వచ్చేవారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె మరో పోస్ట్ చేశారు.

"ఇక్కడి వాతావరణం చాలా గొప్పగా ఉంది. ఇది నా కుటుంబం పందులను పెంచే, నా చిన్నప్పటి రోజులను గుర్తు చేసింది. అలాంటి అనుభూతి పొందక నేను చాలా ఏళ్లయింది" అని 100 కిలోమీటర్లకుపైగా దూరం నుంచి ఆ గ్రామానికి చేరుకున్న ఓ వ్యక్తి బీబీసీతో అన్నారు.

ఇక ఈ పందులను కోసే కార్యక్రమం, విందు జరిగినప్పుడు దాన్ని ఆన్‌లైన్‌లో లక్షమందికిపైగా వీక్షించారు. ఈ వీడియోకు 2 కోట్ల లైక్స్ వచ్చాయి. అనూహ్యంగా ఆ ఊరుకు పర్యటకులు పోటెత్తినట్టైంది అని స్థానిక ప్రభుత్వం అభివర్ణించింది.

ఇంత భారీగా తరలివచ్చినవారి కోసం రెండు పందులు మాత్రమే సరిపోని కారణంగా పర్యటక అధికారులు అందిరికీ సరిపడేలా మరిన్ని పందులను బహూకరించారు. అలాగే, అక్కడకు వచ్చేవారికి ఔట్‌డోర్ ప్రాంతంలో ఆహారాన్ని అందించేందుకు కొన్ని రెస్టరెంట్‌లు కూడా సేవలందించాయి.

అయితే ఒక చిన్న విషయం కూడా సోషల్ మీడియా యుగంలో ఎంత త్వరగా పెద్ద విషయమైపోతుందో ఈ ఘటన నిరూపించింది.

"బహుశా పది, పన్నెండుమంది వస్తారనుకున్నా, కానీ లెక్కపెట్టలేనంతమంది వచ్చారు" అని చైనీస్ మీడియాతో అన్నారు దైదై.

చైనా ప్రజలు తమ సమాజపు సాంస్కృతిక కార్యక్రమాలతో అనుసంధానం కావాలనే తపనతో పాటు, కొన్నిసార్లు జీవితం చీకటిమయమైనప్పుడు సానుకూల అనుభవాల అవసరం కూడా ఈ ప్రతిస్పందనకు కారణంగా కనిపిస్తోంది.

దైదై నమ్మలేనంత వేగంగా జరిగిపోయిందిది. గత శుక్రవారం ఆమె సాయం కావాలి అంటూ పోస్ట్ చేశారు. శనివారం నాటికి స్పందన చాలా ఎక్కువగా ఉండటంతో, గ్రామంలో గందరగోళ పరిస్థితి ఏర్పడతుందేమోనని ఆమె పోలీసులను సంప్రదించారు. దీంతో అదనపు అధికారులను మోహరించారు.

అప్పటికే భారీ స్థాయికి చేరుకున్న ఆ విందు వేడుక రెండు రోజుల పాటు కొనసాగింది.

జనవరి 11న వెయ్యి మంది భోజనానికి హాజరుకాగా, మరుసటి రోజు ఆ సంఖ్య 2,000కి పెరిగింది. రాత్రివరకు బాన్‌ఫైర్, బ్యాండ్ మ్యాజిక్‌తో ఘనంగా జరుపుకున్నారు.

చివరికి దైదై తన వేడుక ముగిసిందని పోస్ట్ చేస్తూ, ఇకపై వచ్చే సందర్శకులు తన ఇంటికి రాకుండా ఆ ప్రాంతాన్ని ఆస్వాదించాలని కోరారు. రెండు రోజుల్లో కేవలం నాలుగు గంటలే నిద్రపోయానని, తాను పూర్తిగా అలసిపోయానని ఆమె చెప్పారు.

కానీ ఆమెకు, ఆ గ్రామానికి ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణాలవి.

"మీ ఉత్సాహం, ఆసక్తి లేకపోతే ఇలాంటి విందు జరిగేది కాదు. వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద కుటుంబంలో భాగమైన అనుభూతి కలిగింది. నిజంగా ఎంతో ఆప్యాయంగా, మనసుకు ఉపశమనం కలిగించేలా, అర్థవంతంగా అనిపించింది" అని తన పిలుపుకు స్పందించి వచ్చిన వారిని ఉద్దేశించి ఆమె చెప్పారు.

ఇంత పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరగడానికి అనుమతించినందుకు ఆమె ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆమె గ్రామం ఉన్న హెచువాన్ ప్రాంతంలో, ఈ వేడుకను రెగ్యులర్‌గా జరిగే కార్యక్రమంగా మార్చవచ్చని అంటున్నారు. ఎందుకంటే తమ సంస్కృతికి దూరమై, ఒంటరిగా ఉన్నట్లు అనిపించే ఈ కాలంలో, ప్రజలు నిజమైన ప్రజా సంబంధాలను కోరుకుంటున్నారు.

"ఇక్కడ పొరుగువారు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. ఇవాళ నేను నీ ఇంట్లో పందిని కోయడంలో సాయం చేస్తాను, రేపు నువ్వు నా ఇంటికి వచ్చి అదే విధంగా సాయం చేస్తావు" అని ఒక గ్రామస్తుడు చెప్పినట్టు పీపుల్స్ డైలీ పేర్కొంది.

"మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత మంది ప్రజలు రావడం చూసి ఆయన ఇతర గ్రామస్తుల నుంచి బల్లలు, కుర్చీలు అరువు తెచ్చారు. ఇప్పటిదాకా ఇంతమంది ఎప్పుడూ మా ఇంటికి రాలేదు" అని తన తండ్రి గురించి దైదై ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)