షక్స్‌గామ్ లోయ ఎక్కడుంది? ఇక్కడి చైనా ప్రాజెక్టులను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ లోయతో పాకిస్తాన్‌కు ఉన్న సంబంధం ఏంటి?

    • రచయిత, దిల్‌నవాజ్‌ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

షక్స్‌గామ్ లోయపై తన ప్రాదేశిక వాదనను చైనా పునరుద్ఘాటించింది. ఆ లోయలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తిగా చట్టబద్ధమైనవని తెలిపింది.

భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చిన చైనా ఈ లోయపై ఎలాంటి ప్రశ్నలకూ అవకాశం లేదని తెలిపింది.

ఈ ప్రాంతంలో చైనా కొనసాగిస్తున్న నిర్మాణ కార్యకలాపాలను భారత భూభాగంలో జరుగుతున్నవంటూ జనవరి 9న భారత్ తీవ్రంగా విమర్శించింది. తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు ఉందని చెప్పింది.

షక్స్‌గామ్ లోయలోని 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పాకిస్తాన్1963లో ఓ ఒప్పందం ప్రకారం చైనాకు అప్పగించింది.

అయితే ఈ ఒప్పందాన్ని భారత్ చట్టవిరుద్ధమైనదిగా భావిస్తోందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జనవరి 13న ఒక ప్రకటనలో తెలిపారు.

భారత్ ఏమంటోంది?

"షక్స్‌గామ్ లోయలో జరుగుతున్న ఏ కార్యకలాపాలనూ మేము ఆమోదించబోం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది" అని ఉపేంద్ర ద్వివేది అన్నారు.

"షక్స్‌గామ్ లోయ భారతదేశంలో అంతర్భాగం. 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం అని పిలిచే దానిని మేమెప్పుడూ గుర్తించలేదు. ఈ ఒప్పందం చట్టవిరుద్ధం. ఇది చెల్లదు. భారత్ దానిని పూర్తిగా తిరస్కరిస్తుంది" అని జనవరి 9న విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

"చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించిన భారత భూభాగం గుండా వెళుతుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రం, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతం మొత్తం భారతదేశంలో అంతర్భాగం, విడదీయరాని భాగం" అని రణధీర్ జైస్వాల్ అన్నారు.

"షక్స్‌గామ్ లోయలో యథాతథస్థితిని మార్చడానికి జరిగే ఏ ప్రయత్నాన్నైనా భారత్ వ్యతిరేకిస్తుంది. చైనాకు నిరంతరం నిరసన తెలియజేస్తూనే ఉంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు భారతదేశానికి ఉంది" అని భారత్ తన ప్రకటనలో తెలిపింది.

చైనా ఎదురుదాడులు

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనపై బీజింగ్‌లోని జర్నలిస్టులు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో‌నింగ్‌ను ప్రశ్నించగా, ‘మీరు మాట్లాడుతున్న ప్రాంతం చైనాలో ఒక భాగం’ అని బదులిచ్చారు.

"చైనా తన సొంత భూభాగంలో మౌలిక సదుపాయాలను నిర్మించుకోవడానికి పూర్తిగా చట్టబద్ధమైన హక్కును కలిగి ఉంది. 1960లలో సరిహద్దు ఒప్పందంపై చైనా, పాకిస్తాన్ సంతకం చేశాయి. రెండు దేశాల మధ్య సరిహద్దును గుర్తించాయి. ఇది సార్వభౌమ దేశాలుగా చైనా, పాకిస్తాన్ హక్కు" అని మావో‌నింగ్ అన్నారు.

సీపీఈసీపై భారత్ చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా చైనా ప్రతినిధి మావో ఈ అంశంపై చైనా మునుపటి వైఖరినే పునరుద్ఘాటించారు. స్థానిక సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యమని తెలిపారు.

"చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం, సీపీఈసీ, కశ్మీర్ సమస్యపై చైనా వైఖరిని ప్రభావితం చేయవు. దానిపై చైనా వైఖరి అలాగే ఉంది" అని అన్నారు.

చైనా తరచుగా పదే పదే చెబుతున్న అధికారిక వైఖరి ప్రకారం, "జమ్మూ కశ్మీర్ వివాదం చరిత్రాత్మకమైనది. యూఎన్ చార్టర్, సంబంధిత యూఎన్ భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం న్యాయమైన, శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలి" అని చైనా వాదిస్తోంది.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్ ప్రాంతాలకు సంబంధించి చైనా, పాకిస్తాన్ 1963లో ఒక సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రెండు దేశాల మధ్య అంతకుముందు స్పష్టమైన సరిహద్దు లేదు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సరిహద్దును గుర్తించింది.

ఈ వివాదాస్పద ఒప్పందంలో కశ్మీర్‌పై భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం పరిష్కారమైన తరువాత కశ్మీర్‌పై తుది సార్వభౌమ అధికారం కలిగినప్రభుత్వం అధికారిక సరిహద్దుకు సంబంధించి చైనా ప్రభుత్వంతో తిరిగి చర్చలు జరపవచ్చనే నిబంధన ఉంది.

షక్స్‌గామ్ లోయ ఎక్కడ ఉంది?

షక్స్‌గామ్ లోయ లద్దాఖ్‌లోని ఈశాన్య భాగంలో, సియాచిన్ గ్లేసియర్ ఉత్తరాన ఉన్న కారకోరమ్ శ్రేణికి సమీపంలో ఉన్న ఒక వ్యూహాత్మక ప్రాంతం. ఈ ప్రాంతం జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో అంతర్భాగమని, తమ అధికార పరిధిలో ఉందని భారతదేశం వాదిస్తోంది. భారతదేశ అధికారిక పటం ఈ ప్రాంతాన్ని పైభాగంలో చూపుతోంది.

షక్స్‌గామ్ లోయ భౌగోళిక, చారిత్రక స్వభావం గురించి బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త, సర్వే ఆఫ్ ఇండియా అధికారి కెన్నెత్ మాసన్ ఇచ్చిన వివరణ ఇప్పటికీ ముఖ్యమైనదిగా భావిస్తారు.

1926లో ప్రచురితమైన తన ప్రసిద్ధ నివేదిక 'ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ది షక్స్‌గామ్ వ్యాలీ అండ్ ఆగిల్ రేంజ్స్'లో షక్స్‌గామ్ లోయ, దాని ఎగువ ఉపనది లోయలు సరిహద్దు ప్రాంతంలో "పూర్తిగా అన్వేషణ జరగని చివరి ప్రాంతం" అని మాసన్ రాశారు.

ఈ ప్రాంతం ఉత్తరానికి ప్రవహించే యార్కంద్, దక్షిణానికి ప్రవహించే సింధు నది "మధ్య ఆసియా, భారత ఉపఖండంలోని నీటి వ్యవస్థల మధ్య గొప్ప విభజన" అని తెలిపారు.

దాదాపు వంద సంవత్సరాల నాటి ఈ పుస్తకంలో షక్స్‌గామ్ వంటి మారుమూల ప్రాంతంలో శాశ్వత మానవ స్థిరనివాసాలు దాదాపు అసాధ్యమని, మనిషి ఇక్కడికి చేరుకున్నప్పటికీ, అది కేవలం ఓ దారిలా ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు.

గుర్తించని విశాలమైన పర్వత ప్రాంతం

హిమాలయాలు, కారకోరం ప్రాంతాన్ని అన్వేషించినవారిలో ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించే బ్రిటిష్ పర్వతారోహకుడు, భౌగోళిక శాస్త్రవేత్త ఎరిక్ షిఫ్టన్ 1937లో షక్స్‌గామ్‌పై ఓ నివేదికను ప్రచురించారు

"షక్స్‌గామ్ నది లద్దాఖ్, హుంజా, జిన్‌జియాంగ్‌లకు చెందిన నిర్దుష్టంగా నిర్ణయించని సరిహద్దుల మధ్యలో ఉంది. ఈ ప్రాంతం చాలాకాలంపాటు మ్యాప్‌లలో తెలియని ప్రాంతంగానే ఉంది '' అని ఎరిక్ షిప్టన్ తన నివేదికలో రాశారు.

షక్స్‌గామ్‌ను విస్తారమైన, దాదాపు అజ్ఞాత పర్వత ప్రాంతంగా షిప్టన్ పేర్కొన్నారు.

‘‘ఆసియాటిక్ జలవిభజన భాగానికి ఉత్తరాన ఉన్న ఎత్తైన పర్వతప్రాంతానికి షక్స్‌గామ్ సరిహద్దుగా ఉండి, దాదాపు వెయ్యి చదరపు మైళ్లు విస్తరించిన ఓ అజ్ఞాత ప్రాంతం’’ అని రాశారు.

అలాగే ‘‘అత్యంత ముఖ్యమైన ప్రశ్న జుగ్ షక్స్‌గామ్ నదీ ప్రవాహాన్ని అన్వేషించడం, దాని సంగమ ప్రాంతాన్ని నిర్థరించడమే. గతంలో ఈ ప్రాంతం పూర్తిగా అర్థం కాలేదు’’ అని రాశారు.

ఈ యాత్ర చాలా సవాలుతో కూడుకున్నదని ఎరిక్ షిప్టన్ రాశారు. తన బృందానికి చాలా నెలల పాటు చాలాకాలంపాటు వెలుపలి సాయం అందుబాటులో లేదని తెలిపారు.

"షక్స్‌గామ్ లోయలు లోతైనవి, ఇరుకైనవి. వరదల కాలంలో దాదాపుగా దుర్భేద్యంగా మారతాయి. ఈ ప్రాంతం కొన్ని నెలలు మాత్రమే ప్రయాణించదగినదిగా ఉంటుంది" అని చెప్పారు.

ఈ ప్రాంతం చరిత్రాత్మకంగా ఏ ఒక్క దేశం శాశ్వత పరిపాలనలో లేదని వాదించడానికి భారతదేశం మాసన్, షిప్టన్ రాసిన విషయాలను ఉదహరించింది.

అయితే ఆధునిక అంతర్జాతీయ సరిహద్దులు వలసపాలనా కాలంలోని ప్రయాణ వృత్తాంతాలపై కాకుండా, రాజకీయ, దౌత్యపరమైన ఒప్పందాలపై ఆధారపడి ఉంటాయి.

వ్యూహాత్మకంగా ముఖ్యమైనది

ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. సెంట్రల్ ఆసియా, భారత ఉపఖండం మధ్య ఈ లోయ సహజమైన జలవిభాగినిగా పనిచేస్తోందని కెన్నెత్ మాసన్ రాశారు. ఇక్కడి నుంచి నదులు ఓ పక్క యార్కండ్‌కు మరోపక్క సిందూలోయకు ప్రవహిస్తాయి. ఇదే షక్స్‌గామ్‌ను వ్యూహాత్మకంగా సున్నితమైనదిగా మార్చింది.

ఇప్పడీ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సరిహద్దులపై భౌగోళికంగా పట్టు పెరిగేలా చేయడమే కాక, సియాచిన్, కారకోరమ్, జిన్జియాంగ్ ప్రాంతాల మధ్య సైనిక, రవాణా సదుపాయాలను ప్రభావితం చేయనుంది.

అందుకే భారత్ దీనిని తన సార్వభౌమాధికారానికి సంబంధించిన ప్రశ్నగా భావిస్తోంది. అయితే చైనా దీనిని తన నియంత్రణలో ఉన్న ప్రాంతంలో చట్టబద్ధమైన కార్యకలాపాలుగా చెబుతోంది.

షక్స్‌గామ్ లోయపై వివాదం ఎందుకు ?

పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా దాదాపు 5,180 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని 1963లో చైనాకు అప్పగించిందని భారత్ వాదిస్తోంది. ఈ ప్రాంతం అప్పటికి పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉందని, కాబట్టి ఈ ఒప్పందం చట్టవిరుద్ధమని, చెల్లదని భారత్ ప్రకటించింది.

పాకిస్తాన్‌తో ఒప్పందం తర్వాత ఆ ప్రాంతంపై తమకు నియంత్రణ ఉందని చైనా అంటోంది. మొత్తం ప్రాంతం తమదేనని భారత్ వాదిస్తోంది.

షక్స్‌గామ్ లోయ ప్రాంతాన్ని ప్రస్తుతం చైనా నియంత్రిస్తోంది, ఇక్కడ అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పని చేస్తోంది.

ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ అని పిలిచే ఈ ప్రాంతం సాధారణ పరిపాలనను కూడా చైనా నియంత్రిస్తోంది. జిన్జియాంగ్ వీగర్ అటానమస్ రీజియన్‌లో భాగంగా చైనా దీనిని నిర్వహిస్తోంది. ట్రాన్స్-కారకోరం ట్రాక్ట్ అనేది 1963లో పాకిస్తాన్ చైనాకు అప్పగించిన ప్రాంతం.

ఇటీవలి నివేదికల ప్రకారం, చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కింద ఈ ప్రాంతంలో చైనా కొత్త రోడ్లు, భద్రతా పోస్టులు, మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)